– రష్యాతో చమురు కోనుగోళ్లను సమర్థించిన జైశంకర్
– అమెరికా సుంకాల విధింపులో నైతికత లేదన్న మంత్రి
న్యూదిల్లీ, జూన్ 12: పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాలపై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తాజాగా విమర్శలు గుప్పించారు. రష్యా చమురును కొనుగోలు చేయమని 2022లో అమెరికా భారత్‌ను అభ్యర్థించిందని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల స్థిరీకరణ దిశగా రష్యా చమురు కొనుగోలు చేయాలని యూఎస్ చెప్పిందని అన్నారు. ఫిన్‌లాండ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా తమకు స్థిరమైన సరఫరాదారుగా ఉందని కూడా మంత్రి జైశంకర్ తెలిపారు. యూఎస్ మాత్రం పరస్పర విరుద్ధ విధానాలను అవలంబించిందని అన్నారు. యూఎస్ నిర్ణయాలకు నైతిక ప్రాముఖ్యాన్ని ఆపాదించాల్సిన అవసరం లేదని కూడా అభిప్రాయపడ్డారు. అప్పట్లో అమెరికా భారత్‌ను ప్రత్యేకంగా అభ్యర్థించింది. చమురు మార్కెట్ స్థిరత్వం కోసం రష్యా చమురును కొనుగోలు చేయాలని చెప్పింది. ముడి చమురు ధరల లభ్యత, ధరల ఆధారంగా మేము కొనుగోళ్లు చేస్తాము’ అని మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. రష్యా విషయంలో భారత్ మరీ ఉదారంగా వ్యవహరిస్తూ ముడి చమురు కొనుగోలు చేస్తోందన్న ఒక విలేకరి ఆరోపణపై మంత్రి ఈ మేరకు స్పందించారు. ఆ సమయంలో మార్కెట్‌లో ముడి చమురులో అధిక భాగం రష్యాకు చెందినదేనని అన్నారు. భారత్‌కు ఎంతోకాలంగా ముడి చమురును సరఫరా చేస్తున్న పశ్చిమాసియా దేశాల క్రూడాయిల్ ను ఐరోపా దేశాలు ఎక్కువగా కొనుగోలు చేసేవని చెప్పారు. ఆ పరిస్థితుల్లో తాము తమ దిశను మార్చుకోవాల్సి వచ్చిందని వివరించారు. రష్యా చమురును కొనుగోలు చేస్తున్నామని మొదట సుంకాలు విధించారు. ఆ తరువాత మళ్లీ వాటిని సడలించారు. కాబట్టి, ఇక్కడ ఏదో గొప్ప సైద్దాంతిక ప్రాతిపదిక ఉన్నట్టు భావించకూడదు. ఇది నైతికతకు సంబంధించిన అంశంగా పరిగణించడం అనవసరం అని మంత్రి జైశంకర్ తేల్చి చెప్పారు.ఈ సందర్భంగా రష్యా విషయంలో భారత్ అనుసరిస్తోన్న విధానంపై ఐరోపా దేశాలు చేస్తోన్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. రష్యా చమురు కొంటున్నందుకు తమను ప్రశ్నిస్తోన్న ఆ దేశాలు విక్రయించిన ఆయుధాలతో ప్రత్యర్థులు భారత్‌పై దాడులకు ఉపయోగించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈసందర్భంగా భారత్ దేశ ఇంధన ఎంపికలను ఆయన సమర్థించారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైన దగ్గరినుంచి రష్యాతో భారత్ మరీ సానుకూలంగా వ్యవహరిస్తోందని, ఆ దేశ చమురుపై అతిగా ఆధారపడుతోందని ఈ చర్చలో మంత్రికి ప్రశ్న ఎదురైంది. దానికి మంత్రి సూటిగా బదులిచ్చారు. భారతదేశ ప్రత్యర్థులకు ఐరోపా దేశాలు ఆయుధాలు అమ్మిన విషయాన్ని గుర్తుచేసి, స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. భారత్ తయారుచేసిన ఆయుధాలతో ఏ ఐరోపా దేశం పైనా దాడి జరగలేదు. ఐరోపా ఆయుధాల విషయంలో కూడా నేను అలా చెప్పగలిగితే బాగుండేది. ఐరోపా ఆయుధాలు అమ్మింది. వాటిని భారత్‌పై దాడి చేయడానికి ఉపయోగించారు. ఇప్పుడే కాదు.. కొన్నేళ్లుగా అలా జరుగుతోంది. ఐరోపాను ప్రమాదంలో పడేసే పని ఏదీ భారతీయులు చేయలేదని పేర్కొన్నారు. అలాగే రష్యా చమురు విషయంలో భారత విధానంపై మరోసారి స్పష్టత ఇచ్చారు. ఇక్కడ నేను రెండు విషయాలు గమనించాను. మేం ధర, లభ్యత ఆధారంగా చమురు కొనుగోలు చేస్తాం. ఆవిధంగా చూసుకుంటే.. అప్పుడు మార్కెట్లో లభించే చమురులో అధికభాగం రష్యాకు చెందినదే. మరోవైపు మాకు ఎప్పటినుంచో చమురు సరఫరా చేసే పశ్చిమాసియా నుంచి అప్పుడు ఐరోపా చమురు కొనుగోలు చేసింది. ఈ పరిణామాల ఆధారంగానే మేం నిర్ణయాలు తీసుకున్నాం అని మంత్రి జైశంకర్ వెల్లడించారు. ఆంక్షలు, వాణిజ్యం, ఇంధన భద్రత విషయంలో పశ్చిమదేశాల విధానాలలో ఉన్న వైరుధ్యాలను ప్రశ్నించారు. పక్షపాత ధోరణితో వ్యవహరించడాన్ని ఆయన తప్పుపట్టారు. జాతీయ ప్రయోజనాలు, ఇంధన భద్రత, ఆర్థిక అంశాల ఆధారంగానే భారత ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


