పరస్పర గౌరవంతోనే ఆరోగ్యకర బంధాలు

– కోపం, అహంకారాన్ని విడనాడాలి
– ‘స్టాండ్‌ విత్‌ హర్‌’ చర్చావేదికలో డీజీ చారు సిన్హా

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబరు 10: కోపం, అహంకారం, ఆధిపత్య ధోరణులతో కూడిన విషపూరిత పురుషాధిక్య భావజాలాన్ని మార్చుకోవాలని సీఐడీ, ఏసీబీ, మహిళా భద్రత విభాగాల డీజీ చారు సిన్హా అన్నారు. పురుషులు అలవర్చుకున్న ప్రవర్తనలను మార్చుకోవడం కూడా సాధ్యమేనని పేర్కొన్నారు. పురుషులు, మహిళలు ఒకరికొకరు పరస్పర పూరకాలని, ఎవరూ ఎక్కువ లేదా తక్కువ కాదని స్పష్టం చేశారు. ‘స్టాండ్‌ విత్‌ హర్‌’ ప్రచారంలో భాగంగా శనివారం హైదరాబాద్‌లోని వీహబ్‌, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో నిర్వహించిన ఎనిమిదో చర్చావేదికలో ఆమె మాట్లాడారు.

భావోద్వేగాలను నియంత్రించుకోవాలి
వాదన జరిగినప్పుడు భావోద్వేగాలను అదుపులోకి తెచ్చుకునేందుకు కొంత సమయం తీసుకోవడం మంచిదేనని అనూష సూచించారు. అయితే, తనకు కొంత సమయం అవసరమని ఎదుటివారికి తెలియజేయకపోతే అపార్థాలు ఏర్పడతాయని చెప్పారు. కుటుంబం, సమాజంలో లింగ వివక్షకు సంబంధించిన పాత భావజాలాన్ని పురుషులతోపాటు మహిళలు కూడా కొనసాగిస్తున్నారని నటి, యాంకర్‌ ఝాన్సీ పేర్కొన్నారు. ఇలాంటి ధోరణులను ప్రతి ఒక్కరూ గుర్తించి మార్చుకోవాలని సూచించారు.

క్రీడలతో ఒత్తిడికి దూరం

కోపాన్ని నిర్మాణాత్మకంగా మళ్లించేందుకు క్రీడలు, శారీరక వ్యాయామాలు దోహదపడతాయని నటుడు వంశీ చాగంటి అన్నారు. విభేదాలు వచ్చినప్పుడు వాదనలో గెలవడం కంటే సంబంధాలను కాపాడుకోవడం ముఖ్యమని కార్మిక శాఖ ప్రత్యేక కమిషనర్‌ పమేలా సత్పతి అన్నారు. మహిళల అభిప్రాయాలు, అనుభవాలను తక్కువగా చూడటం, వారికి తెలిసిన విషయాలను అనవసరంగా వివరించడం వంటి ధోరణులను గుర్తించి మార్చుకోవాలని వీహబ్‌ సీఈఓ సీత పల్లచొల్ల సూచించారు.
సమానత్వమే లక్ష్యం
కోపం, అహంకారం, వివక్షాపూరిత ధోరణులను అధిగమించేందుకు పరస్పర చర్చించుకోవడం , ఇతరుల అభిప్రాయాలకు గౌరవం, స్వీయ నియంత్రణ అవసరమని వక్తలు పేర్కొన్నారు. ‘స్టాండ్‌ విత్‌ హర్‌’ కార్యక్రమం ద్వారా ప్రతి నెలా ఒక అంశంపై చర్చలు నిర్వహిస్తూ లింగ సమానత్వం, పరస్పర గౌరవం, సామాజిక మార్పుపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ చర్చలో సీడీఈడబ్ల్యూ, మహిళా భద్రత విభాగానికి చెందిన అనూష, నటి ఝాన్సీ, నటుడు వంశీ చాగంటి, వీహబ్‌ సీఈఓ సీత పల్లచొల్ల, ఐఏఎస్‌ అధికారి పమేలా సత్పతి, టీవీ9 సీనియర్‌ వార్తా వ్యాఖ్యాత దీప్తి వాజ్‌పేయి, పోలీస్ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *