– బందీలను విడిచిపెట్టిన హమాస్
– తొలి విడత రెడ్‌క్రాస్‌కు ఏడుగురి అప్పగింత
న్యూదిల్లీ, అక్టోబర్ 13: గాజా శాంతి ఒప్పందం ప్రక్రియ మొదలుకాగా బందీల విడుదలను హమాస్ ప్రారంభించింది. దాదాపు రెండేళ్లుగా హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారికి సోమవారం విముక్తి లభించింది. తొలి దశలో ఏడుగురు బందీలను రెడ్‌క్రాస్‌కు హమాస్ అప్పగించింది. ఖాన్ యూనిస్ నుంచి వారిని తీసుకుని రెడ్‌క్రాస్ వాహనశ్రేణి ఇజ్రాయెల్‌కు బయల్దేరింది. బందీలు విడుదలవడంతో వారి కుటుంబ సభ్యులు, శ్రేయాభిలాషుల్లో సంతోషం నెలకొంది. మిగతా బందీలను కూడా హమాస్ విడిచిపెట్టనుంది. ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్ కూడా పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళిక తొలిదశలో భాగంగా ఇజ్రాయెల్, హమాస్ ఇటీవల కాల్పుల విరమణకు అంగీకరించిన సంగతి తెలిసిందే. శుక్రవారం నుంచే ఈ ఒప్పందం అమల్లోకి రాగా బందీల విడుదల సోమవారం ప్రారంభమైంది. ఒప్పందం కింద తమ వద్ద ఉన్న 48 మంది బందీలను హమాస్ విడిచిపెట్టనుంది. అయితే, ఇందులో 20 మందే సజీవంగా ఉన్నారు. వీరిని గాజాలోని మూడు ప్రాంతాల్లో హమాస్ విడుదల చేయనుంది. ఇందుకు ప్రతిగా రెండువేల మందికి పైగా పాలస్తీనా ఖైదీలను విడుదల చేసేందుకు ఇజ్రాయెల్ అంగీకరించింది. ఈ విడుదల కార్యక్రమం ముగిసిన తర్వాత ట్రంప్ శాంతి ప్రణాళికలో రెండో దశపై చర్చలు ప్రారంభమవుతాయి. ఇందులో హమాస్ ఆయుధాలను త్యజించడం, గాజా నుంచి ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణ ప్రధానాంశాలు. ఈ చర్చలకు అమెరికా, ఈజిప్టు, ఖతార్ మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంలో కీలక పాత్ర పోషించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోమవారం ఇజ్రాయెల్, ఈజిప్టులలో పర్యటించనున్నారు. తొలుత ఆయన జెరూసలెంలో ఇజ్రాయెల్ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తారు. బందీల కుటుంబసభ్యులను కలుస్తారు. అక్కడినుంచి ఈజిప్టు వెళతారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





