– సమ్మెపై జేఏసీతో మంత్రుల చర్చలు
– ఆర్టీసీని బలోపతేం చేద్దామన్న డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: ఆర్టీసీ సమ్మెపై చర్చలు కొలిక్కి వొచ్చినట్లేనని భావిస్తున్నారు. ప్రభుత్వం కూడా కార్మికుల పట్ల సానుకూలతతో ఉన్నట్లు సమాచారం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలో ఆర్టీసీ జేఏసీ నేతలతో మంత్రుల బృందం భేటీ కొనసాగుతోంది. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి చాలా బాధాకరమని పేర్కొన్నారు. ఇలాంటి విషాదకర ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. ఆర్టీసీని మనం బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఆర్టీసీ చిన్నాభిన్నమైందని, అప్పటి పాలకులు ఎంత కఠినంగా వ్యవహరించారో మీకందరికీ తెలుసుని అన్నారు. గత పాలకుల మాదిరిగా తాము వ్యవహరించబోమన్నారు. ఆర్టీసీకి సంబంధించిన పాలన, విధానపరమైన నిర్ణయాలపై చర్చిద్దామని, కార్మికుల సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరించుకుందామని భట్టి అన్నారు. మొత్తం 32 డిమాండ్లను జేఏసీ నేతలు మంత్రుల ముందు ఉంచారు. ఇప్పటికే 29 డిమాండ్లపై సానుకూలంగా ఉన్నామని మంత్రి పొన్నం ప్రకటించిన నేపథ్యంలో మూడు కీలక డిమాండ్లపై మంత్రులు, జేఏసీ నేతలు చర్చిస్తున్నారు. ప్రభుత్వంలో విలీనం, కార్మిక సంఘాలకు గుర్తింపు, పీఆర్‌సీపై చర్చలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ బోర్డు పరిధిలోని సమస్యలను యాజమాన్యం, ఉద్యోగులు పరిష్కరించుకోవాలని, ప్రభుత్వ పరిధిలోని అంశాలను పరిష్కరిస్తామని మంత్రులు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




