కాళేశ్వరంపై ఇంకెన్నాళ్లు కట్టుకథలు

– నీళ్లు లేక రైతులు అవస్థలు పడుతుంటే చోద్యమా
– గోదావరి నీళ్లు ఎత్తిపోయడమే శరణ్యం
– బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 8: ఒకపక్క నీళ్లు లేక ప్లలెల్లో రైతన్నల కన్నీళ్లు పెట్టుకుంటుంటే మరోపక్క మేడిగడ్డ కాడ లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా కిందకు పోతున్నాయని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంలో నీరో చక్రవర్తిని మించిపోయి సర్కారు తమాషా చూస్తున్నదని మండిపడ్డారు. కేసీఆర్‌పై కక్షతో రైతన్నలకు శిక్ష వేయడం తగునా అని నిలదీశారు. ఎల్‌నినో పడగ విప్పుతుంటే..ముప్పు ముంచుకొస్తుంటే ఇంకా రాక్షస రాజకీయ క్రీడలు ఆడుతూ కూర్చుంటారా? ఇంకెన్నాళ్లు కాళేశ్వరం మీద దుష్పచ్రారాలు చేస్తూ కాలక్షేపం చేస్తారు? ముఖ్యమంత్రికి రైతు ముఖ్యమా? రాజకీయం ముఖ్యమా? అని మండిపడ్డారు.  పగలు.. ప్రతీకారాలు ప్రతిపక్షం మీద తీర్చుకోండి, అన్నంపెట్టే రైతును మాత్రం ఆగం చేయకండి అని హితవు పలికారు. కాళేశ్వరంలో నిండుగా నీళ్లు పారుతున్నా పొలాలను ఎండబెతున్న కాంగ్రెస్‌ ‌కర్కశ పాలన తీరును ప్రశ్నించండి అని రైతన్నలకు కేటీఆర్‌ ‌పిలుపునిచ్చారు. ఎక్కడా చుక్కనీళ్లు లేని కాలంలోనూ కాళేశ్వరమే ప్రాణేశ్వ‌ర‌మై కాపాడుతుందని అర్థం చేసుకోవాలన్నారు. వానల్లేక ఎవుసం జరగక అన్నదాత అల్లాడుతుంటే ప్రభుత్వానికి పాపం అనిపించడం లేదా.. కాళేశ్వరం దగ్గర పరవళ్లు తొక్కుతున్న గోదావరి జలాలను ఎత్తిపోసి గోస తీర్చాలన్న సోయి కలగట్లేదా అని సీఎం రేవంత్‌ ‌రెడ్డిని కేటీఆర్‌ ‌ప్రశ్నించారు. లోటు వర్షపాతంతో నాట్లు పడట్లేదు.. విత్తనాలు వేయట్లేదు.. పంటలు సాగుచేసే పరిస్థితి లేదని అన్నారు. ప్రభుత్వమేమో పట్టించుకోకుండా దున్నపోతు మీద వానపడ్డట్టే వ్యవహరిస్తున్నదని తెలిపారు. కన్నెపల్లి పంప్‌ ‌హౌజ్‌ ‌మోటర్లను నడిపించి కరవు రాకుండా కాపాడుకోవాలన్న బుద్ధి ఎందుకు లేదని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

తెలంగాణ సంపన్న రాష్ట్రం : ప్రపంచ బ్యాంక్‌ ‌నివేదికపై కేటీఆర్‌ ‌హర్షం

తెలంగాణ ఎగువ మధ్యాదాయ స్థాయిని దాటిన సంపన్న రాష్ట్రమంటూ ప్రపంచబ్యాంకు నివేదికను వెల్లడించడంపై కేటీఆర్‌ ‌హర్షం వ్యక్తం చేశారు. ‘ఎక్స్’ ‌వేదికగా స్పందిస్తూ దేశంలో ఈ హోదాను సాధించిన ఐదు అగ్ర రాష్ట్రాల్లో తెలంగాణ ఉండటం గర్వకారణమన్నారు. తెలంగాణ విఫల రాష్ట్రం కాలేదని.. సఫల సంపన్న రాష్ట్రమై సగర్వంగా నిలిచిందని పేర్కొన్నారు. ’తెలంగాణ ప్రజలు గర్వించే సందర్భం ఇది.. సాధించుకున్న స్వరాష్ట్రం సంపన్న రాష్ట్రంగా అవతరించింది అన్నారు. తమ చెమటను, నైపుణ్యాన్ని,మేధస్సును రంగరించి తెలంగాణను శిథిలాల నుంచి శిఖరాలకు చేర్చిన ప్రతి పౌరుడికీ శుభాభివందనలు.. తెలంగాణ వస్తే జాతి సంపద పెరిగింది.. జనం ఆదాయం అద్భుతంగా పెరిగింది.. కేసీఆర్‌ ‌దార్శనిక పాలనలో ఆర్థిక వ్యవస్థ అద్వితీయంగా అభివృద్ధి చెందిందని జాతీయ నివేదికలే కాదు.. అంతర్జాతీయ సంస్థలు తేల్చిచెబుతున్నాయి.. దివాలా రాష్ట్రం అని దిక్కుమాలిన ప్రచారాలు చేసేవాళ్లకు ప్రపంచ బ్యాంకు తాజా నివేదికే సమాధానం అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *