రేప‌టినుంచి శుభ ముహూర్తాలు

– మోగనున్న పెళ్లి బాజాలు
– పశ్చిమాసియా యుద్దంతో పెరిగిన ఖర్చులు

హదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 17: ‌తెలుగు లోగిళ్లల్లో పెళ్లి బాజాల సందడి మొదలైంది. అధిక జ్యేష్ఠ మాసం వల్ల ఆగిపోయిన శుభకార్యాల హడావుడి ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. సోమ‌వారం నుంచి నిజ జ్యేష్ఠ మాసం ప్రవేశించడంతో పెళ్లిళ్ల హడావుడి షురూ అయ్యింది. 18 ‌నుంచి జూలై 9 వరకు మాత్రమే పరిమితంగా శుభ ముహూర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత మళ్లీ 15 నుంచి ఆషాఢమాసం, గురుమూఢం మొదలై ఆగస్టు 15 వరకు బ్రేక్‌ ‌పడనుంది. శ్రావణ మాసం వస్తేనే గానీ మళ్లీ శుభకార్యాలు జరగవు. ఈ లోపునే పెళ్లిళ్లు జ‌రిపించేయాల‌ని అందరూ ఒకేసారి ప్రయత్నిస్తుండటంతో మార్కెట్లో విపరీతమైన పోటీ ఏర్పడింది. సమయం తక్కువగా ఉండటాన్ని ఆసరాగా చేసుకుని పురోహితులు, ఫంక్షన్‌ ‌హాళ్ల యజమానులు, డెకరేటర్లు అందరూ డిమాండ్‌నుబట్టి రేట్లు పెంచేస్తున్నారు. అయితే ఈ సంతోషాల వెనుక పెళ్లి పెద్దలకు ఒక పెద్ద బ్జడెట్‌ ‌సవాల్‌ ఎదురవుతోంది. ప్రస్తుతం చేతిలో ఉన్న సమయం చాలా తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. మరోవైపు అంతర్జాతీయంగా అమెరికా-ఇరాన్‌ ఉ‌ద్రిక్తతల ప్రభావం తెలుగు లోగిళ్ల పెళ్లిళ్లపై గట్టిగానే పడుతోంది. యుద్ధ వాతావరణం వల్ల పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు, వాహనాల కిరాయిలు భారీగా పెరిగాయి. అలాగే కమర్షియల్‌ ‌గ్యాస్‌ ‌సిలిండర్ల ధరల పెరుగుదలను సాకుగా చూపిస్తూ క్యాటరింగ్‌ ‌నిర్వాహకులు ధరలను పెంచేశారు. సమాజంలో హోదా కోసం కనీసం పాతిక రకాల వంటకాలతో విందు వడ్డించడం రివాజుగా మారడంతో ఇప్పుడు ప్లేటు ధర కనీసం రూ.500 దాటుతోంది. వీటన్నింటికీ మించి మధ్యతరగతి, పేద కుటుంబాలకు పెళ్లిలో అత్యంత కీలకమైన బంగారం కొనుగోలు భారంగా మారింది. సంప్రదాయం ప్రకారం మంగళసూత్రాలు, గొలుసు, కమ్మలు, గాజులు వంటి కనీస అవసరాల కోసమే 5-6 తులాలు కొనాల్సి వస్తుంది. ఏడాది క్రితంతో పోలిస్తే పసిడి ధరలు విపరీతంగా పెరగడం వల్ల, కేవలం బంగారం కొనుగోలుకే ఇప్పుడు రూ.7-8 లక్షలు అవుతోంది. ఇక బంగారం ఖర్చు కాకుండా? మండపం అద్దె, డెకరేషన్‌, ‌విందు భోజనాలు, ప్రయాణాలకే అదనంగా మరో రూ.5 నుంచి 10 లక్షలు ఖర్చవుతోంది. అంతర్జాతీయ పరిస్థితుల ముందటి కాలంతో పోలిస్తే, ప్రస్తుతం ఒక్కో పెళ్లికి సగటున రూ.5 లక్షల వరకు అదనపు భారం పడుతోంది. మొత్తానికి, పెళ్లి బాజాలు మోగుతున్నా ఖర్చుల మోత చూసి వధూవరుల తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *