– బీఆర్‌ఎస్ ఆధ్యర్యంలో ఆందోళన
– ప్రభుత్వ తీరుపై మండిపడ్డ వేముల
నిజామాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18: యూరియా యాప్‌ను తక్షణం తొలగించాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై నిజామాబాద్ జిల్లా వేల్పూర్ ఎక్స్ రోడ్డు వద్ద పార్టీ శ్రేణులతో కలిసి మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆందోళనకు దిగారు. రైతులు, గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల ఉసురు పోసుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త తరహా యూరియా పంపిణీ వ్యవస్థను తీసుకువచ్చిందని ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. దుకాణాల్లో లేని యూరియా బస్తాలు యాప్ ద్వారా ఎలా రైతులకు అందుతాయని ప్రశ్నించారు. యాప్ వల్ల గ్రామాల్లో రైతులు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. అందుకే యూరియా యాప్ తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యూరియా యాప్ పోవాలి.. రేవంత్ దిగి రావాలి అంటూ నినాదాలు చేశారు. రైతులకు తక్షణమే యూరియా అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రైతులపై కక్ష సాధింపు చర్యలో భాగంగానే యూరియా యాప్ తెచ్చి తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సకాలంలో రైతుబంధు ఇవ్వక రైతులను ప్రభుత్వం నట్టేట ముంచుతున్నదని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రైతును రాజును చేసే ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు. రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నా రేవంత్ సర్కార్ పట్టించుకోకపోవడం సిగ్గు చేటన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.