ఫ్లోటింగ్ సోలార్‌పై ప్రత్యేక దృష్టి

– జలాశయాల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుపై ఉమ్మడి అధ్యయనం
– కేంద్ర నిబంధనల సడలింపుపై విజ్ఞప్తి
– విద్యుత్ సబ్సిడీలకే ఏటా రూ.19,000 కోట్లు
 – అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, : రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌ను తట్టుకునేందుకు సౌర, ఫ్లోటింగ్‌ సోలార్‌, ఇతర సంప్రదాయేతర ఇంధన వనరులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రకటించారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన వివరంగా సమాధానమిచ్చారు. రాష్ట్రంలో భారీగా విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నదని, సెప్టెంబర్ 9 నాటికి 19 వేల మెగావాట్లకు చేరినట్లు చెప్పారు. రాష్ట్రంలోని నాగార్జునసాగర్, శ్రీశైలం, పులిచింతల, శ్రీరాంసాగర్, శ్రీపాద ఎల్లంపల్లి, మల్లన్నసాగర్, మిడ్ మానేరు వంటి ప్రధాన సాగునీటి జలాశయాల్లో ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసే అవకాశాలపై విద్యుత్, నీటిపారుదల శాఖలు సంయుక్తంగా అధ్యయనం చేస్తున్నాయని తెలిపారు. దీనిపై త్వరలోనే స్పష్టమైన ప్రకటన చేస్తామన్నారు. సాధారణ సోలార్‌తో పోలిస్తే ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులకు అధిక వ్యయమవుతుందని తెలిపారు. కేంద్రం వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ (వీజీఎఫ్‌) కింద మెగావాట్‌కు రూ.కోటి సహాయం ఇస్తున్నప్పటికీ కేవలం దేశీయ పరికరాలనే వాడాలనే నిబంధన వల్ల మెగావాట్‌కు రూ.1.30 కోట్ల అదనపు భారం పడుతోందన్నారు. ఈ నిబంధనలను సడలిస్తే పెట్టుబడిదారులు మరింతగా ముందుకు వస్తారని అభిప్రాయపడ్డారు. అమ్రాబాద్ గిరిజన ప్రాంతంలోని 80 గ్రామాలను పూర్తిగా సోలరైజ్ చేసి ఇళ్లపై ప్యానెళ్లు అమర్చి మైక్రో గ్రిడ్ ద్వారా విద్యుత్ అందించే ప్రాజెక్టును చేపడుతున్నట్లు తెలిపారు. నీటిపారుదల ప్రాజెక్టులు, మంథని పరిధిలోని కాటారం, మహాముత్తారం ప్రాంతాల్లోనూ అధ్యయనాలు జ‌రుగుతున్నాయ‌న్నారు. అటవీ హక్కుల చట్టం కింద పంపిణీ చేసిన 6.70 లక్షల ఎకరాల గిరిజన భూముల్లో కొత్త‌గా ‘ఇందిరా సౌర గిరి జల వికాసం’ పేరుతో సౌర విద్యుత్ ప్రాజెక్టులను ప్రోత్సహించనున్నట్లు చెప్పారు. గ్రామాల్లో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేందుకు రైతులు ముందుకు రావాలని, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఎమ్మెల్యేలకు భట్టి విక్రమార్క సూచించారు.

ఏటా రూ.19,000 కోట్ల విద్యుత్ సబ్సిడీ

రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ గరిష్ఠంగా 19,000 మెగావాట్లకు చేరిందని భట్టి వెల్లడించారు. ఉచిత వ్యవసాయ విద్యుత్‌కు రూ.14,000 కోట్లు, 55 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకానికి రూ.5,000 కోట్లు కలిపి ప్రభుత్వం ఏటా రూ.19,000 కోట్ల సబ్సిడీ భరిస్తోందన్నారు. ఈ ఆర్థిక భారాన్ని తగ్గిస్తూనే ప్రజలకు ఉచిత విద్యుత్ అందించేందుకు సోలార్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *