కెనడా పెట్టుబడిదారులకు సీఎం ఆహ్వానం

– రాష్ట్ర ప్రగతి దిశ, ఉద్యోగ కల్పనపై కెనడా హైకమిషనర్ ప్రశంసలు
~ కెనడా పర్యటనకు రేవంత్‌ను ఆహ్వానించిన క్రిస్ కూటర్

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 8 : కెనడా-తెలంగాణ మధ్య వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణల రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై కెనడా హైకమిషనర్ టు ఇండియా క్రిస్ కూటర్ బుధవారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో చర్చించారు. తెలంగాణలో చేపడుతున్న భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులు, పట్టణాభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేకంగా చర్చ జరిగింది. ముఖ్యంగా మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టు, మెట్రో రైలు విస్తరణ, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టుల్లో కెనడా భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలపై ఇరువురూ చర్చలు జరిపారు. తెలంగాణ-కెనడా మధ్య పెరుగుతున్న పారిశ్రామిక, ఆర్థిక సంబంధాలను ప్రస్తావించిన ఆయన ఇటీవల కెనడాకు చెందిన ప్రముఖ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం సంతోషకరమని పేర్కొన్నారు. ఫిరాన్ టెక్నాలజీ గ్రూప్ హైదరాబాద్‌లో తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం, సీఐబీసీ(సీఐబీసీ) హైదరాబాద్‌లో తన గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ)ను ప్రారంభించడం వంటి పరిణామాలు తెలంగాణపై కెనడా కంపెనీల నమ్మకం, విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమని అన్నారు. దాంతోపాటు ప్రపంచ ప్రసిద్ధి చెందిన క్యాపిటల్ సంస్థ సీపీపీ ఇన్వెస్ట్‌మెంట్స్ హైదరాబాద్‌కు చెందిన సీటీఆర్ ఎల్‌ఎస్ డేటా సెంటర్స్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుని పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం రాష్ట్ర పెట్టుబడి సామర్థ్యాన్ని మరింత బలపరిచిందని క్రూటర్ చెప్పారు. ఈ సందర్భంగా ఐటీ, లైఫ్ సైన్సెస్, రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో రాష్ట్రం సాధించిన పురోగతిని క్రిస్ కూటర్ బృందానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. ప్రపంచంలోని ఫార్చ్యూన్-500 కంపెనీల జీసీసీలు హైదరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకుంటున్నాయని తెలిపారు. మూసీ నదీ తీరాన్ని అభివృద్ధి చేసి కొత్త ఆర్థిక వ్యవస్థను నిర్మించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలో సౌర విద్యుత్ విస్తరణ, హరిత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కెనడా సహకారం అందించాలని కోరారు. తెలంగాణను ప్రపంచస్థాయి నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం వెల్లడించారు. ప్రపంచంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్‌లో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయన్నారు. కెనడాకు చెందిన ప్రముఖ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్‌లో మల్టీ-యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. ఈ ఏడాది డిసెంబర్‌లో నిర్వహించనున్న రెండో తెలంగాణ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో పాల్గొనాలని కెనడా కంపెనీలు, పెట్టుబడిదారులు, విద్యా సంస్థలను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను కూటర్ ప్రశంసించారు. అభివృద్ధి కార్యక్రమాలకు కెనడా అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చిన క్రిస్ కూటర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కెనడా పర్యటనకు ఆహ్వానించారు. రాబోయే నెలల్లో కెనడా వాణిజ్య ప్రతినిధి బృందం తెలంగాణకు వచ్చి ఇంధన రంగం, పట్టణాభివృద్ధి, రక్షణ, ఏరోస్పేస్ తదితర రంగాల్లో పెట్టుబడులు, భాగస్వామ్య అవకాశాలపై విస్తృతంగా చర్చిస్తుందని తెలిపారు. సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు, ఎక్స్-అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓ బి.అజిత్ రెడ్డి, టీజీఐఐసీ ఎండీ శశాంక, ఐటీ,ఈ అండ్ సీ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి, పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రిని కలిసిన అంతర్జాతీయ ప్రతినిధులు 

అలాగే పలువురు అంతర్జాతీయ ప్రతినిధులు సీఎం రేవంత్‌ను కలుసుకున్నారు. నిలి గిల్బర్ట్ (యూఎస్ఏ): బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ బోర్డు సలహాదారు, మహేష్ కొండూరు (యూఎస్ఏ), అమెరికా ప్రభుత్వ సలహాదారు (క్రిటికల్ మినరల్స్) మొమెంటం టెక్నాలజీస్ సీఈఓ, అమిత్ మెహ్రా (యÖకే), ఆక్సన్ టెక్నాలజీస్ సీఈఓ దిలెక్, నార్వే మాజీ స్టేట్ సెక్రటరీ థామస్ ఫ్రోలిక్, దక్షిణాఫ్రికా పార్లమెంట్ సభ్యుడు సెంథిల్ తొండమాన్, సిలోన్ వర్కర్స్ కాంగ్రెస్ (సీడబ్ల్యూసీ) అధ్యక్షుడు(శ్రీలంక) తదితరులు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *