‘సర్’ రెండో విడతపై దృష్టి సారించాలి

– పార్టీ నాయకులకు బీజేపీ చీఫ్ రామచందర్ పిలుపు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 8 : రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) రెండవ విడత ప్రక్రియపై పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షు ఎన్.రామచందర్ రావు పిలుపునిచ్చారు. ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కన్వీనర్ వేముల అశోక్ అధ్యక్షతన నిర్వహించిన ఎస్‌ఐఆర్ ఫేజ్-2 రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌లో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ‘సర్’ ప్రక్రియ ముగియడానికి కేవలం మరో రెండు రోజులు (ఆగస్టు 10 వరకు) సమయం ఉన్నందున ప్రతీ నియోజకవర్గంలోనూ అర్హులైన ప్రతి ఒక్కరితో ఫాం-6 ద్వారా కొత్త ఓటు నమోదు వేగవంతంగా పూర్తి చేయించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ గడువు ముగిసిన తర్వాత కూడా రాబోయే రోజుల్లో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ల పరిశీలన, నకిలీ ఓట్ల గుర్తింపు, ఆభ్యంతరాల దాఖలు వంటి కీలకమైన అంశాలు ఉంటాయని రామచందర్ రావు స్పష్టం చేశారు. ఫాం-7 (ఓట్ల తొలగింపు), ఫాం-8 (సవరణలు) సరైన రీతిలో దాఖలు చేయడం, నోటీసులకు తగిన ఆధారాలతో లీగల్‌గా సమాధానాలు ఇవ్వడం, పోలింగ్ బూత్‌ల రేషనలైజేషన్ ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించడంపై బీఎల్ఏ-1లు, లీగల్ టీమ్స్ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటర్ల జాబితా పారదర్శకత అత్యంత కీలకమని, ఆ బాధ్యతను బీజేపీ ప్రతినిధులు సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు.

సరూర్ నగర్‌లో బయటపడ్డ అసలైన ‘మొహబ్బత్ కీ దుకాన్‌’

సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో హైడ్రా ఉద్యోగాల కోసం తరలివచ్చిన నిరుద్యోగ యువతపై పోలీసుల లాఠీచార్జి దృశ్యాలు వెలుగులోకి రావడం బాధాకరమని, ఆ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దిల్లీలో యువత కోసం మొసలి కన్నీరు కారుస్తుంది కానీ రాష్ట్రంలో మాత్రం ఉపాధి కోసం వచ్చిన అమాయక నిరుద్యోగ యువతపై పోలీసులను ప్రయోగిస్తోందని విమర్శించారు. ఆ పార్టీ చెప్పే ‘మొహబ్బత్ కీ దుకాన్‌’ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. 150 ఖాళీల కోసం అంత భారీ సంఖ్యలో యువతీయువకులు తరలిరావడం అత్యంత ఆశ్చర్యకరమన్నారు. యువతకు హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందనడానికి ఈ ఘటనే నిదర్శనమన్నారు. ఎన్నికలపుడు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువతకు ఎన్నో ఆకర్షణీయమైన హామీలిచ్చింది.. అధికారం దక్కగానే ప్రాధాన్యతా క్రమంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలు చేపడతామని, ప్రతినెలా నిరుద్యోగ భృతితోపాటు యువతకు అన్ని విధాలా అండగా ఉంటామని గొప్పలు చెప్పింది.. కానీ రెండేళ్లు గడిచినా యువత ఉద్యోగాల కోసం రోడ్లపైనే నిరీక్షించాల్సి రావడం శోచనీయమని ఆయన అన్నారు. రూ.4,000 నిరుద్యోగ భృతి హామీ ఊసే ఎత్తడం లేదు.. స్వయం ఉపాధికి రూ.10 లక్షల వరకు ఇస్తామన్న వడ్డీ లేని రుణాలు కాగితాలకే పరిమితమయ్యాయి.. ఆర్నెలల్లోనే ఇస్తామన్న జాబ్ క్యాలెండర్, లక్షలాది ఉద్యోగాల హామీలు కాంగ్రెస్ మార్క్ మోసానికి నిదర్శనంగా మిగిలిపోయాయి  అని విమర్శించారు. ఈ ప్రభుత్వం ప్రతీ ప్రధాన హామీని పూర్తిగా విస్మరించి యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేసిందన్నారు. సరూర్ నగర్ స్టేడియం వద్ద కనిపించిన దృశ్యం ఉపాధి దొరక్క కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల వల్ల యువత అనుభవిస్తున్న నైరాశ్యానికి, ఆవేదనకు సజీవ సాక్ష్యం అని   అ  న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగార్థులపై పోలీసుల దౌర్జన్యాన్ని, అణచివేత ధోరణిని ప్రయోగించడం తీవ్ర అన్యాయమంటూ ఈ దృశ్యాలు తనను తీవ్రంగా కలిచివేశాయన్నారు.. దీనికి ప్రభుత్వం ప్రజలకు, యువతకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *