రాజ్యాంగ విలువలకు ప్రతిరూపం ఎన్‌ఎస్
బోసురాజు ఆత్మ కథ చైతన్య సాగర పుస్తకావిష్కరణ సభలో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 21: రాజ్యాంగ విలువలకు ప్రతిరూపం ఎన్.ఎస్ బోసు రాజు అని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. కర్నాటకలోని రాయచూర్ లో శనివారం బోసురాజు జన్మదిన వేడుకల్లో పాల్గొని ఆయన ఆత్మకథ చైతన్య సాగర పుస్తకాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత జాతీయ కాంగ్రెస్ సిద్ధాంతాలకు, విలువలకు కట్టుబడి బోసు రాజు జీవిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో బోసురాజు ఎప్పుడూ ముందుంటారన్నారు. జిల్లా అధ్యక్ష స్థాయి నుంచి ఏఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, మంత్రి స్థాయికి ఎదిగిన నాయకుడు అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ విధానాలను పుణికిపుచ్చుకున్న వ్యక్తి బోసు రాజు.. పార్టీ విధానాలను విస్తరించేందుకు, పార్టీని బలోపేతం చేసేందుకుఆయన జీవితం మొత్తం కష్టపడ్డారన్నారు. పార్టీ ఎక్కడ కష్టంలో ఉంటే అక్కడకు ఏఐసీసీ ఆదేశాలతో వెళ్లిన నిబద్ధతగల నాయకుడు అని చెప్పారు. తెలంగాణలో సైతం పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేశారన్నారు. సంస్కరణల కోసం ధైర్యంగా పోరాడటం, శాస్త్రీయ దృష్టికోణాన్ని ప్రోత్సహించటం.. జాతీయ, ప్రాథమిక విధులను పాటించటం.. ఇవన్నీ ఆయన వ్యక్తిత్వంలో నిత్యంగా ప్రతిఫలించాయన్నారు. తాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, ప్రచార కమిటీ చైర్మన్‌గా, సీఎల్పీ నాయకుడిగా పనిచేసిన సమయంలో బోసురాజు ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్నారంటూ మంత్రి భట్టి విక్రమార్క గుర్తు చేసుకున్నారు. కర్ణాటక గెలుపులోనూ బోసురాజు కృషి గొప్పదని చెప్పడంలో సందేహం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి వారు ఇంకా సేవ చేసేందుకు ఆయురారోగ్యాలను భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ.. మరొక్కసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.