– గతంలో బీఆర్‌ఎస్ కూడా ఎంఐఎంతో కాపురం చేసింది
– మా పార్టీ అభ్యర్థిని ఇవాళ రేపట్లో ప్రకటిస్తాం
– బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పోటీ చేస్తున్నదా లేక మజ్లిస్ పోటీ చేస్తున్నదా లేక మజ్లిస్ అభ్యర్థి కాంగ్రెస్ గుర్తు మీద పోటీ చేస్తున్నాడా అన్న అనుమానం కలుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. ఖమ్మం నుంచి డాక్టర్ కాసాని మారుతి గౌడ్‌తోపాటు లండన్ నుంచి ఎన్నారై శశి, వారి బృందం సోమవారం బీజేపీలో చేరారు. అలాగే దేవరకొండ, నాగర్‌కర్నూలు నియోజకవర్గాల నుంచి కూడా పలువురు నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి గతంలో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేశారని, ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ వచ్చాక ఎంఐఎం అధినేత దగ్గరకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారని, దీన్నిబట్టి కాంగ్రెస్ అభ్యర్థి ఎంఐఎంకి చెందిన వారేనని స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. కాకుంటే ఈసారి హస్తం గుర్తు మీద కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడని, ఇది ప్రజలను మోసం చేయడమేనని, కాంగ్రెస్ మద్దతుతో గెలవాలనే ఆలోచనతో ఎంఐఎంకు చెందిన అభ్యర్థిని కాంగ్రెస్ టికెట్ మీద పోటీకి దింపుతోందని ఆరోపించారు. దీంతో అందరి దృష్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కేంద్రీకృతమైందన్నారు. ఎంఐఎం-కాంగ్రెస్ బంధం స్పష్టంగా కనపడుతోందని, ఎంఐఎం గతంలో బీఆర్‌ఎస్‌తో కూడా కాపురం చేసిందని, దాని మద్దతుతోనే గతంలో బీఆర్‌ఎస్ సిటీలో కొన్ని సీట్లు గెలిచిందని విమర్శించారు. పార్లమెంటరీ బోర్డు నుంచి ఆమోదం వచ్చిన తర్వాత ఇవాళ సాయంత్రం లేదా రేపు తమ పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు. గత బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ సిటీని, జీహెచ్‌ఎంసీని నిర్లక్ష్యం చేశాయని, జూబ్లీహిల్స్‌లో డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు సరిగా లేవని, నియోజకవర్గంలో ఒక్క ప్రభుత్వ కార్యాలయం కూడా లేదంటూ ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఉదాహరణ అని ఆరోపించారు. దేశంలో, ఇటు తెలంగాణలో నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం స్పష్టంగా కనపడుతోందని, జూబ్లీహిల్స్ ప్రజలు దీన్ని గమనించాలని, తెలంగాణలో 8 ఎంపీ సీట్లలో బీజేపీని గెలిపించి ఆదరించారని, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కూడా బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే లాభం లేదని, ఎందుకంటే ఆ పార్టీలోని నాయకులు ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో చేరుతారో తెలియదు కాబట్టి అసెంబ్లీలో ప్రజావాణిని బలంగా వినిపించేందుకు ఈ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థికి అవకాశం ఇచ్చి అసలైన ప్రతిపక్షంగా బలపరచాలని రామచందర్‌రావు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కళ్యాణ్ నాయక్, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవినాయక్, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్.వి.సుభాష్, పార్టీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు, తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





