– దిగ్గజ కంపెనీలను ఆకర్షించేలా ‘ఎకో సిస్టం’ అభివృద్ధి
– సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 20 : గ్లోబల్ టెక్- ట్రావెల్ క్లస్టర్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేలా ఈ రంగంలో దిగ్గజ కంపెనీలను ఆకర్షించేలా ఒక పటిష్ఠమైన ఎకో సిస్టంను అభివృద్ధి చేస్తున్నామన్నారు. హైటెక్ సిటీలో అమెరికాకు చెందిన ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను ఆయన బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ విమానయానం, స్పేస్-టెక్, డిఫెన్స్, డీప్-టెక్ తదితర రంగాల్లో హైదరాబాద్ ఒక వ్యూహాత్మక కేంద్రంగా ఎదుగుతోందని వివరించారు. గత రెండేళ్ల వ్యవధిలో వ్యాన్‌గార్డ్, మారియట్ ఇంటర్నేషనల్, హెచ్‌సీఏ హెల్త్ కేర్, హార్ట్‌ఫోర్డ్, బీఏఎసఎఫ్ తదితర ఎన్నో దిగ్గజ సంస్థలు హైదరాబాద్‌ను తమ గమ్యస్థానంగా ఎంచుకున్నాయన్నారు. తాజాగా ఈ జాబితాలో సౌత్ వెస్ట్ ఎయిర్స్ లైన్స్ కూడా చేరడం మనకు గర్వకారణమన్నారు. హైదరాబాద్ ఇన్నోవేషన్ ఎకో సిస్టంను మరింత బలోపేతం చేసేలా నేటి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ‘రెడీ టు వర్క్‌ఫోర్స్’ తయారీపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. ఆర్ అండ్ డీ, స్కిల్లింగ్, ఇన్నోవేషన్ తదితర అంశాల్లో దిగ్గజ సంస్థలతో కలిసి పనిచేసేందుకు ప్రత్యేక కాంప్రహెన్సివ్ రోడ్డు మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నామన్నారు. తాజాగా ప్రారంభమైన ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ ‘సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స’కు ఒక స్ట్రాటజిక్ హబ్ గా పనిచేయనుంది. కంపెనీ గ్లోబల్ నెట్ వర్క్, సపోర్టింగ్ టెక్నాలజీ, ఇంజినీరింగ్, ఎంటర్ ప్రైజ్ కేపబిలిటీస్ తదితర అంశాల్లో కీలక సేవలు అందించనుంది. డీప్ టెక్, ఏఐ/ఎంఎల్, డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, డిజిటల్ ఇంజినీరింగ్, సైబర్ సెక్యూరిటీ, ఎంటర్‌ప్రైజ్ ప్లాట్‌ఫామ్స్ తదితర విభాగాల్లో నిపుణులైన వేయిమందికి ఉపాధి లభించనుంది. విమానయాన రంగంలో హైదరాబాద్ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తం కానుంది అని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. కార్యక్రమంలో సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ వైస్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ లారెన్ వుడ్స్, వైస్ ప్రెసిడెంట్ అండ్ గ్లోబల్ హెడ్ ఆఫ్ ఇన్నోవేషన్, ఇండియా కృష్ణ కల్లెపల్లి, ఐటీ అడ్వైజర్ సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



