దోపిడీనే బీఆర్ఎస్ పాల‌కుల సంస్కృతి

– లక్షల కోట్ల అప్పులు మిగిల్చి వెళ్లింది
– మా సంస్కృతి మాధవ సేవ-మానవ సేవ 
– రాష్ట్రాన్ని నెంబర్ వన్‌గా నిలబెడతాం
– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 29 : బీఆర్‌ఎస్ పాలకులు ఆర్థిక, సామాజిక దోపిడీకి పాల్పడి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ కుటుంబం, తమ నలుగురి కోసం అన్నట్లు పదేళ్లు పాలన చేశారని, నలుగురు కుటుంబ సభ్యులు దోచుకున్న రాష్ట్ర సంపదతో నాలుగు చానళ్లు, పత్రికలు, సోషల్ మీడియాలు పెట్టి వాటి ద్వారా ప్రజా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రుపాలెం మండలంలోని జమలాపురం వెంకటేశ్వర స్వామిని ఆయన సతీసమేతంగా దర్శించుకుని ధ్వజస్తంభ ప్రాణప్రతిష్ఠ, మహా కుంభాభిషేక ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి దంపతులకు వేద పండితులు, అర్చకులు అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆయన వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పగిస్తే రూ.8 లక్షల కోట్ల అప్పులు మిగిల్చారని ధజమెత్తారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం మాధవ సేవ-మానవ సేవ అనే మన సంస్కృతి విలువలతో ముందుకు సాగుతోందన్నారు. ప్రజా ప్రభుత్వం నిరుపేదల, మధ్యతరగతి కుటుంబాల అవసరాలను గుర్తిస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. ఇల్లు లేని నిరుపేద ఉండకూడదనే ఉద్దేశంతో పనిచేస్తున్నదని, రాష్ట్రవ్యాప్తంగా రూ.22,500 కోట్లతో ఒకేసారి 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను తమ ప్రభుత్వం మంజూరు చేసిందని గుర్తు చేశారు. రాష్ట్రంలోని 1.06 కోట్ల కుటుంబాలకు ఉచితంగా సన్న బియ్యాన్ని అందిస్తున్నట్లు, పేద, మధ్యతరగతి కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తుండగా 53 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని ఆయన వివరించారు. కొన్ని గ్రామాల్లో 90% కుటుంబాల కరెంట్ బిల్లును ప్రభుత్వమే చెల్లిస్తోందన్నారు. 30 లక్షల పంప్ సెట్లకు ఉచిత కరెంట్ అందిస్తున్నామని, దీనికోసం ఏడాదికి రూ.14,000 కోట్లను ప్రభుత్వం డిస్కమ్‌లకు చెల్లిస్తోందని తెలిపారు.

మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, రుణాలు 

మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామని, ఆ టికెట్లకు సంబంధించిన నగదును ప్రభుత్వమే ఆర్టీసీకి చెల్లిస్తోందని విక్రమార్క చెప్పారు. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజ్ ద్వారా రూ.20,000 కోట్ల రుణాలు అందిస్తూ అయిదేళ్లలో రూ.లక్ష కోట్లకు పైగా వడ్డీ లేని రుణాలను ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశామని, గతంలో ఉన్న రూ.5 లక్షల సీలింగ్‌ను రూ.10 లక్షలకు పెంచామని తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో ఆరోగ్యశ్రీ అస్తవ్యస్తంగా మారి పేదలు ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చిందని, ప్రస్తుత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుందన్నారు. డైట్ చార్జీలను 40%, కాస్మెటిక్ చార్జీలను 200% పెంచామని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 20 లక్షల మంది, రెసిడెన్షియల్ పాఠశాలల్లోని 7 లక్షల మంది విద్యార్థులకు ఉచిత అల్పాహార(బ్రేక్‌ఫాస్ట్) పథకాన్ని ప్రారంభించామని వివరించారు. ఆలయాల అభివృద్ధి, సంస్కృతి పరిరక్షణకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి రూ.2,216 కోట్లను కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టిందని తెలిపారు. గిరిజనుల ఆరాధ్య దైవమైన సమ్మక్క-సారలమ్మ వంటి దేవాలయాలను రూ.వందల కోట్లతో అభివృద్ధి చేస్తూ ప్రజల మనోభావాలను కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్క గ్రూప్-1 పరీక్ష కూడా నిర్వహించకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ విడుదల చేయడమేకాక దాదాపు 76వేల మంది నిరుద్యోగులకు నియామక పత్రాలు అందించామని గుర్తు చేశారు. సంక్షేమంతోపాటు అభివృద్ధిని సమాంతరంగా పరుగులు పెట్టిస్తున్నామన్నారు. ఆరఅండ్‌బీ శాఖ ద్వారా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.90 వేల కోట్లతో రహదారుల పనులు మంజూరు చేశామని, నిన్ననే నల్గొండలో రూ.13వేల కోట్లతో హ్యామ్ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశామని వివరించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లకు దీటుగా ప్రపంచంతో పోటీపడేలా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామన్నారు. మూసీ పునరుజ్జీవం, రీజినల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్ల కనెక్టివిటీతోపాటు అనేక పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ(సర్వీస్ సెక్టార్), పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ(పరిశ్రమలు), రూరల్ రీజియన్ ఎకానమీ(వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు)గా విభజించి రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం చెప్పారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని భట్టి విస్పష్టం చేశారు. విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకేట అన్వేష్ రెడ్డి, ‘సుడా’ చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *