– కాంగ్రెస్‌వి క్రెడిట్ పాలిటిక్స్
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 8 : గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణి సంస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేసి నష్టాల్లోకి నెట్టేస్తే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రమే సంస్థను బలోపేతం చేస్తూ కాపాడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థకు కేంద్ర ప్రభుత్వం తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌ను కేటాయించడం పట్ల తెలంగాణ ప్రజల తరఫున ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డికి ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. సుమారు 182 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్న ఈ బ్లాక్ ద్వారా సింగరేణి సంస్థకు రూ.64,000 కోట్లకుపైగా ఆదాయం సమకూరనుందని, అలాగే దాదాపు 1,200మంది నిరుద్యోగ యువతకు కొత్తగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. ఈ బ్లాక్ కేటాయింపుతో సింగరేణి అభివృద్ధితోపాటు, రాష్ట్ర భవిష్యత్తును కూడా కేంద్ర ప్రభుత్వం మరింత బలోపేతం చేసిందని కొనియాడారు.
కాంగ్రెస్ క్రెడిట్ పాలిటిక్స్
‘తాడిచర్ల-2’ బ్లాక్‌ను తమ ప్రయత్నాల వల్లే సాధించుకున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకోవడం పూర్తిగా అవాస్తవమని రామచందర్ రావు మండిపడ్డారు. గతంలో కేంద్రంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ బొగ్గు బ్లాకును సింగరేణికి ఎందుకు కేటాయించలేకపోయారో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా నాయకుల సమష్టి కృషితోపాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవ వల్ల మాత్రమే ఈ బ్లాక్ కేటాయింపు సాధ్యమైందని స్పష్టం చేశారు. గత బీఆరఎస్ ప్రభుత్వం సింగరేణిని తమ సొంత ప్రయోజనాల కోసం వాడుకోగా నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా సింగరేణి నిధులను ఫుట్‌బాల్ మ్యాచ్‌ల వంటి ఇతర కార్యక్రమాలకు మళ్లిస్తూ సంస్థను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. మన్మోహన్ సింగ్ హయాంలో దేశవ్యాప్తంగా బొగ్గు కేటాయింపుల్లో పెద్ద ఎత్తున కోల్ స్కాం వెలుగు చూసిందని, కానీ ప్రధాని మోదీ నాయకత్వంలో బొగ్గు రంగంలో విప్లవాత్మక సంస్కరణలు, పారదర్శకతకు పెద్దపీట వేశారని కొనియాడారు. ఫలితంగానే నేడు కోల్ ఇండియా ద్వారా బొగ్గు ఉత్పత్తి సుమారు 70 శాతం పెరిగిందని, తద్వారా దేశానికి బొగ్గు రంగం నుండి దాదాపు రూ.2.5 లక్షల కోట్ల ఆదాయం సమకూరుతోందని వివరించారు.
‘సిట్’ పరిధిని విస్తరించాలి
రాష్ట్రంలో భూపరిపాలన అస్తవ్యస్తంగా మారిందని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ‘ధరణి’ పోర్టల్‌లో భారీగా ఫేక్ అకౌంట్లు సృష్టించారని, వాటిపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిందేనని రామచందర్ రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే సుమారు రెండు వేల ఫేక్ అకౌంట్లు వెలుగుచూడటం తీవ్ర ఆందోళనకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ‘ధరణి’పై విచారణ జరుపుతున్న ‘సిట్’ పరిధిని విస్తరించి ‘భూభారతి’లో జరుగుతున్న విచ్చలవిడి అవకతవకలపైనా సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. భూభారతి అవినీతిలో భాగస్వాములైన రాజకీయ నాయకులు, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ధరణి, భూభారతి పోర్టల్స్‌లో జరిగిన అక్రమాలు బయటపడతాయనే భయంతోనే కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు కలిసి నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి, మేడిగడ్డ అంశాలను మళ్లీ తెరపైకి తెస్తూ డ్రామాలాడాలని చూస్తోందని, కాళేశ్వరాన్ని కాస్తా ‘డ్రామేశ్వరం’గా మారుస్తున్నారని ఆయన విమర్శించారు. కాళేశ్వరంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో విచారణ జరిపించాలని మొట్టమొదట డిమాండ్ చేసింది బీజేపీయేనని గుర్తుచేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్, బీఆరఎస్‌లు తమ రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టాలని హితవు పలికారు. లక్షల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. రైతుల జీవితాలతో చౌకబారు రాజకీయాలు చేయొద్దని, అన్నదాతలకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని రామచందర్ రావు ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





