-ప్రజలకు బీఆర్ఎస్ నేత హరీష్‌రావు విజ్ఞప్తి
– దుఃఖంలో ఉన్న ఆడబిడ్డను అవమానించడం తగదు
– మంత్రుల వ్యాఖ్యలు దుర్మార్గం
– బీజేపీ నుంచి బీఆర్‌ఎస్‌లోకి చేరికలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 15: ప్రజలు విజ్ఞులు.. మంచి, చెడు ఆలోచిస్తారు.. కాంగ్రెస్, బీజేపీలు ఏం చేశాయనేది ఒకసారి ఆలోచించాలి అని మాజీ మంత్రి హరీష్‌రావు విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీజేపీ సీనియర్ మహిళా నాయకులు కళావతి, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు బి.లక్ష్మి, మహిళా మోర్చా రాష్ట్ర నాయకులు శైలజ, ఆర్.కె.లక్ష్మి, అనురాధ, మంజుల, సత్యవతితోపాటు 200 మంది కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి హరీష్‌రావు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌లో చేరుతున్న సోదరసోదరీమణులందరికీ పేరుపేరునా నమస్కారం.. గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత గెలవాలని, ఒక ఆడబిడ్డను ఆశీర్వదించాలని మీరందరూ బీజేపీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరడం సంతోషకరం అని అన్నారు. భర్తను కోల్పోయి దుఃఖం అనుభవిస్తున్న మహిళను కాంగ్రెస్ మంత్రులు అవమానించే విధంగా మాట్లాడడం దుర్మార్గం అని జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి గెలిచిన మాగంటి గోపీనాథ్ దురదృష్టవశాత్తు చనిపోగా ఆ కుటుంబాన్ని నిలబెట్టేందుకు ఉప ఎన్నికలో ఆయన సతీమణి సునీతను బీఆర్‌ఎస్ తరపున నిలిపామని చెప్పారు. కాంగ్రెస్ విషయానికొస్తే రాహుల్ గాంధీ మొహబ్బత్‌కి దుకాన్ అంటారు.. మోదీ సబ్ కా సాత్ సబ్కా వికాస్ అంటారు. కానీ జరుగుతున్నది ఏమిటి? హైడ్రా పేరిట పేదవారి ఇల్లు కూలగొట్టడం మొహబ్బత్ దుకాణా అని నిలదీశారు. పెద్దోళ్ల ఇల్లులు కూలగొట్టట్లేదు.. పేదోళ్లు ఇల్లులు ఎందుకు కూలగొడుతున్నావ్ రేవంత్ రెడ్డి అని రాహుల్ గాంధీ అడగడం లేదేమని ప్రశ్నించారు. బీహార్‌లో వోట్ చోరీ అంటున్నావు.. జూబ్లీహిల్స్ ఎన్నికలో సునీతను ఓడగొట్టాలని 20 వేల దొంగ ఓట్లను కూడగట్టుకున్నారు.. రేవంత్ రెడ్డి వోటు చోరీ చేస్తుంటే ఎందుకు మాట్లాడవు రాహుల్ గాంధీ అని నిలదీశారు. అందుకే రేవంత్ రెడ్డిని ఓడిస్తేనే బుద్ధి వస్తుందన్నారు. ప్రతి అక్కచెల్లెమ్మకు కాంగ్రెస్ పార్టీ రూ.55వేల బాకీ పడిరదంటూ జూబ్లీహిల్స్‌లో ఒక్కో మహిళకు రూ.55 వేలు ఇచ్చి ఓటు అడగాలని రేవంత్‌రెడ్డికి హితవు పలికారు. జూబ్లీహిల్స్‌లో బీజేపీకి డిపాజిట్ వచ్చుడే కష్టం. గోదావరి పుష్కరాలకు ఆంధ్రప్రదేశ్‌కు రూ.100 కోట్లు ఇచ్చి తెలంగాణకు గుండు సున్నా ఇచ్చారు.. తెలంగాణ నీటిని దోపిడీ చేసే బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రంలోని బీజేపీ మద్దతిస్తున్నది.. దేశంలో 157 మెడికల్ కాలేజీలు ప్రకటిస్తే ఒక్క మెడికల్ కాలేజీని కూడా తెలంగాణకు ఇవ్వలేదు.. ఇదేనా సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అని నిలదీశారు. బీజేపీకి ఎనిమిదిమంది ఎంపీలను గెలిపిస్తే రాష్ట్రానికి మీరు చేసిన మంచి ఇదేనా అని అడిగారు. తెలంగాణ గొంతు నొక్కడంలో కాంగ్రెస్, బీజేపీ దొందు దొందేనని హరీష్‌రావు ఎద్దేవా చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





