తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం

– రైతాంగం ఆందోళన చెందొద్దు
– చివరి గింజ కొనుగోలుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
– ఇప్పటివరకు 57 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు
– రూ.10,097 కోట్ల చెల్లింపులు
– రాజకీయ లబ్దికే ప్రతిపక్షాల రాద్ధాంతం
– మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 27 : తడిసిన ధాన్యాన్ని తప్పకుండా కొనుగోలు చేస్తామని, ,రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ‌ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కొనుగోలు చేసిన తడిసిన ధాన్యాన్ని సత్వరమే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలిస్తున్నామన్నారు. అకాల వర్షాలకు తడిసిన 9,214 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించినట్లు ఆయన వెల్లడించారు. అకాల వర్షాలు సంభవించడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉత్పన్నమైన పరిణామాలను సమీక్షించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అత్యవసరంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రివర్గ సహచరులు, పౌర సరఫరాల శాఖ‌ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, కలెక్టర్లు, పోలీస్ అధికారులు, రవాణా శాఖాధికారులు, పౌర సరఫరాల శాఖాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రైతాంగానికి నష్టం వాటిల్లే ఏ చర్యలనూ ప్రభుత్వం చూస్తూ ఊరుకొబోదన్నారు. ఇది రైతు పక్షపాత ప్రభుత్వం అని, చివరి గింజ వరకు కొనుగోలుకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో  అదీ రబీ సీజన్‌లో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ఉపక్రమించిందని ఆయన తెలిపారు. ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు 66.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం చేరగా అందులో 57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రూ.10,097 కోట్లను చెల్లించినట్లు వెల్లడించారు. దీనివల్ల 8.15 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరిందన్నారు. కొనుగోలులో రాష్ట్రం సరికొత్త రికార్డు సృష్టించిందన్నారు. కొనుగోలు చేసిన 57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో 44.67 లక్షల మెట్రిక్ టన్నులు సాధారణ రకాల ధాన్యం కాగా 12.33 లక్షల మెట్రిక్ టన్నులు సన్నాలని మంత్రి ఉత్తమ్ వివరించారు. ఇసుక సరఫరా చేసే లారీలను ధాన్యం కొనుగోలు కేంద్రాలకు మళ్లించి సత్వరమే ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేస్తున్నట్లు తెలిపారు. ముందెన్నడూ లేని రీతిలో 8575 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తుంటే రాజకీయాల కోసం ప్రతిపక్షాలు రాద్ధాంతం చేసి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ రైతాంగానికి ఎక్కడా ఆటంకాలు ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు.

హెల్ప్ లైన్ నెంబరు 1967

తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలిస్తామని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. రైతులకు అండగా ప్రభుత్వం ఉంటుందంటూ హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసింది. రైతులకు ఎలాంటి నష్టం లేకుండా పంట మొత్తాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపింది. అన్ని కొనుగోలు కేంద్రాల్లో పంట కొనుగోలు సాఫీగా సాగుతొందంటూ రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. ఈమేరకు హెల్ప్ లైన్ నెంబరు 1967 కేటాయించి ఏదైనా సమస్య ఉంటే సంప్రదించాలని సూచించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *