– ఫాల్తుగాళ్ల ప్రచారాన్ని పట్టించుకోను
– నా కొడుకుపై ఆరోపణలు వస్తే పోలీసులకు అప్పగించా
– నా శవంపై కాషాయ జెండా కప్పాలి
– అదే నా చివరి కోరిక
– కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 20 :ఉరి శిక్ష వేసే ముందు మీ చివరి కోరిక ఏమిటని బీజేపీలో కమిట్‌మెంట్‌తో పనిచేసే ఏ కార్యకర్తను అడిగినా వారు చెప్పేది ఒక్కటే..నేను చచ్చిపోయాక నా శవంపై కాషాయ జెండా కప్పాలి అని. నా చివరి కోరిక కూడా అదే అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. బండి సంజయ్ కొత్త పార్టీ పెడుతున్నారంటూ కొందరు ఫాల్తుగాళ్లు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వాటికి స్పందించాల్సిన అవసరమే లేదని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి బుధవారం ఆయన రాగా సమాచారం అందుకున్న కార్యకర్తలు భారీగా కార్యాలయానికి తరలివచ్చారు. బీజేపీ జిందాబాద్.. మోదీ జిందాబాద్.. బండి సంజయ్ జిందాబాద్.. రామచంద్రరావు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. సంజయ్ ఆప్ సంఘర్ష్ కరో.. హమ్ తుమ్హారే సాథ్ హై అంటూ నినదించారు. అనంతరం సంజయ్‌ను కలిసి సంఘీభావం ప్రకటిస్తూ సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. దాదాపు రెండు గంటలపాటు కార్యకర్తలతో గడిపిన సంజయ్ అనంతరం ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, సీనియర్ నేత డాక్టర్ మనోహర్ రెడ్డి, ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ తదితరులతో కలిసి మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు.
ప్రశ్న : మీరు కొత్త పార్టీ పెట్టబోతున్నారని వార్తలొస్తున్నాయి కదా?
జవాబు : బండి సంజయ్ అంటే ఏమిటో మీకు తెలుసు. రాష్ట్ర ప్రజలకు తెలుసు. కార్యకర్తలందరికీ తెలుసు. ఫాల్తుగాళ్లు చేసే ప్రచారానికి స్పందించాల్సిన అవసరమే లేదు. బీజేపీ అంతర్గత శిక్షణ శిబిరాల్లో ఎంతోమంది కార్యకర్తలను తయారు చేసిన వ్యక్తులం మేం. ఎవరికైనా ఉరి తీయబోయే ముందు చివరి కోరిక అడుగుతారు. బీజేపీలో కమిట్‌మెంట్ ఉన్న కార్యకర్తలను ఇదే విషయాన్ని అడిగితే చెప్పేది ఒక్కటే. ‘నేను చచ్చిపోయాక నా శవంపై కాషాయ జెండా కప్పాలి అని. నాదీ అదే చివరి కోరిక.
ప్రశ్న : మిమ్మల్ని కేబినెట్ నుండి బర్తరఫ్ చేయబోతున్నారని కొన్ని టీవీలు, డిజిటల్ మీడియాలో వార్తలొస్తున్నాయి కదా?
జవాబు : తెలంగాణలో బీఆర్ఎస్‌కు 17 ఎంపీ సీట్లున్నాయి కదా.. దాని భాగస్వామ్యంతోనే కేంద్రంలోని ఎన్డీయే నడుస్తోంది కదా.. బహుశా నన్ను బర్తరఫ్ చేయాలనే నిర్ణయం కేసీఆర్, ఆయన కొడుకే తీసుకున్నట్లున్నారు. ఇంకా ఏమేం చేయబోతున్నారో వాళ్లనే అడగండి(కేసీఆర్, కేటీఆర్‌లపై సెటైర్)
ప్రశ్న: మిమ్మల్ని త్వరలోనే అరెస్టు చేయబోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి.
జవాబు : కేసీఆర్ కొడుకు విసిరే చిల్లర మెతుకులకు ఆశపడి ఒకట్రెండు ఛానళ్లు ఇలాంటి కథలను ప్రసారం చేస్తున్నాయి. అది చూసి కేసీఆర్ కొడుకు రాక్షసానందం పొందుతున్నడు. వాళ్ల దృష్టితో చూస్తే నన్ను అరెస్టు చేయాల్సిందేమో. ఎందుకంటే పదేళ్ల బీఆరఎస్ గడీల పాలనను బద్దలు కొట్టినం కదా.. పదేళ్ల కేసీఆర్ కుటుంబ అవినీతి అరాచక పాలనను బొందపెట్టినం.. అధికారం పోయిందనే కోపం వాళ్లకుంటది కదా.. అందుకే నన్ను అరెస్టు చేయించాలని చూస్తున్నరేమో.
ప్రశ్న: భగీరథ్ విషయంలో మీరు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరెస్టు కాకుండా జాప్యం చేశారనే ఆరోపణలున్నాయి..
జవాబు : అది కోర్టు పరిధిలో ఉంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి. కన్న కొడుకును ఒక తండ్రి నేరుగా పోలీసులకు అప్పగించిన సందర్భం ఉందా. నేనే మా అబ్బాయిని పోలీసు విచారణ కోసం అప్పగించా. నేను ప్రజల మధ్య ఉన్నాను కాబట్టే.. ప్రజలు బీజేపీతో ఉన్నారు కాబట్టే నన్ను, నా పార్టీని బదనాం చేసేందుకు కేసీఆర్ కొడుకు సోషల్ మీడియాలో ఫేక్ మీడియా ఫ్యాక్టరీ ద్వారా నాపై ఇలాంటి విష ప్రచారం చేయిస్తున్నాడు. ఎన్ని వండి వార్చినా జనం బీజేపీతోనే ఉన్నారు. ఫేక్ వార్తలను, ఫేక్ స్టోరీలను చూసి జనం నవ్వుకుంటున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



