– నోటిఫికేషన్‌తో పాటే నామినేషన్ల ప్రక్రియా షురూ
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సోమవారం నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఉదయం నుంచి పలువురు నామినేషన్లను దాఖలు చేశారు. తొలిరోజు సాయంత్రం సమయం ముగిసేసరికి పది నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో రెండు రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులవి కాగా ఎనిమిది స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. తెలంగాణ పునర్నిర్మాణ సమితి తరపున పూస శ్రీనివాస్, నవతరం పార్టీ నుంచి అర్వపల్లి శ్రీనివాసరావు నామినేషన్‌లు దాఖలు చేశారు. అలాగే స్వతంత్ర అభ్యర్థులుగా సిలివేరు శ్రీకాంత్, పెసరకాయల పరీక్షిత్ రెడ్డి, చలిక చంద్రశేఖర్, సపవత్ సుమన్, వేముల విక్రమ్ రెడ్డి, ఇబ్రహీంఖాన్‌తోపాటు మరో ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి.కర్ణన్ మీడియాతో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలవడంతో నామినేషన్లు స్వీకరిస్తున్నామని తెలిపారు. ఈనెల 21వ తేదీ వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తామన్నారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయం వంద మీటర్ల వరకు ఆంక్షలు అమలులో ఉన్నాయని తెలిపారు. ఈ పరిధిలో ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. నాలుగు వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారని, 45 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని కర్ణన్ వెల్లడించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





