అసెంబ్లీని త‌ప్పుదోవ ప‌ట్టించారు.

సీఎం రేవంత్, మంత్రి కోమ‌టిరెడ్డిపై ప్రివిలేజ్ మోష‌న్ పెడతాం..
గేమ్ ఛేంజ‌ర్ టికెట్ల రేట్ల పెంపుపై హ‌రీశ్‌రావు ఆగ్ర‌హం..

 సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న త‌ర్వాత‌ ఇక మీదట సినిమాలకు స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చేది లేదంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెండు వారాలు కూడా తిరగకముందే ఊసరవెల్లి సైతం సిగ్గుపడేలా మాట మార్చారని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు విమ‌ర్శించారు. టికెట్ రేట్లు పెంచేది లేదంటూ అదే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలు సైతం స్వల్ప వ్యవధిలోనే నీటి మూటలు అయ్యాయని పేర్కొన్నారు.

అసెంబ్లీలో ప్రకటించిన దానికే విలువ లేకపోతే ఎట్లా ? అసెంబ్లీని కూడా తప్పుదోవ పట్టిస్తూ టికెట్ రేట్లు, అదనపు షోలకి అనుమతి ఇవ్వడం సభను అవమానించడమేన‌ని అన్నారు.  అసెంబ్లీని తప్పుదోవ పట్టించినందుకు ముఖ్యమంత్రిపై, మంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన కింద ప్రివిలేజ్ మోషన్ పెడతాం. మాట తప్పం , మడమ తిప్పం అంటూ బీరాలు పలికి ఇప్పుడు టికెట్ రేట్ల పెంపునకు ఎలా అనుమతి ఇచ్చారు?

 ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? గతంలో మీరు బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వడం వల్లే ఒక మహిళ మృతి చెందారు, మరో పసివాడు ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ పాపం మీ ప్రభుత్వానిదే కదా రేవంత్ రెడ్డి. ఆ దురదృష్ట ఘటనను మరిచిపోకముందే ఎందుకు ఈ యూ టర్న్? దీని వెనుక ఉన్న మర్మం ఏమిటి? అని హ‌రీష్ రావు ప్ర‌శ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *