Take a fresh look at your lifestyle.

తెలంగాణ వ్యాప్తంగా.. జోరుగా వానలు

  • ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ముసురు
  • పలుచోట్ల పొంగుతున్న వాగులు,వంకలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో  తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. మరోమూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడనున్నాయి. అలాగే ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ముసురువాన పడుతోంది. అక్కడక్కడా భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగుతున్నాయి.  ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో  ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ముసురువానకు ఇండ్ల నుంచి బయటకెళ్లే పరిస్థితి లేకపోవడంతో రోజువారి కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడింది. చెరువులు, కుంటల్లోకి వరద పెరుగుతోంది. ఇప్పటికే కొన్ని చెరువులు నిండి అలుగుపోసేందుకు సిద్ధంగా ఉండగా, మరికొన్ని నిండు తున్నాయి. చాలావరకు వరినాట్లు పూర్తికాగా, ముసురువానతో మెట్ట పంటలకు ఊపిరి పోసినట్లయ్యింది. పత్తి, కందులు, పెసర తదితర పంటలకు ఢోకా ఉండదని అన్నదాతలు ఆనందపడుతున్నారు. హైదరాబాద్‌ ‌లో కురుస్తున్న భారీ వర్షంతో మూసీ పోటెత్తుతోంది. మరో రెండురోజులు వానలు ఉంటాయని వాతావరణ అధికారులు పేర్కొన్నారు.

తుఫాను ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న ముసురుతో జిల్లా రైతాంగం ఆనందోత్సాహం వ్యక్తం  చేస్తున్నారు. మెట్ట పంటలైన పత్తి, కంది, పెసర, నువ్వులకు కురుస్తున్న వర్షాలు జీవం పోసినట్లయ్యింది. వరి సాగుకు రైతులు దుక్కుల దున్నకం పనులు ముమ్మరంగా చేస్తున్నారు. బోరు, బావుల కింద సాగు చేస్తున్న రైతులు నాట్లు వేస్తున్నారు.  గడిచిన 24 గంటల్లో అత్యధికంగా ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో 12 సెంటీటర్ల వర్షం కురిసింది. ఖమ్మంలోని మున్నేరు ఉగ్రరూపం దాల్చింది. జనగామ మినహా ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో వర్షం దంచికొట్టింది. జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లాలోని పెద్దవాగు, చెలిమెల, సింగంపల్లి, మోరంచ వాగులు పొంగిపొర్లుతున్నాయి. గణపురం మండలంలో ఆర్టీసీ బస్సుపై చెట్టు కూలడంతో కండక్టర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. భూపాలపల్లి సింగరేణి ఏరియాలో సంస్థకు రూ.4.12 కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. ములుగు జిల్లాలో జంపన్నవాగు ఉద్ధృతి పెరిగింది. కరీంనగర్‌ ‌జిల్లాలో  228 మత్తళ్లు దుంకుతున్నాయి. ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలోని కూడెల్లి, కామారెడ్డి జిల్లా పాల్వంచ వాగులు పొంగిపొర్లుతున్నాయి.  గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌నగరంపై ముసురు ముసుగేసింది. పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిశాయి. వికారాబాద్‌ ‌జిల్లాలో కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి. జిల్లాలో పెద్ద ప్రాజెక్టుగా ఉన్న కోట్‌పల్లి ప్రాజెక్టు అలుగు పారడంతో నీటి ప్రవాహంతో నాగసమందర్‌ – ‌వికారాబాద్‌ ‌జిల్లా కేంద్రానికి మధ్యలో కల్వర్టు కొట్టుకుపోయింది. అటు తాండూర్‌ – ‌వికారాబాద్‌ ‌మధ్యలోని మంచన్‌ ‌పల్లి దగ్గర ప్రధాన రహదారి కల్వర్టు కొట్టుకపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!