– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పుదోవ పట్టించే యత్నం
– 2013 లోనే సింగరేణికి అధికారికంగా కేటాయింపు
– మీడియా సమావేశంలో మండిపడ్డ డిప్యూటి సిఎం భట్టి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 8: సింగరేణి బొగ్గు గనుల కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. సింగరేణి కాలరీస్‌కు తాడిచెర్ల-2 బొగ్గు బ్లాక్‌ను తామే కొత్తగా కేటాయించామని, దానికి సంబంధించిన కొన్ని క్లియరెన్సులు ఇచ్చామని కేంద్ర పెద్దలు ప్రచారం చేసుకోవడంపై మండిపడ్డారు. వాస్తవాలను పూర్తిగా పక్కన పెట్టి, ప్రజలను తప్పుదోవ పట్టించేలా వేరేలా చిత్రీకరించడం ఎంతమాత్రం సరి కాదని స్పష్టం చేశారు. తాడిచెర్ల-2 బ్లాక్‌ను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో 2013 లోనే సింగరేణి కాలరీస్‌కు అధికారికంగా కేటాయించిందని గుర్తుచేశారు. పైగా, గిరిజన ప్రాంతాలలో ఉండే బొగ్గు గనులను నిబంధనల ప్రకారం కేవలం ప్రభుత్వ కంపెనీలకు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని, అలాంటప్పుడు ఇప్పుడు కొత్తగా రేదో అలాట్ చేసినట్లు చెప్పుకోవడం ఏంటని ప్రశ్నించారు. సింగరేణికి తాడిచర్ల కోల్ బ్లాక్ -2 కేటాయించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారని.. కానీ వాస్తవాలు దాచిపెట్టి వేరేలా చిత్రీకరించడం సరికాదని భట్టి విక్రమార్క అన్నారు. మీడియాతో బుధవారం మాట్లాడుతూ 2013 సెప్టెంబర్ 16న ఈ కోల్ బ్లాక్‌ను ఆనాటి యూపీఏ ప్రభుత్వం సింగరేణికి కేటాయించిందని గుర్తుచేశారు. ఇప్పుడు కొత్తగా కోల్ బ్లాక్ కేటాయించినట్లు చెప్పడం ఏంటని ప్రశ్నించారు. మైనింగ్ లీజుకు దరఖాస్తు చేస్తే ఇన్నాళ్లూ పెండింగ్‌లో పెట్టారని, ఎమ్‌ఎమ్‌బీఆర్ యాక్ట్ రాకముందే ఈ బ్లాక్‌ను సింగరేణికి కేటాయించారని తెలిపారు. కేంద్ర మంత్రులను కలిసి చరిత్ర మొత్తం వివరించామని భట్టి అన్నారు. కొట్లాడి లీజుకు తెచ్చుకున్నామన్నారు. ట్రైబల్ ఏరియాలో ట్రైబల్స్ లేదా ప్రభుత్వ సంస్థలు మాత్రమే పని చేయాలని, ప్రైవేట్ కంపెనీలు పని చేయడానికి అవకాశం లేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా సత్తుపల్లి బ్లాక్ 3, కోయగూడెం బ్లాక్3కు టెండర్ వేశారన్నారు. బీఆర్‌ఎస్ బినామీలు ఆక్షన్‌లో పాల్గొని వాటిని దక్కించుకున్నారన్నారు. ఇన్నాళ్లూ సింగరేణికి తాడిచర్ల కోల్ బ్లాక్ లీజుకు ఇవ్వకపోవడం వల్ల వేల కోట్ల నష్టం జరిగిందని చెప్పారు. గోదావరి పరిసరాల్లోని కోల్ బ్లాక్స్ అన్నింటినీ సింగరేణికి కేటాయించాలని భట్టి డిమాండ్ చేశారు. తాడిచెర్ల-2 బ్లాక్‌కు సంబంధించిన అసలు చరిత్రను మీడియా ముందుంచారు. 2021లోనే తాము మైనింగ్ లీజుకు సిద్ధమయ్యామని చెప్తూ సింగరేణి యాజమాన్యం కేంద్రానికి దరఖాస్తు చేసుకుందన్నారు. కానీ, ఆ మైనింగ్ లీజుకు ఆమోదం ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం నాన్చుతూ ఇప్పటివరకు ఫైళ్లను పెండింగ్‌లో పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కంపెనీకి లీజు ఇవ్వకుండా ఇలా ఆపడం సరికాదని తానే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చామన్నారు. 2024 మార్చిలో అప్పటి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి ఈ బ్లాక్‌కు సంబంధించిన పూర్వపరాలన్నింటినీ వివరించామని తెలిపారు. తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కలిసి వినతి పత్రం కూడా సమర్పించారని గుర్తు చేశారు. లీజు ఇవ్వకపోతే సింగరేణి తీవ్రంగా నష్టపోతుందనే వాస్తవాన్ని కేంద్రం ముందు ఉంచి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో పోరాడి అనుమతులు తెచ్చుకుందని స్పష్టం చేశారు. అదంతా దాచేసి ఎప్పుడో ఉన్నదానికే తామే కేటాయించామని కేంద్రం ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ విధానాలను ఎండగడుతూ 2022లో కోయగూడెంలోని బ్లాక్-3 ని కేంద్రం వేలంలో పెట్టి నిబంధనలకు విరుద్ధంగా ఒక ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టిందని ఆరోపించారు. ఆ బ్లాక్ అప్పటినుంచి ఇప్పటి వరకు కనీసం ఓపెన్ కూడా కాలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి నిజంగానే సింగరేణి సంస్థకు మేలు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే కోయగూడెం బ్లాక్-3తోపాటు సత్తుపల్లి బ్లాక్-3 గనులను కూడా తక్షణమే సింగరేణికే అప్పగించాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం సింగరేణిని కనీసం వేలంలో కూడా పాల్గొననీయకుండా నష్టం చేసిందని మండిపడ్డారు. కేంద్రం తన వైఖరి మార్చుకుని గోదావరి పరిసర ప్రాంతాల్లో ఉన్న కోల్ బ్లాకులను, తెలంగాణలోని అన్ని బొగ్గు గనులను సింగరేణి సంస్థకే కేటాయించాలని కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





