పుస్తక ప్రదర్శన సంస్కృతికి జీవం పోసే వేదిక

– రేప‌టినుంచి 29 వరకు హైదరాబాద్‌లో ప్రదర్శన 

           (డాక్టర్‌ కోమల్ల ఇంద్రసేనారెడ్డి, లైబ్రేరియన్‌, కిట్స్‌, వరంగల్‌)

సమాజాభివృద్ధికి, వ్యక్తిత్వ వికాసానికి పుస్తకాలు ఎంతో కీలకం. ఆధునిక యుగంలో డిజిటల్‌ ప్రపంచం వేగంగా విస్తరిస్తున్నప్పటికీ పుస్తకాల విలువ మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో పుస్తక ప్రదర్శనలు మరింత ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. మన దేశంలో సాహిత్యాన్ని, సంస్కృతిని, పుస్తకాల పట్ల ప్రేమను ప్రతిబింబించే అద్భుతమైన వేదికల్లో హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ ఒకటి. ప్రతి సంవత్సరం పుస్తకాభిమానులు ఆసక్తిగా ఎదురుచూసే ఈ మహోత్సవం ఈనెల 19 నుండి 29వ తేదీ వరకు హైదరాబాద్‌ ఎన్‌టీఆర్‌ స్టేడియంలో మరింత ప్రత్యేకంగా జరుగనుంది.

పుస్తక ప్రేమికులకు ప్రేరణ

హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌.. పుస్తకాలను ప్రేమించే ప్రతి మనిషికి ఒక ప్రేరణ. పుస్తకాలు మనిషిని మార్చగల శక్తి కలిగి ఉన్నాయి. అలాంటి పుస్తకాల సముద్రం 11 రోజులు హైదరాబాద్‌ను ప్రకాశవంతం చేయనున్నది. ఈ ప్రదర్శనతో పఠన సంస్కృతి బలపడుతుంది. పిల్లల్లో కొత్త ఆలోచనలు మొలకేస్తాయి. సమాజంలో విజ్ఞానవృద్ధి జరుగుతుంది. కొత్త రచయితలకు వేదిక లభిస్తుంది. ప్రతి సాయంత్రం జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు బుక్‌ ఫెయిర్‌ను ఒక సాహిత్య-సాంస్కృతిక జాతరగా మార్చేస్తాయి. సంగీతం, నృత్యం, నాటకాలు, సాహిత్య ప్రదర్శనలు సందర్శకులను మరింత ఆకట్టుకుంటాయి. బుక్‌ ఫెయిర్‌ అంటే కేవలం పుస్తకాలు కొనుగోలు చేసే స్థలమే కాదు అది అభ్యాసం, ఆలోచన, సృజనాత్మకత, సంభాషణల సంగమం. కోట్లాది అక్షరాలు, వందలాది కథలు, వేలాది కొత్త భావనలు ఈ ప్రదర్శనలో సాహిత్య ప్రియులను పలకరిస్తాయి. 2025 బుక్‌ ఫెయిర్‌లో 250-300కిపైగా స్టాల్స్‌, పాఠ్య పుస్తకాల నుంచి నవలలు, సాహిత్యం, పిల్లల పుస్తకాలు, విజ్ఞాన-సాంకేతిక గ్రంథాలు, అరుదైన పుస్తకాలు వరకు అన్నీ ఒకేచోట లభించనున్నాయి. ఇది చదువరులకు, విద్యార్థులకు, పరిశోధకులకు ఒక జ్ఞానోత్సవం. బుక్‌ ఫెయిర్‌ ప్రత్యేకతల్లో ఒకటి పాఠకులు తమ అభిమాన రచయితలను ప్రత్యక్షంగా కలిసే అవకాశం. పుస్తక ప్రదర్శనలో అనేకమంది ప్రసిద్ధ రచయితలు, కవులు, విమర్శకులు, ప్రచురణకర్తలు పాల్గొంటున్నారు. పుస్తక విమోచనాలు, సాహిత్య చర్చలు, కథా వేదికలు, కవితా వేదికలు వంటి కార్యక్రమాలు కొత్త ఆలోచనలకు మార్గం చూపిస్తాయి. పిల్లలకు జ్ఞానం-ఆట-సృజనాత్మకత పిల్లల్లో కల్పనాశక్తిని, పఠనాభిరుచిని పెంచుతాయి. బుక్‌ ఫెయిర్‌లో తగ్గింపు ధరల అవకాశంతో పాఠకులు తమ ప్రియమైన పుస్తకాలను తక్కువ ధరల్లో కొనుగోలు చేస్తారు. బుక్‌ ఫెయిర్‌కు కుటుంబాలుగా వెళ్లి పుస్తకాల ప్రపంచాన్ని అనుభవించడం, కొత్త విషయాలు తెలుసుకోవడం, రాబోయే తరాలకు పుస్తక పఠనంపై ప్రేమ పెంచడం వంటి ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. పుస్తకాలు మనల్ని మనం తెలుసుకునేలా చేస్తాయి. అవే అసలైన గురువులు.

పిల్లల విభాగానిది కీలక పాత్ర

పుస్తక ప్రేమ చిన్నప్పుడే పుడుతుంది. అందుకే బుక్‌ ఫెయిర్‌లో పిల్లల విభాగం ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. కథా విందులు, శ్రావ్య-దృశ్య పని గృహాలు, పిల్లల రచనా కార్యక్రమాలు.. ఇవన్నీ కొత్త తరానికి చదువు ప్రేమను సంక్రమింపజేస్తున్నాయి. సమాజ భవిష్యత్తులో ఎలా మారుతుందో పుస్తకాలు చదివే పిల్లలే నిర్ణయిస్తారు. ఒకేచోట వేలాది పుస్తకాలు, వందలాది ప్రచురణకర్తలు, వివిధ రకాల సాహిత్యాలు, రచయితలతో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశాలు ఇవన్నీ పుస్తక ప్రదర్శనల్లో మాత్రమే లభిస్తాయి. విలువైన పుస్తకాల ప్రపంచాన్ని మరింతమందికి చేరవేసే పుస్తక ప్రదర్శనలను మనం ఆదరించాలి.. ప్రోత్సహించాలి. సరైన పోషణ లేనప్పుడు ఏ విధంగా దేహంలో విటమిన్ల, హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని అనారోగ్యానికి గురవుతుంటామో అలాగే గ్రంథ పఠనం ద్వారా మంచి ఆలోచనలను నిత్యం అందించకపోతే మనసు కూడా క్రమేణా మనకు తెలియకుండానే బలహీనమవుతూ ఉంటుంది అనారోగ్యానికి గురవుతుంది. గ్రంథ పఠనం మానసిక ఆరోగ్యానికి బాగా ఉపయోగపడే అత్యుత్తమ ప్రక్రియ, ఆలోచనపరుడైన మనిషిగా తీర్చిదిద్దడంలో పుస్తకాలది అద్భుత పాత్ర, మనిషి అంటేనే మనసు ఉన్నవాడు. మనసు అంటే మననం ద్వారా విషయాన్ని అర్థం చేసుకునేది. ఆ మానవ శీలతే లేనప్పుడు మనం మనిషి అన్న నిర్వచనానికే తగం. కాబట్టి ప్రతి ఒక్కరికీ పుస్తకం చదవడం అనే అభ్యాసం తప్పక ఉండాలి. పుస్తక పఠనం వల్ల వ్యక్తిత్వం వికసిస్తుంది, ఏకాగ్రత పెరుగుతుంది, ఆనందం అధికమవుతుంది. జ్ఞానం పెరుగుతున్న కొద్దీ ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది, సమస్య పరిష్కార సామర్థ్యం మెరుగవుతుంది, సరస్వతి కటాక్షంతో లక్ష్మీ కటాక్షం సులభం అవుతుంది. సామాజిక మాధ్యమాల వినియోగాన్ని కాస్త తగ్గించి మనమందరం పుస్తకాలతో స్నేహం చేయడం నేర్చుకోవాలి. పుస్తకమే మనిషికి మంచి నేస్తం. కాబట్టి ఈ నెల 19 నుంచి నిర్వహిస్తున్న 38వ పుస్తక ప్రదర్శనను ప్రతి పాఠకుడు సందర్శించాలి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page