– వీటిలో 5 ఎకరాలు తమవేనంటూ ఎస్‌బీఐ పిటిషన్
- కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18: హైదరాబాద్ రాయదుర్గం భూముల వేలంపై హైకోర్టు మూడు వారాలపాటు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మూడు వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఈ సందర్భంగా ప్రతివాదులను న్యాయస్థానం ఆదేశించింది. రాయదుర్గంలోని సర్వే నంబర్ 83/1లోని భూమికి ఇటీవల వేలం నిర్వహించారు. ఈ స్థలాన్ని ఎకరాకు రూ.237కోట్ల చొప్పున గౌరా వెంచర్స్ కొనుగోలు చేసింది. అయితే ఆ భూమిలో 5 ఎకరాలు తమదేనంటూ హైకోర్టును స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ) ఆశ్రయించింది. సర్వే నెంబర్ 83/1లోని 5 ఎకరాల భూమి తిరిగి ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది. దీనిపై గురువారం విచారణ చేపట్టిన ధర్మాసనం రాయదుర్గం భూముల వేలంపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఎస్‌బీఐ, టీజీఐఐసీ, గౌర వెంచర్స్‌కు నోటీసులు జారీ చేసింది. మే 6న జారీ చేసిన వేలం నోటిఫికేషన్‌తోపాటు తదనంతరం జరిగిన భూ విక్రయాన్ని, తమ వినతిపత్రాన్ని తిరస్కరిస్తూ మే 20న జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాల్ చేస్తూ ఎస్‌బీఐ రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది. రాయదుర్గంలో ఎస్‌బీహెచ్‌కు 2010లో ఐదెకరాల భూమిని ప్రభుత్వం కేటాయించగా ఇందుకోసం రూ.13.33 కోట్లను చెల్లించింది. ఎస్‌బీఐలో ఎస్‌బీహెచ్ విలీనం కాగా, గతంలో ఈ స్థలంలో ఉన్న రెండు ఏటీఎంలను ఎస్‌బీఐ నిర్వహిస్తోంది. 2020లో గత ప్రభుత్వం భూకేటాయింపును రద్దు చేయగా ఎస్‌బీఐ హైకోర్టును ఆశ్రయించింది. కేటాయింపు ఉత్తర్వులను రద్దు చేస్తూ ఎస్‌బీఐ అభ్యర్థనను పునఃపరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది. 2024లో ప్రస్తుత ప్రభుత్వం కూడా ఈ కేటాయింపును రద్దు చేయడంతో ఎస్‌బీఐ మరోసారి హైకోర్టును ఆశ్రయించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.