చరిత్రలో పునరావృతమవుతున్న అత్యంత విషాదకరమైన సంఘటన యుద్ధం. నాగరికత అభివృద్ధి చెందింది, శాస్త్రసాంకేతిక రంగం ఊహించని ఎత్తులకు చేరుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంతరిక్ష పరిశోధనలు, జన్యు విజ్ఞానం, సమాచార విప్లవం– దాదాపు ప్రతి రంగంలోనూ మనుషులు మునుపెన్నడూ లేనన్ని అపూర్వ విజయాలు సాధించారు. అయినా యుద్ధాన్ని మాత్రం ఆపలేక పోయారు. శాస్త్రం మనిషి జీవితాన్ని సులభతరం చెయ్యడంతో పాటు వినాశనానికి సాధనంగా కూడా మారింది. అణ్వాయుధాల నుంచి డ్రోన్ దాడుల వరకూ, సైబర్ దాడుల నుంచి సమాచార యుద్ధాల వరకూ “యుద్ధం” రూపం మాత్రమే మారింది, దాని స్వభావం మాత్రం మారలేదు. శాస్త్రవేత్తలు మానవాళి శ్రేయస్సు కోసం శ్రమకోర్చి సాధించిన విజయాలను వినాశనానికి వాడుతున్న మూర్ఖపు తరం బహుశా మనదే కావొచ్చు! మరి ఇంత మేధస్సు, విజ్ఞానం, నాగరికత, పురోగతి, వ్యవస్థలు- ఇవన్నీ యుద్ధాన్ని ఎందుకు ఆపలేకపోతున్నాయనేది ఇటీవలి ప్రపంచపు పోకడలు చూస్తున్న వారందరినీ కలచివేస్తున్న ప్రశ్న.
నేటి యుద్ధం కేవలం సరిహద్దుల్లో జరిగే పోరాటం కాదు, అది మన ఇంటి వరకూ వచ్చేసింది, మనుషుల మెదళ్ళలో లోతంటా పాకిపోయింది. ఒకప్పుడు కత్తులూ, తుపాకులు లాంటివి దీని ఆయుధాలైతే, నేడు మీడియా, సోషల్ మీడియా, అల్గారిథమ్‌లు, తప్పుడు సమాచారం, ద్వేషప్రచారం, డీప్‌ఫేక్ వీడియోలు యుద్ధానికి ఆయుధాలుగా మారాయి. నిజానికి యుద్ధం ప్రారంభం కావడానికి ముందే ప్రజల మనసుల్లో ‘శత్రువు’కు రూపకల్పన చేసే ప్రక్రియ మొదలవుతుంది.
ఈ సమస్యను అర్థంచేసుకోవాలనే ప్రయత్నంలో శతాబ్దం క్రితమే ఇద్దరు మహామేధావులు, భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్, మానసిక విశ్లేషణా శాస్త్ర పితామహుడుగా పేరొందిన సిగ్మండ్ ఫ్రాయిడ్ ఉత్తరప్రత్యుత్తరాల ద్వారా ఒక గొప్ప సంభాషణకు శ్రీకారం చుట్టారు. ఈ సంభాషణ ఫలితంగా పుట్టిన రచనే “Why War?”. ఇది యుద్ధానికి రాజకీయ కారణాలను మాత్రమే కాక, మానవ మస్తిష్కపు లోతుల్లో దాగి ఉన్న భావోద్వేగ, జీవశాస్త్ర సంబంధిత మూలాలను కూడా పరిశీలిస్తుంది. అసలు మానవాళికి శాశ్వతశాంతి సాధ్యమేనా? మానవుడిలోని విధ్వంసక ప్రవృత్తి సహజమైనదా, చట్టాలు, న్యాయవ్యవస్థలు మాత్రమే యుద్ధాన్ని అరికట్టగలవా? ఇటువంటి ప్రశ్నలను ఈ సంభాషణ లోతుగా చర్చిస్తుంది.
యుద్ధం గురించి ఐన్స్టీన్, ఫ్రాయిడ్ ల అభిప్రాయాల్లో ముఖ్యమైన తేడా వారి దృష్టికోణంలో కనబడుతుంది. ఐన్స్టీన్ ఈ సమస్యను రాజకీయ, వ్యవస్థాగతకోణంలో చూస్తే, ఫ్రాయిడ్ సైకో ఎనాలిసిస్, బయాలజీ తాలూకు సహజ ప్రేరణల పరిధిలో చూస్తారు. ఈ సంభాషణ “యుద్ధంనుండి మానవజాతి ఎలా విముక్తి పొందుతుంది?” అని ఐన్స్టీన్ వేసిన ప్రాథమిక ప్రశ్నతో మొదలవుతుంది. దానికి ప్రతిస్పందనగా ఫ్రాయిడ్ సంభాషణ సహజంగానే మానవస్వభావంలోని జీవసంబంధ ప్రేరణలవైపు మళ్ళుతుంది. ఆయన దృష్టిలో యుద్ధం రాజకీయాల్లో మొదలవదు, అది ముందుగా మనిషి మనసులో మొదలవుతుంది.
ప్రపంచశాంతికి ప్రధాన అడ్డంకి దేశాల సార్వభౌమాధికారం అని ఐన్స్టీన్ భావిస్తారు. యుద్ధం రాజకీయ, చట్టపరమైన వ్యవస్థల వైఫల్యాల ఫలితమని ఐన్స్టీన్ అభిప్రాయపడడంలో కొత్తేమీలేదు కానీ, దేశాలమధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించడానికి ఒక అంతర్జాతీయ శాసన, న్యాయవ్యవస్థ అవసరమని ఆయన సూచించడం గమనార్హం. ఆయన సూచనల్లో, దేశాలు తమ సార్వభౌమాధికారంలో కొంతభాగాన్ని స్వచ్ఛందంగా అంతర్జాతీయ అధికారసంస్థకు అప్పగించాలి. అంతర్జాతీయ న్యాయస్థానానికి తీర్పులు అమలు చేసే అధికారమూ ఉండాలి. ఈ పుస్తకం 1933లో ప్రచురించారు, ఆసరికే మొదటి ప్రపంచయుద్ధం ముగిసి, రెండవ ప్రపంచయుద్ధ కాలంలో ఉన్నాం. ఈ ఆలోచనలు 1945లో ఐక్యరాజ్యసమితి ఆవిర్భావానికి దోహదపడ్డాయనిపిస్తుంది.
ప్రస్తుత ప్రపంచపు యుద్ధోన్మాదాన్ని చూస్తున్నప్పుడు, నాకు ఫ్రాయిడ్ విశ్లేషణ మీద మరింత ఆసక్తి కలిగింది. ఆయన ఒకవైపు అధికార కేంద్రీకరణ అవసరమంటూనే మానవుడి అంతర్గత సహజ ప్రేరణలవైపు దృష్టి సారిస్తారు. ఫ్రాయిడ్ ప్రకారం మనిషిని రెండు ప్రాథమిక సహజ ప్రేరణలు నడిపిస్తాయి. 1. ఈరోస్ (Eros Instinct) జీవసంరక్షణ, ఐక్యతల వైపు నడిపేది. 2. థానాటోస్ (Death Instinct) విధ్వంసం, నాశనం వైపు నడిపేది. అన్నట్లు మార్వెల్ సృష్టించిన ప్రతినాయకుడు ‘థానోస్’ పేరుకి దీన్నుంచే వచ్చింది. ఈ విధ్వంసక ప్రేరణ యొక్క సహజ వ్యక్తీకరణ కాబట్టి మనిషిలో హింసాత్మక ప్రవృత్తిని సమూలంగా తొలగించడం అసాధ్యమని ఫ్రాయిడ్ వాదన. ఫ్రాయిడ్ “మిశ్రమ లోహం”తో పోల్చే ఈ రెండు ప్రేరణలూ ఎప్పుడూ కలిసే పనిచేస్తాయి, అవి విడివిడిగా కనిపించడం బహు అరుదు. మనిషి చేసే ప్రతిచర్యలోనూ ఇవి రెండూ వివిధ నిష్పత్తుల్లో కలిసుంటాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి తననుతాను రక్షించుకోవడం (ఈరోస్) కోసం మరొకరిపై తప్పనిసరిగా దాడి చేయాల్సి రావచ్చు. అక్కడ జీవరక్షణ ప్రేరణ విజయవంతం కావాలంటే విధ్వంసక ప్రేరణ కూడా పనిచేస్తుంది. ఒకదేశం ప్రజలను యుద్ధానికి ప్రేరేపించినప్పుడు కొన్ని ఉన్నతమైన ఆదర్శాలతో బాటు క్రూరమైన ఉద్దేశ్యాలు కూడా ఉంటాయి. అందువల్ల ప్రజలు యుద్ధాన్ని అంగీకరిస్తారు.
కానీ కేవలం ఒక పాలకవర్గమో లేదా యుద్ధంవల్ల లాభపడే సంస్థలో కోట్లాది ప్రజలను యుద్ధానికీ, తద్వారా ఆత్మార్పణకు ఎలా ప్రేరేపించగలుగుతున్నారు? అని ఆలోచిస్తే, ఈ వర్గం ఆధీనంలో కొన్ని ముఖ్యమైన సాధనాలు ఉండడం గమనిస్తాం. విద్యావ్యవస్థ, వార్తాపత్రికలు, మీడియా, మతసంస్థలు- ఇవన్నీ ప్రజల భావోద్వేగాలను నియంత్రించడానికి వారెన్నుకునే సాధనాలని ఐన్స్టీన్ అభిప్రాయం. పాలకవర్గంతో బాటు ఆయుధాల తయారీ, ఆయుధాల విక్రయం, ఆర్థికలాభాలు, వ్యక్తిగత అధికార విస్తరణలాంటి స్వప్రయోజనాల కోసం పనిచేసే ఇతరత్రా సంస్థలు కూడా ఇందులో భాగంగా ఉంటాయి. కానీ ఫ్రాయిడ్ ప్రకారం ప్రభుత్వాలు ప్రజలను సులభంగా ప్రభావితం చేయగలగడానికి కారణం వారి ప్రచారనైపుణ్యం మాత్రమేకాదు, అప్పటికే ప్రతిమనిషిలోనూ అంతర్గతంగా “విధ్వంసం పట్ల ఉండే సహజమైన ఆకర్షణ.” అంటే, ప్రజలను కేవలం మోసం చేయడం వల్ల మాత్రమే యుద్ధం జరగదు. మనిషి అంతరంగంలో ఉన్న ద్వేషం, విధ్వంసక ప్రేరణ అప్పటికే యుద్ధాన్ని కోరుకునేవారి ప్రయత్నాలకు, తనవంతు సాయమందిస్తూ, అగ్నికి ఆజ్యంపోస్తుంది. ఈవిధంగా మనిషిలో అప్పటికే ఉన్న హింసాప్రవృత్తిని పాలకవర్గం తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటుంది. నిజానికి యుద్ధంలో చనిపోయేది సాధారణప్రజలే అయినా, వారే యుద్ధానికి ఎందుకు మద్దతు ఇస్తారు అంటే, యుద్ధాన్ని ప్రోత్సహించేవారు ఆ పని నేరుగా చేయరు. “దేశరక్షణ కోసం”, “జాతిగౌరవం కోసం” అనే నినాదాలతో ప్రజలను నమ్మిస్తారు, సైనికులు కూడా తాము ఉన్నతమైన లక్ష్యంకోసం పోరాడుతున్నామని విశ్వసించేలా చేస్తారు.
ఈ విశ్లేషణ నేటి ప్రపంచ రాజకీయాలకు సరిగ్గా సరిపోతుంది. నేడు సోషల్ మీడియా అల్గారిథమ్ లు మనకు కోపం తెప్పించేవో లేదా భయపడే, ద్వేషించే విషయాలనో ఎక్కువగా చూపిస్తాయి. ఎందుకంటే అటువంటి భావోద్వేగాలు మాత్రమే ఎక్కువ స్పందనను, వ్యాపార లాభాల్నీ తీసుకొస్తాయి. సరిగ్గా ఎన్నికల సమయంలో తప్పుడు ప్రచారాలు, జాతీయత పేరిట విద్వేషాలు రెచ్చగొట్టడం, కులమత విభజనలు- ఇవన్నీ ప్రస్తుత ప్రపంచంలోని అనేక ప్రజాస్వామ్యాల్లో కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా యుద్ధం జరగక ముందే ప్రజల మనస్సుల్లో “శత్రువు” అనే భావనను నిర్మించే ప్రక్రియ, మునుపెన్నడూ లేనంతగా ఇప్పుడు డిజిటల్ వేదికల ద్వారా మరింత వేగంగా జరుగుతోంది. ప్రస్తుత ప్రపంచంలోని భౌగోళిక ఉద్రిక్తతలు, అణ్వాయుధాల విస్తరణ, ఆర్థిక ఆంక్షలు, వలసదారులపై దాడులు, సైబర్ యుద్ధాలు- ఇవన్నీ ఐన్స్టీన్ చెప్పిన అధికార రాజకీయాలకు ఉదాహరణలు. ఐడెంటిటీ పాలిటిక్స్, సామాజిక మాధ్యమాల్లో వ్యాపించే ద్వేష సంస్కృతి ఫ్రాయిడ్ చెప్పిన విధ్వంసక సహజ ప్రేరణకు ఉదాహరణలుగా కనిపిస్తాయి.
ఫ్రాయిడ్ విధ్వంసక ప్రేరణను పూర్తిగా తొలగించడం అసాధ్యం కనుక, దానిని ఇతరమార్గాలకు మళ్ళించాలని భావిస్తారు. వ్యక్తి తనలోని ‘థానటోస్’ అనే ఆత్మవిధ్వంసక శక్తిని ఇతరులపైకి మళ్ళించడం ద్వారా తననుతాను కాపాడుకుంటాడు. అందుకే ఫ్రాయిడ్ ‘థానటోస్’కి వ్యతిరేకంగా పనిచేసే ‘ఈరోస్’ను బలపరిచి ప్రజలమధ్య భావోద్వేగ సత్సంబంధాలను, సాంస్కృతిక అభివృద్ధిని, ఉమ్మడి ప్రయోజనాలను, పరస్పర గుర్తింపును, సామజికభావననూ బలపరచాలంటారు. సంస్కృతి అభివృద్ధి చెందేకొద్దీ మేధస్సు బలపడుతుంది, మనిషిలోని హింసాత్మక ప్రవృత్తి బయటపడకుండా దానిని అంతర్గతంగా నియంత్రించే సామర్థ్యం పెరుగుతుంది. మనుషులు కేవలం కోపంతోనో, ద్వేషంతోనో కాకుండా వివేకంతో ఆలోచించడం నేర్చుకుంటారు. మునుపు ఇతరులపైన ప్రయోగించే విధ్వంసకశక్తి ఇప్పుడు వ్యక్తి అంతరంగంలోకి ఇంకుతుంది, అది హేతుబద్ధమైన తర్కంతో మొదలై మనస్సాక్షి, వివేకం ద్వారా నియంత్రించబడుతుంది. ఒకసారి మనిషి ఆ ఉన్నతమైన సాంస్కృతికస్థాయికి చేరుకున్నాక యుద్ధం అతనికి కేవలం నైతికంగా తప్పు మాత్రమేకాదు, మానసికంగానూ, శారీరకంగానూ అసహ్యంగా అనిపిస్తుంది. [War becomes physically and psychically intolerable.] ఫ్రాయిడ్ ప్రకారం “సంస్కృతి అభివృద్ధి చెందే ప్రతిఅంశం యుద్ధానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది.” అంటే, విద్య, కళలు, సాహిత్యం, విజ్ఞానం, మానవసంబంధాలు, ఉమ్మడిప్రయోజనాలు, ఇవన్నీ పరోక్షంగా శాంతిని బలపరుస్తాయి. “ఈరోస్” అనే పదాన్ని ఫ్రాయిడ్ కేవలం లైంగిక అర్థంలో ఉపయోగించలేదు, ప్లేటో నిర్వచనంలోనే మాట్లాడతారు. మనుషుల్ని ఐక్యతతో కలిపే, సమాజాన్ని నిర్మించే శక్తుల సమాహారమే ‘ఈరోస్’.
ఐన్స్టీన్ మనిషి ప్రవర్తనను బాహ్యంగా చట్టవ్యవస్థ ద్వారా నియంత్రించాలంటారు. ఫ్రాయిడ్ అసలు సమస్య మన బయోలజీలోనే ఉంది కాబట్టి, దానికి పరిష్కారం దీర్ఘకాలిక సాంస్కృతిక, మానసిక పరిణామం ద్వారానే సాధ్యమని విశ్వసిస్తారు. సరిగ్గా ఇక్కడే సరైనవిద్య, స్వతంత్రంగా ఆలోచించగల ఉన్నత మేధావులవర్గం అవసరమవుతాయి. ఫ్రాయిడ్ ప్రకారం ఈ వర్గానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. సత్యాన్వేషణ, అధికారవర్గాల బెదిరింపులకు లొంగకపోవడం, ప్రచారానికి మోసపోకపోవడం, భావోద్వేగాల కంటే వివేకానికి ప్రాధాన్యతనివ్వడం, సగటుప్రజలకు మార్గదర్శకులుగా నిలబడడం. ప్రజలలో చాలామంది స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం కంటే అధికారాన్ని గుడ్డిగా అనుసరించడానికే అలవాటు పడతారని ఫ్రాయిడ్ భావన. అందువల్ల సమాజానికి నైతిక, మేధోపరమైన నాయకత్వాన్ని అందించడం ఈ వర్గం బాధ్యత. ఫ్రాయిడ్ దృష్టిలో విధ్వంసకప్రేరణను నియంత్రించడం ఏ ఒక్కరోజులోనో జరిగేపని అస్సలుకాదు. ఇది మానవ నాగరికతతో పాటు కాలక్రమేణా నెమ్మదిగా జరిగే పరిణామం.
అంత గొప్ప శాస్త్రవేత్త ఐన్స్టీన్, భౌతికశాస్త్రం తనకు ప్రకృతినియమాలను అర్థం చేసుకునేశక్తిని ఇచ్చింది, కానీ “మనిషి భావోద్వేగాల చీకటి ప్రదేశాలను అర్థం చేసుకునే సామర్థ్యం నాకులేద”ని తన పరిమితిని వినయంగా అంగీకరిస్తారు. అందుకే ఫ్రాయిడ్ వంటి మానసిక విశ్లేషకుణ్ణి ఆశ్రయించి, రాజకీయాల పరిధిని దాటి సమస్యను వ్యక్తిగతస్థాయిలో పరిష్కరించే మార్గాలను సూచించమని కోరతారు. ఫ్రాయిడ్ సూచించిన పరిష్కారాలు లోతైనవి. హింసను అణచివేయడం కాదు, దాన్ని సృజనాత్మక దిశగా మళ్ళించాలి. నేటి ప్రపంచంలో దీనికి కొన్ని ఆచరణాత్మక మార్గాలు కూడా ఉన్నాయి. పాఠశాలల్లో కేవలం శాస్త్రీయమైన చదువే కాకుండా విమర్శనాత్మక ఆలోచన, మీడియా లిటరసీ, డిజిటల్ లిటరసీని తప్పనిసరి చేయాలి. సోషల్ మీడియా సంస్థలు ద్వేషప్రచారం, తప్పుడు సమాచారంపై మరింత బాధ్యత వహించేలా చూడాలి. అల్గారిథమ్ లను అదుపు చేస్తూ, పారదర్శకతను పెంచే కఠినమైన చట్టాలు రావాలి. రాజకీయ నాయకులు, మీడియా, మేధావులు ప్రజల్లో భయాన్ని కాకుండా వివేకాన్ని పెంపొందించే సంస్కృతిని ప్రోత్సహించాలి. ప్రజాస్వామ్యంలో స్వతంత్రమీడియా, మేధావులపాత్రను రక్షించాలి. యుద్ధాన్ని ఆపేది కేవలం సైనికశక్తి కాదు. ఐన్స్టీన్ రాజకీయపరిష్కారాన్ని చూపిస్తే,b ఫ్రాయిడ్ మనిషి మనసును అర్థం చేసుకునేమార్గాన్ని చూపించారు. బహుశా ఈ రెండుదృక్కోణాల సమన్వయమే శాశ్వతశాంతికి పునాది.





