– కనీస వేతనాల అమలుకు నిర్ణయం
– కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలకు ఆమోదం
– లబ్దిపొందనున్న 1.11 కోట్ల మంది కార్మికులు
– బండి తనయుడు భగీరథ్‌ను పోలీసులే అరెస్టు చేశారు
– ఇంకా ప్రభుత్వంలోనే ఉన్నామన్న భ్రమలో కేటీఆర్
– మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 21: కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభ వార్త చెప్పారు. కనీస వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక విషయాలను వెల్లడించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో 1.11 కోట్ల మంది కార్మికులు నష్టపోయారని, వారికి ప్రయోజనం కలిగించేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీని నియమించామని చెప్పారు. సబ్ కమిటీ నివేదించిన అంశాలపై చర్చించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నదని పేర్కొన్నారు. కార్మికులకు ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు. కార్మికులను నాలుగు కేటగిరీలుగా తీసుకున్నాం.. అన్‌స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్‌గా విభజించాం. వర్క్ జోన్లను మూడు భాగాలుగా విభజించాం. జోన్-1లో మున్సిపల్ కార్పొరేషన్స్, జోన్-2లో మున్సిపాలిటీలు, జోన్-3లో గ్రామీణ ప్రాంతాలను తీసుకుని కనీస వేతనం నిర్ణయించామని సీఎం వివరించారు. అన్‌స్కిల్డ్ కేటగిరీలో కనీస వేతనాన్ని రూ.12,750 నుంచి రూ.16 వేలకు, సెమి స్కిల్డ్ కేటగిరీలో రూ.13,152 నుంచి రూ.17 వేలకు, స్కిల్డ్ కేటగిరీలో రూ.13,772 నుంచి రూ.18,500కు, హైలీ స్కిల్డ్ కేటగిరీలో రూ.14,607 నుంచి రూ.20 వేలకు పెంచామన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జూన్ 1 నుంచి అమలవుతుందన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొదటిసారిగా కార్మికుల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయం ఇది అని పేర్కొన్నారు. గత ప్రభుత్వం తన బాధ్యతను వదిలేసిందని, తమ ప్రభుత్వం బాధ్యతతో వారి ప్రయోజనం కోసం నిర్ణయం తీసుకుందని తెలిపారు. కార్మిక నాయకుడంటే వెంకటస్వామి గుర్తొస్తారని, ఆయన వారసుడిగా మంత్రి వివేక్ వెంకటస్వామి కార్మికుల సంక్షేమం కోసం మంచి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఐటీ, అమెరికా అనే ఆలోచనను వీడండి.. ఉద్యోగాలు రాని, ఉపాధి అవకాశాలు లేని చదువులు వ్యర్థం.. సాంకేతిక నైపుణ్యంతో జర్మనీ, జపాన్, సింగపూర్ వంటి ఇతర దేశాల్లో అనేక అవకాశాలు ఉన్నాయి.. అందుకే రాష్ట్ర ప్రభుత్వం స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి యువతను ప్రోత్సహిస్తోంది.. ఆ దిశగా దృష్టి సారించాలి అని యువతకు సూచించారు.
సంక్షోభాన్ని రాజకీయ కోణంలో చూస్తున్న మోదీ
ప్రజా సమస్యలను, దేశాల మధ్య యుద్దాన్ని బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజకీయ కోణంలో చూస్తోంది. అందుకే ఎన్నికలు అయిపోగానే పెట్రోల్, డీజిల్ ధరలను రోజుకోసారి పెంచుతున్నారు అని సీఎం రేవంత్ విమర్శించారు. తమ ప్రభుత్వం ప్రతి అంశాన్నీ దీర్ఘకాలిక దృష్టితో చూస్తున్నది. అందుకే కార్మికుల కనీస వేతనం పెంపుపై నిర్ణయం తీసుకున్నదని చెప్పారు.
80 శాతం పూర్తయిన ధాన్యం కొనుగోళ్లు
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు పక్రియ 80 శాతం పూర్తయింది.. మిగిలిన 20 శాతం పక్రియ కూడా త్వరలోనే పూర్తి చేస్తాం అని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పారు. బీఆరఎస్ నేతలు మానవత్వం మరిచిపోయి వ్యవహరిస్తున్నారని, రైతుల విషయంలో శవ రాజకీయాలు చేయాలని చూస్తున్నారని అంటూ రాజకీయాల కోసం మరీ ఇంత దిగజారి వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. నిజంగా రైతులపై ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు.
భగీరథ్‌ను పోలీసులే అరెస్టు చేశారు
పోక్సో కేసులో బండి భగీరథ్‌ను పోలీసులే అరెస్టు చేశారని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తన కుమారుడిని అప్పగించి ఉంటే తమ ఇంట్లోనే అప్పగించి ఉండేవారన్నారు. పోక్సో కేసులో ఏదో సాధించినట్లు బీఆరఎస్ నేతలు వ్యవహరిస్తున్నారంటూ రాజకీయాలు చేయాలనుకుంటే ఎన్నికల్లో ఓడించాలి.. అంతేకాని దిగజారి ప్రవర్తించొద్దు అని హితవు పలికారు. కేటీఆర్ బావమరిది ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ దొరికినా నోటీసు ఇచ్చి విచారించాం. బండి భగీరథ్ విషయంలోనూ నోటీసులు ఇచ్చి విచారణ చేస్తున్నాం. పోక్సో కేసులో పోలీసులు ప్రొసీజర్ ప్రకారమే వ్యవహరిస్తున్నారు. కేటీఆర్ ఇంకా కల్వకుంట రాజ్యాంగంలోనే ఉన్నానని అనుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ దిగిపోయి చాలా రోజులు అయింది. పార్టీ సభ కోసం జగిత్యాలకు వెళ్లిన కేసీఆర్ రాష్ట్రంలో ఇంత పెద్ద సంఘటన జరిగితే ఎందుకు బయటకు రాలేదు అని రేవంత్ నిలదీశారు. కులగణన విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. తెలంగాణ నిర్ణయాన్ని ఉన్నత న్యాయస్థానం సమర్థించడం తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామన్నారు. తెలంగాణలో జనగణనతోపాటు కులగణన చేసి అన్ని వివరాలు ప్రజల ముందుంచామని గుర్తు చేశారు. జనగణనలో కులగణన విషయంలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలిచిందని, మోదీ ప్రభుత్వం తక్షణమే జనగణనలో కులగణన చేర్చి బలహీనవర్గాలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పించాలి అని కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





