చంద్రబాబు కోసమే గోదావరి నీళ్లు వదిలేస్తున్నారు

– చెరువుల ఎండిపోతున్నా నీళ్లు ఎత్తి పోయడం లేదు
– దేవాదుల ప్రాజెక్టు నుంచి కూడా నీళ్లు ఎత్తి పోయరా
– తుమ్మడిహట్టి వద్ద అనుమతులు అంటే ఆనాడే ఎందుకు కట్టలేదు
– నేర‌పూరిత నిర్ల‌క్ష్యానికి పాల్పడిన మిమ్ములను ఉరితీసినా పాపం లేదు
– మీడియా సమావేశంలో ఫైర్‌ అయిన హరీష్‌ ‌రావు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 8:గోదావరిలో నీళ్లు ఉన్నా ఎత్తిపోయకపోవడం నేర‌పూరిత నిర్ల‌క్ష్యం ‌కిందకి వస్తుందని.. మిమ్మల్ని ఉరి తీసినా తప్పు లేదని సీఎం రేవంత్‌ ‌రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ‌డిప్యూటీ ప్లోర్‌ ‌లీడర్‌ ‌హరీష్‌ ‌రావు ఫైర్‌ అయ్యారు. చంద్రబాబుకు గురు దక్షిణ చెల్లించడానికే గోదావరి నీళ్లను వదిలేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో హరీష్‌ ‌రావు మాట్లాడుతూ ధర్మసాగర్‌, ‌రామప్ప చెరువులు ఖాళీగా ఉంటే ఎందుకు నింపడం లేదన్నారు. కాళేశ్వరం కింద ప్రాజెక్టుల్లో నీళ్లు నింపి రైతులకు ఇవ్వాలని ఎందుకు అనుకోవడం లేదన్నారు. ఈ రోజు కూడా సమ్మక్క సాగర్‌ ‌బ్యారేజీలో 1,08,000 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంది. దేవాదుల ప్రాజెక్టు అన్ని ఫేజులు కలిపి ఒక్కరోజులో 2,542 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయ వచ్చన్నారు. సాధారణంగా దేవాదుల మోటర్లు 71 మీటర్ల నీళ్లు ఉంటే పనిచేస్తాయి., కానీ ఇప్పుడు 75 మీటర్ల నీళ్లు ఉన్నాయి.. అంటే నీళ్లు ఉండి కూడా కావాలని ఎత్తిపోయడంలేదని ఆరోపించారు. దేవాదుల ప్రాజెక్టులో సగానికి పైగా మోటార్లు అసలు ఆన్‌ ‌చేయలేదు. నిర్లక్ష్యం వల్ల ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో దాదాపు 80శాతం చెరువులు ఎండిపోయి ఉన్నాయన్నారు. మేడిగడ్డ దగ్గర బ్యారేజ్‌ ‌కట్టొద్దని నిపుణులు ఎక్కడా చెప్పలేదని.. అక్క‌డ‌ బ్యారేజ్‌ ‌నిర్మించేందుకు అనుకూలంగానే ఉందని రిటైర్డ్ ఇం‌జనీర్ల కమిటీ నివేదిక ఇచ్చిందని హరీష్‌ ‌రావు స్పష్టం చేశారు. మేడిగడ్డ నుండి 160టీఎంసీల నీళ్లు మిడ్‌ ‌మానేరు తీసుకువెళ్లేందుకు పరిస్థితులు అనుకూలిస్తాయా లేదా అన్న దాని గురించి కమిటీ వేశారని రిటైర్డ్ ఇం‌జనీర్లు చెప్పారు. పీసీ ఘోష్‌ ‌కమిషన్‌కు కూడా ఈ రిటైర్డ్ ఇం‌జనీర్ల కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు. మేడిగడ్డ దగ్గర బ్యారేజ్‌ ‌కట్టొచ్చు కానీ నేరుగా మిడ్‌ ‌మానేరుకు నీరు తీసుకెళ్లడం సాధ్యం కాదని ఆనాడు కమిటీ చెప్పింది. కమిటీ సూచనల మేరకు నేరుగా నీళ్లు తరలించే ప్రతిపాదనను బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఉపసంహరించుకుందని రిటైర్డ్ ఇం‌జనీర్ల కమిటీ పీసీ ఘోష్‌ ‌కమిషన్‌కు నివేదిక ఇచ్చిందన్నారు. తాము చెప్పినట్టే బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిందని అఫిడవిట్‌ ‌రూపంలో పీసీ ఘోష్‌ ‌కమిషన్‌కు రిటైర్డ్ ఇం‌జనీర్ల కమిటీ తెలిపింది. కానీ బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం రిటైర్డ్ ఇం‌జనీర్ల కమిటీ రిపోర్టు పట్టించుకోలేదని రేవంత్‌ ‌రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. మేడిగడ్డ దగ్గర చిన్న రబ్బర్‌ ‌డ్యామ్‌ ‌వేసి మోటార్లు ఆన్‌ ‌చేసి కాళేశ్వరం నీళ్లు వాడుకోవచ్చని రేవంత్‌ ‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంజనీర్లు ఒక రిపోర్ట్ ఇచ్చారని, ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డీ.. నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రిపోర్ట్ ‌బయట పెట్టాలని హరీష్‌ ‌రావు సవాల్‌ ‌విసిరారు. ఆ రిపోర్ట్ ఇచ్చిన  వారం రోజుల్లోనే ట్రాన్స్‌ఫర్‌ ‌చేసి పోస్టింగ్‌ ఇవ్వకుండా రిటైర్‌ ‌చేశారు. మీకు కాళేశ్వరం అంటే అంత పగ‌, ప్రతీకారం ఎందుకని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి నెగిటివ్‌ ‌మైండ్‌సెట్‌తో ఉన్నారని వ్యాఖ్యానించారు. కన్నెపల్లి మోటార్లు ఆన్‌ ‌చేయమంటే ఎన్‌డీఎస్‌ఏ ‌సాకు చెబుతున్నారని, మరి సమ్మక్క బ్యారేజీ మోటార్లు ఎందుకు ఆన్‌ ‌చేయడం లేదని ప్రశ్నించారు. ఈ నిమిషానికి సమ్మక్క బ్యారేజీ దగ్గర లక్ష క్యూసెక్కుల ప్రవాహం ఉందని చెప్పారు. గోదావరి నీళ్లు తీసుకోవాలన్న కనీస సోయి లేదని విరుచుకుపడ్డారు. చెరువులు నింపుకునే అవకాశం ఉన్నా నింపడం లేదన్నారు. దేవాదుల మోటార్లు పూర్తిస్థాయిలో నడపడం లేదని తెలిపారు. మోటార్లు ఆన్‌ ‌చేయకుండా.. నీళ్లను దిగువకు వదులుతున్నారని అన్నారు. కాంగ్రెస్‌ది నేరపూరిత నిర్లక్ష్యమని మాజీ మంత్రి విమర్శలు గుప్పించారు. నీళ్లు ఉండి కూడా లిప్ట్ ‌చేయకపోవడం క్రిమినల్‌ ‌నెగ్లిజెన్స్ అం‌టూ వ్యాఖ్యానించారు. ఇందుకు రేవంత్‌, ఉత్తమ్‌ను ఉరితీసినా తప్పులేదన్నారు. నిన్నటి రేవంత్‌ ‌ప్రసంగంలో సొల్లు తప్ప నిజం లేదని అన్నారు. తుమ్మిడిహెట్టికి అనుమతులున్నాయని అబద్దాలు చెప్పారని, అనుమతులుంటే త‌ట్టెడు మట్టి ఎందుకు తీయలేదని నిలదీశారు. ఎనిమిదేళ్లు కేంద్రం, రాష్ట్రం, మహారాష్ట్రలో అధికారంలో ఉండి ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. పనులు చేయకుండా తుమ్మిడిహెట్టి పేరిట రూ.2,328కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. నీటి పారుదల మంత్రిగా ఉత్తమ్‌, ‌సీఎంగా రేవంత్‌ ‌విఫలం అంటూ వ్యాఖ్యానించారు. ’తుమ్మిడిహెట్టికి మహారాష్ట్ర అనుమతి ఇచ్చి ఉంటే అగ్రిమెంట్‌ ‌బయటపెట్టాలి. .ఒప్పందం బయటపెడితే రాజీనామాకు సిద్ధం. లేకపోతే సీఎం రేవంత్‌ ‌ప్రజలకు క్షమాపణ చెప్పాలని హరీశ్‌ ‌రావు సవాల్‌ ‌విసిరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *