– రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు
– ప్రతీ విద్యార్థి ఉన్నతస్థాయికి చేరేలా సకల సదుపాయాలు
– రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి
మణుగూరు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. పేదవారి పిల్లలు కూడా ధనికుల పిల్లలతో సమానంగా చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. విద్య పట్ల ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతకు అనేక నిదర్శనాలు ఉన్నాయన్నారు. మణుగూరు మండలం లంక మల్లారం గ్రామంలో భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని బీటీ రహదారి పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేసి టీటీఆర్‌జేసీ బాలికల డార్మెటరీ హాల్‌ను ప్రారంభించారు. ఇటీవలే రూ.2.70 కోట్లతో బాలికల వసతి గృహాన్ని ప్రారంభించామన్నారు. కార్యక్రమానికి ముందుగా రూ.కోటి అంచనా వ్యయంతో ప్రధాన బీటీ రహదారి నుండి పాఠశాల వరకు అప్రోచ్ బీటీ రహదారి నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. పేద కుటుంబాలకు చెందిన పిల్లలు కూడా మంచి ఆహారం తీసుకుంటూ మెరుగైన విద్యను అభ్యసించాలనే ఆశయంతో హాస్టళ్లలో ఉన్న బాలబాలికలకు ప్రభుత్వం నాణ్యమైన భోజనాన్ని అందిస్తోందన్నారు. ఇంటి వద్ద తల్లులు చేసే వంట రుచిని గుర్తు చేసేలా పోషకాహారంతో కూడిన మెనూను అమలు చేస్తూ, హాస్టళ్లలో సకల సౌకర్యాలు కల్పిస్తూ విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ ప్రభుత్వం పేద విద్యార్థుల భవిష్యత్తుపై పూర్తి విశ్వాసంతో ఉందని, వారు తమ కాళ్ల మీద నిలబడి దేశాన్ని, ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగగలరని నమ్ముతున్నదని పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎవరికీ చదువు ఆగిపోకుండా అన్ని వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. పేదవారి పిల్లలు కూడా కార్పొరేట్ స్థాయి విద్యను పొందేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. విద్యతోపాటు నైపుణ్యాభివృద్ధికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రతి నియోజకవర్గంలో సుమారు రూ.65 కోట్లతో వివిధ నైపుణ్యాలపై శిక్షణ కేంద్రాలు (ఏటీసీ కేంద్రాలు) ఏర్పాటు చేd వివిధ రంగాల్లో విద్యార్థుల ప్రతిభను వెలికితీస్తున్నామని చెప్పారు. ఈ శిక్షణల ద్వారా వారు స్వయం ఉపాధి పొందడమే కాకుండా మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వైద్య రంగంలో కూడా పేదవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం కలిగితే ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ హాస్పిటల్స్‌ను బలోపేతం చేసి నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్నామని చెప్పారు. పేదల పక్షపాతిగా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో శాతం వంద ఫలితాలు సాధించినందుకు ప్రిన్సిపాల్, సిబ్బందిని ప్రభుత్వం తరఫున అభినందించారు. ఇదేవిధంగా భవిష్యత్తులో కూడా మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నిర్మిస్తోందన్నారు. ఈ నియోజకవర్గంలో కూడా ఈ పాఠశాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రతీ పేదవాడి సొంతింటి కలను నెరవేర్చే దిశగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడంతోపాటు గిరిజనుల కోసం అదనంగా వెయ్యి ఇళ్లు మంజూరు చేసి నియోజకవర్గంలోని 380 గ్రామాలకు సుమారు 4500 ఇళ్లు ఆమోదించామని వివరించారు. పేదలకు నాణ్యమైన వైద్య సేవలందించేందుకు వంద పడకల హాస్పిటల్ నిర్మాణం చేపడుతున్నామని, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నామని తెలిపారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ డైట్ చార్జీలు పెంచి పోషకాహారం అందిస్తున్నదన్నారు. విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నదని, ఈ అవకాశాలను వినియోగించుకుని ఉన్నత శిఖరాలకు చేరాలని సూచించారు.
కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక- 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లావ్యాప్తంగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి చేపడుతున్నామని తెలిపారు. తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, ఫర్నిచర్ వంటి వసతులను పూర్తిస్థాయిలో కల్పించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. వేసవి సెలవుల్లో సమ్మర్ క్లాసులు నిర్వహించి విద్యార్థులకు విద్యతోపాటు క్రీడలు, సాంస్కృతిక, నైపుణ్యాభివృద్ధి అంశాల్లో శిక్షణ అందించనున్నామని తెలిపారు. పేరెంట్స్ మీటింగ్స్ ద్వారా తల్లిదండ్రుల్లో అవగాహన పెంచుతూ విద్యార్థుల డ్రాపవుట్ రేటును తగ్గించే చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని చదువుపై దృష్టి సారించాలని సూచించారు. ఉన్నతస్థాయికి ఎదిగి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు.
ఐటీడీఏ పీవో రాహుల్ మాట్లాడుతూ ఈ విద్యాసంస్థలో ప్రస్తుతం 584మంది విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. 16 గదులతో నిర్మించిన కొత్త డార్మెటరీ ద్వారా సుమారు 600మందికి వసతి కల్పించగల సామర్థ్యం ఏర్పడిందన్నారు. విద్యార్థుల ఉత్తీర్ణత శాతం మెరుగ్గా ఉందని, ఐఐటీ తదితర ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. గిరిజన గురుకుల విద్యాసంస్థల అభివృద్ధికి ప్రభుత్వం రూ.53 కోట్లు మంజూరు చేయగా భద్రాచలం ఐటీడీఏకు రూ.6 కోట్లు, ఈ పాఠశాలకు రూ.25 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. గిరిజన పాఠశాలల్లో కూడా డిజిటల్ తరగతులు నిర్వహించేలా తగిన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మంత్రిని కోరారు. కార్యక్రమంలో భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, గ్రామ సర్పంచ్ పూనెం రమేష్, పాఠశాల ప్రిన్సిపాల్ రాణి, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





