– హైకోర్టు తీర్పుతో రిజర్వేషన్ హక్కులకు ఇబ్బంది
– బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీ ప్రసాద్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 26: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ ప్రశాంత్ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణ ప్రాంత స్థానిక రిజర్వేషన్ హక్కులను కాలరాసేదిగా ఉందని బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవిప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర చారిత్రక నేపథ్యం, ప్రాంతీయ హక్కుల కోసం జరిగిన సుదీర్ఘ పోరాటాలు, ప్రజల ఆకాంక్షలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లడంలో, సరైన వాదనలు వినిపించడంలో లోపం జరిగిందన్నారు. 2018లో సవరించిన రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ప్రాథమిక విద్య అభ్యసించిన ఏడేళ్లలో కనీసం నాలుగు సంవత్సరాలు తెలంగాణలో చదివిన వారికే స్థానిక రిజర్వేషన్ల అర్హత ఉంటుందని స్పష్టంగా పేర్కొన్నారని గుర్తు చేశారు. అయితే ప్రాథమిక విద్య స్థానికంగా లేకున్నా ఉన్నత విద్యలో నాలుగేళ్లు పూర్తి చేస్తే స్థానిక అర్హత లభిస్తుందన్న హైకోర్టు తీర్పు రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ఉందని అభిప్రాయపడ్డారు. దీనిపై ప్రభుత్వం తక్షణం సమీక్ష జరిపి సుప్రీంకోర్టును ఆశ్రయించాలని డిమాండ్ చేశారు. స్థానిక రిజర్వేషన్ కోటా అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. దేశంలోనే 95 శాతం స్థానికులకు రిజర్వేషన్ కల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, కేసీఆర్ పాలనలో జరిగిన తీవ్ర కృషితో సాధించిన స్థానిక హక్కులను కాలరాసే ప్రయత్నం జరిగితే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని ఆరోపించారు. ముప్పై నెలలు గడిచినా పీఆర్సీ అమలు కాలేదని, ఆరు విడతల కరవు భత్యం డీఏ) పెండింగ్‌లో ఉందని, సీపీఎస్ రద్దుపై ఎలాంటి ముందడుగు లేదని అన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు విడుదల కాలేదని, హెల్త్ కార్డులపై స్పష్టమైన విధివిధానాలు లేవని తెలిపారు. ఉద్యోగులు ప్రమాదంలో మరణిస్తే రూ.కోటి బీమా అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇప్పటికే బ్యాంకులు అమలు చేస్తున్న పథకానికే కొంత పెంపుతో తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా బీమా వర్తింపజేయాలని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అయితే ప్రతి నెలా 1వ తేదీన వేతనాలు అందక లక్షలాది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొందరికి రెండు నెలలుగా, మరికొందరికి 14 నెలలుగా కూడా వేతనాలు అందని పరిస్థితి నెలకొందని అన్నారు. వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించి, ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం నాన్చివేత ధోరణి విడిచిపెట్టి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో భుజంగరావు, సుమిత్ర ఆనంద్, ఉపేందర్ పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





