తెలంగాణలో అధికారమే బీజేపీ లక్ష్యం

– 28నుంచి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాష్ట్ర పర్యటన
– తుంగభద్ర జలాలపై ప్రజలకు సీఎం సమాధానం చెప్పాలి
– రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 26 : క్షేత్రస్థాయి నుంచి బీజేపీని మరింత బలోపేతం చేసి రాబోయే రోజుల్లో పార్టీ అధికారం దిశగా నడిపించడమే లక్ష్యంగా జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో రాజ్య‌స‌భ స‌భ్యుడు డాక్ట‌ర్ ల‌క్ష్మ‌ణ్‌తో క‌లిసి శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఈనెల 28నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించనున్నారని వెల్లడించారు. నితిన్ పర్యటన కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని, పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని రెట్టింపు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 28న  నితిన్ శంషాబాద్ చేరుకుని అక్కడి రంగారెడ్డి జిల్లా కార్యాలయం నుండి పది జిల్లాల పార్టీ నూతన కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభిస్తారని తెలిపారు. సాయంత్రం హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జీహెచ్‌ఎంసీ పరిధిలోని బూత్ అధ్యక్షుల భారీ సమావేశంలో పాల్గొంటారని, అనంతరం రాష్ట్ర కార్యాలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశమవుతారని వివరించారు. రెండో రోజు ఉదయం వీబీఐటీ ఇంజనీరింగ్ కాలేజీ క్యాంపస్‌లో విద్యార్థులతో నిర్వహించే ప్రత్యేక కాన్‌క్లేవ్‌లో పాల్గొంటారు. అనంతరం వరంగల్‌లో లంబాడ, కోయ, చెంచు, గోండు వంటి వివిధ ఆదివాసీ, గిరిజన తెగల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన తర్వాత, ఉమ్మడి వరంగల్ జిల్లా బూత్ ప్రెసిడెంట్స్ సమావేశంలో పాల్గొంటారని వివరించారు. మూడవ రోజు ఘట్‌కేసర్‌లో జరిగే రాష్ట్ర కార్యవర్గ (స్టేట్ వర్కింగ్ కమిటీ), ఆఫీస్ బేరర్స్ సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేస్తారని, మధ్యాహ్నం దిల్లీకి తిరుగు పయనమవుతారని చెప్పారు.

తుంగభద్ర నీటి వాటాలపై నిజాలు వెల్లడించాలి

తుంగభద్ర నది గేట్ల మరమ్మతుల వ్యవహారాన్ని బీజేపీ స్వాగతిస్తోందని, అయితే నీటి వాటాల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని రామచందర్‌రావు డిమాండ్ చేశారు. కర్ణాటక ప్రతిపాదించిన నవేలి రిజర్వాయర్, ఏపీలోని గుండ్రేవుల ప్రాజెక్ట్టు వల్ల తెలంగాణకు రావాల్సిన 15.9 టీఎంసీల నీటి వాటా దెబ్బతిని 5 టీఎంసీలు మాత్రమే వచ్చే ప్రమాదం కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్.పాటిల్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతర్గతంగా ఏం మాట్లాడారో, రాష్ట్ర ప్రయోజనాలపై ఎలాంటి హామీలు తెచ్చారో ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. గతంలో కృష్ణా, గోదావరి బేసిన్లలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డుల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ తీవ్ర అన్యాయం చేశాయని ఆరోపించారు.

కాంగ్రెస్, ఎంఐఎంలవి నాటకాలు

ఎన్‌ఆర్‌సీ, పౌరసత్వ సవరణ చట్టం అంశాలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం నాటకాలు ఆడుతున్నాయని రామచందర్‌రావు మండిపడ్డారు. 2013 బాంబే హైకోర్టు తీర్పు ప్రకారం పాస్‌పోర్టు అనేది లం ఒక ప్రయాణ పత్రం మాత్రమేనని, అది పౌరసత్వానికి రుజువు కాదని స్పష్టం చేశారు. ఎలక్షన్ కమిషన్ ఓటరు నమోదు ప్రక్రియలో ఆధారాల కోసం నిర్దేశించిన 12 రకాల పత్రాలలో పాస్‌పోర్టు కూడా ఒకటి మాత్రమేనన్నారు. బారిస్టర్ అయిన ఒవైసీ ప్రజలను తప్పుదారి పట్టించడం తగదని హితవు పలికారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం భారత పౌరులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుందని, రోహింగ్యాలు, బంగ్లాదేశ్ అక్రమ వలసదారులకు ఓటు హక్కు కల్పించడం చట్టవిరుద్ధమని అన్నారు. తప్పుడు ప్రచారాలతో ప్రజల్లో అనవసర భయభ్రాంతులు సృష్టించవద్దని కాంగ్రెస్, ఎంఐఎంలను ఆయన హెచ్చరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *