ఒక్క నెలలోనే 4021 మంది లబ్దిదారుల ఎంపిక
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 21: డయాలసిస్ పేషెంట్ల జీవితాల్లో కొత్త ఆశల వెలుగు నింపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కొత్తగా మొత్తం 4,021 మంది డయాలసిస్ రోగులకు నెలకు రూ.2,016 చొప్పున పెన్షన్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది గత ప్రభుత్వ పరిపాలనతో పోలిస్తే అధికంగా ఉంది. బీఆర్‌ఎస్ హయాంలో కేవలం 4,011మంది డయాలసిస్ పేషెంట్లకే ఆసరా పింఛన్ అందగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క నెలలోనే దాన్ని మించి లబ్ధిదారులు ఎంపిక కావడం గమనార్హం. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది మంత్రి దనసరి అనసూయ సీతక్క చొరవతోనే నూతన లబ్ధిదారుల ఎంపిక జరిగింది. ముఖ్యంగా డయాలసిస్ బాధితులు ఏ పనీ చేయలేరు.. ప్రతి నెలా ఆసుపత్రిలో చికిత్స పొందాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వారి కష్టాలను గుర్తించిన ప్రభుత్వం వారికి పెన్షన్లను మంజూరు చేసింది. వీరితోపాటు త్వరలో హెచ్‌ఐవీ బాధితులకు కూడా పింఛన్లు మంజూరు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు 13,000 మంది హెచ్‌ఐవీ పేషెంట్లు తమకు పెన్షన్లు మంజూరు చేయాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. అన్ని రకాల నూతన పెన్షన్‌దారుల ఎంపిక కోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆర్థిక శాఖ అనుమతుల కోసం వేచి చూస్తోంది. అనుమతులు రాగానే మరింతమంది లబ్ధిదారులకు పెన్షన్లు అందే అవకాశముంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పింఛన్ల కోసం నెలకు రూ.993 కోట్లు ఖర్చు చేస్తోంది. కొత్త పెన్షన్‌దారుల గుర్తింపు ప్రక్రియ పూర్తయితే ఇది మరింత పెరిగే అవకాశం ఉంది.