నెత్తురోడిన రాష్ట్ర రహదారులు

– వేర్వేరు ప్రమాదాల్లో 8మంది మృతి
– మేడ్చల్ వద్ద ప్రమాదంలో ముగ్గురి మృతి
– వరంగల్ రహదారి ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18: రాష్ట్రంలోని రహదారులు నెత్తురోడాయి. వేర్వేరుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిదిమంది మృతి చెందారు. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై మినీ ట్రక్కును లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఇద్దరు మృతిచెందారు. ఎస్సై బండి శ్రవణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం దేవరుప్పుల మండలంలో కిరాణా దుకాణం నిర్వహించే జాట్ రోహిత్, యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం బండ కొత్తపల్లికి చెందిన మధు టాటా ఏస్ మినీ ట్రక్కులో హైదరాబాద్ నుంచి కిరాణా సామగ్రి తీసుకొస్తుండగా తెల్లవారుజామున జనగామ జిల్లా నెల్లుట్ల సమీపంలోకి రాగానే ట్రక్కు టైరు పంక్చర్ అయింది. అటుగా వెళ్తున్న లారీని ఆపి జాకీ తీసుకున్నారు. లారీ క్లీనర్ రాజేందర్, ట్రక్కు డ్రైవర్ మధు, కిరాణా దుకాణ యజమాని రోహిత్ టైరును మారుస్తున్న క్రమంలో వెనుక నుంచి మరో లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు జనగామ జిల్లా హాస్పిటల్‌లో మృతిచెందారు. అలాగే మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ పరిధిలోని తుర్కపల్లి-మురహరిపల్లి మధ్య ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లింది. అదే వేగంతో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. సమాచారం అందిన వెంటనే మేడ్చల్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. కారులో నుంచి మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు యత్నించారు. మరో సంఘటనలో వికారాబాద్‌జిల్లా పరిగి మండలం చిగురాల్‌పల్లి వద్ద బైక్‌ను టిప్పర్ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో మోమిన్‌కలాన్‌కు చెందిన జావీద్‌పాషా (30) అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి జగిత్యాల వైపు వెళ్తున్న కారు, డీసీఎం వ్యాన్ సిరిసిల్ల బైపాస్‌పై ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న అభిషేక్ అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ముగ్గురు గాయపడ్డారు. కారులో ప్రయాణిస్తున్న వారిది జగిత్యాలగా తెలుస్తోంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.
————————————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *