హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 14: ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్(టీడీఆర్)పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీడీఆర్ జారీ, వినియోగ నిబంధనల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జివో 218 ద్వారా తెలంగాణ బిల్డింగ్ రూల్స్-2012లో సవరణలు చేసింది. దీని ద్వారా హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ పరిధిలో టీడీఆర్ వినియోగానికి మరింత వెసులుబాటు కల్పించిన్లటైంది. నూతన జీవో ప్రకారం ఇకపై హెచ్‌ఎండీఏ చేపట్టే ప్రాజెక్టుల కోసం అవసరమైన/స్వాధీనం చేసుకున్న భూములకు ఆ సంస్థే టీడీఆర్ సర్టిఫికెట్లు జారీ చేయనుంది. జీహెచ్‌ఎంసి పరిధి సహా సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ప్రజా ప్రయోజన/ప్రాజెక్టుల కోసం ఇచ్చే భూములకూ ఈ నియమం వర్తించనుంది. హెచ్‌ఎండీఏ జారీ చేసే టీడీఆర్ సర్టిఫికెట్‌ను ఆ సంస్థ పరిధిలో ఎక్కడైనా వినియోగించుకోవచ్చు/డిస్పోజ్ చేసుకోవచ్చు. అలాగే టీడీఆర్ జారీ పక్రియను పూర్తిగా ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నారు. అదేవిధంగా టీడీఆర్‌కు సంబంధించిన వివరాలు, లెక్కలు, వినియోగంపై ఏకరీతి విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ మేరకు సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్లకు టీడీఆర్ సర్టిఫికెట్ కాపీ అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. బిల్డ్ నౌ వ్యవస్థలో టీడీఆర్ ప్రాసెసింగ్, జారీ, అకౌంటింగ్, వినియోగానికి అవసరమైన మార్పులూ చేసింది. గెజిట్‌లో ప్రచురించిన తేదీ నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు