– ప్రభుత్వ విధాన నిర్ణయాన్ని కుంభకోణంగా చిత్రీకరించడం తగదు
– జీఈఎం ఈ-వేలం ద్వారా బహిరంగ పోటీ పద్ధతిలో విక్రయాలు
– ఒక్క గింజ బియ్యం కూడా విడుదల కాలేదు
– రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17: ప్రభుత్వ విధాన నిర్ణయాల మేరకు, కేబినెట్ ఆమోదంతో ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్ (జీఈఎం) వేదికగా నిర్వహించిన మిగులు దొడ్డు బియ్యం విక్రయ ప్రక్రియను కుంభకోణంగా చిత్రీకరించడం బాధ్యతారాహిత్యమని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ (టీజీఎస్‌సీఎస్‌సీఎల్) పేర్కొంది. దొడ్డు బియ్యం మాఫియా దందా శీర్షికతో కొన్ని దినపత్రికలలో వచ్చిన కథనం పూర్తిగా ఆధారరహితమని స్పష్టం చేసింది. ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) ద్వారా లబ్ధిదారులకు సన్న బియ్యం సరఫరా చేయాలనే ప్రభుత్వం నిర్ణయం తర్వాత సుమారు 1.40 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం మిగులుగా నిల్వ ఉందని సంస్థ తెలిపింది. దీర్ఘకాలం నిల్వ ఉంచితే నాణ్యత క్షీణించడం, గిడ్డంగుల కొరత, అదనపు వ్యయం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున విక్రయించాలని నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వివరించింది. విక్రయ ప్రక్రియ మొత్తం ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్ (జీఈఎం) ద్వారా నిర్వహించినట్లు, ఎలాంటి నామినేషన్లు, ప్రాధాన్యత కేటాయింపులు లేదా రహస్య ఒప్పందాలకు తావు లేదని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా అర్హత కలిగిన ప్రతి బిడ్డర్‌కు సమాన అవకాశాలు కల్పించినట్లు పేర్కొంది. కేబినెట్ ఆమోదించిన రూ.21.60 కిలో (రూ.21,600 టన్ను) రిజర్వ్ ధర కంటే ఎక్కువగా టన్నుకు రూ.21,700 ధర లభించిందని, ప్రభుత్వ ఆస్తులను తక్కువ ధరలకు విక్రయించారనే ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని సంస్థ వెల్లడించింది. విక్రయాల వల్ల వేల కోట్ల నష్టం జరిగిందనే ప్రచారం వాస్తవాధారాలు లేనిదేనని తెలిపింది. సుమారు 1.40 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వల మొత్తం విలువే రూ.303 కోట్లు ఉంటుందని, అలాంటి నిల్వలపై వేల కోట్ల నష్టం అన్న వాదనకు ఎలాంటి గణాంక ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఒక్క గింజ బియ్యం కూడా విడుదల కాలేదని, విడుదల ఉత్తర్వు కూడా జారీ కాలేదని, ఒక్క కిలోగ్రాము నిల్వ కూడా గిడ్డంగుల నుంచి తరలించలేదని సంస్థ పేర్కొంది. వేలంలో విజయం సాధించిన సంస్థలు ఒప్పందాలు, సెక్యూరిటీ డిపాజిట్లు పూర్తి చేసినప్పటికీ పత్రాల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోందని వివరించింది. ఈ నేపథ్యంలో బియ్యం మళ్లింపు, రీ-పాలిషింగ్, ఎగుమతులు, అక్రమ విక్రయాలు అనేవి అసంభవమని స్పష్టం చేసింది. మొత్తం వ్యవహారం పూర్తిగా చట్టబద్ధమేనని, పారదర్శకమైనది, ఆడిట్‌కు అనుకూలమైనదని సంస్థ పేర్కొంది. పౌర సరఫరాల సంస్థ ఎల్లప్పుడూ పారదర్శకత, జవాబుదారీతనంతో పనిచేస్తుందని, ఏ దర్యాప్తు సంస్థ ముందు అయినా అన్ని రికార్డులు సమర్పించేందుకు సిద్ధంగా ఉందని తెలిపింది. అదే సమయంలో ఆధారాలు లేని, పరువు నష్టం కలిగించే కథనాలను ప్రచురించడం సరికాదంటూ ఇలాంటి తప్పుడు ప్రచారం పునరావృతం కావద్దని సంస్థ కోరింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




