29 డిమాండ్లు పరిష్కరించడానికి సిద్ధం

– మూడింటిపై చర్చిస్తున్నాం
– గ్రామీణ పేదలకు లైఫ్ లైన్ ఆర్టీసీ
– ప్రజలకు ఇబ్బందులు కలిగించొద్దు
– సమ్మెను విరమించండి
– ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం వినతి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : పేద ప్రజల లైఫ్ లైన్ ఆర్టీసీ అని, సంస్థను నిర్వీర్యం చేసే కుట్రలు చేయద్దని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కార్మిక నాయకులను కోరారు. పేదల రవాణా వ్యవస్థ బాగుండాలి.. అందులో పనిచేస్తున్న 40 వేల మంది ఉద్యోగుల కుటుంబాలు బాగుండాలి అని అన్నారు. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన 32 అంశాల్లో 29 అంశాలకు పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, మిగిలిన మూడింటిపై చర్చిస్తున్నామని ప్రభాకర్ తెలిపారు. తాము అధికారంలోకి రాగానే మొట్ట మొదటగా సీనియర్ ఐఏఏస్‌లతో కమిటీ వేశామని, అధికారుల కమిటీతో చర్చిస్తుండగానే సమ్మెకు పోతున్నామని కార్మిక నాయకులు మధŠ్యలో వెళ్లిపోవడం కుట్రలో భాగమేనని అన్నారు. ఇటీవల జగిత్యాల సభలో మహాలక్ష్మి ప్రయాణాన్ని కేసీఆర్ అవహేళనగా మాట్లాడారని, వెంటనే ఆర్టీసీపై కుట్రలో భాగంగానే గతంలో యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా ఉన్న హరీష్‌రావు సమ్మెకు కార్మికులను ప్రోత్సహించారని ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేరు.. ఆర్టీసీ డిమాండ్స్‌పై చర్చిస్తున్నామని అధికారులు చెప్పారు.. అయినా వినకుండానే ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడి సమ్మెకి వెళ్ళారని తెలిపారు. 2017 పీఆర్సీ ఇచ్చాం.. 2013 బాండ్స్ రూ.280 కోట్లు ఇచ్చాం.. 1134మందికి కారుణ్య నియామకాలు ఇచ్చాం.. పని భారం లేకుండా కార్మిక చట్టాల లోపలే చేశాం.. గతంలో 12 గంటలు వాహనం నడపడం వల్ల మరునాడు ఆఫ్ ఉండేది.. వాళ్ళు ఎలా అంటే అలా చేయడానికి సిద్ధంగా ఉన్నాం.. పని భారం లేకుండా చేయాలని చూస్తున్నాం.. తాము శ్రమ దోపిడీ చేయదలచుకోలేదు.. విలీనం, యూనియన్‌ల అంశాలపై ప్రభుత్వం పరిశీలిస్తోంది.. ప్రభుత్వం నెలకు ఆర్టీసీకి రూ.300 కోట్లు, అవసరమైనప్పుడు రూ.400 కోట్లు ఎంత అవసరం ఉంటే అంత ఇస్తున్నది.. సర్వీసు నుండి తొలగింపునకు గురైన 250 మందికిపైగా ఉద్యోగాలు ఇస్తున్నాం అని వివరించారు. మూడు సంవత్సరాల పీరియడ్‌ను రెండేళ్లకు తగ్గించాం అన్నారు. నిరసనలు చెప్పే వారు బస్ డిపోల్లో చేసుకోండి.. ప్రజలను ఇబ్బంది పెట్టవద్దు అని మంత్రి విజ్ఞప్తి చేశారు.

తాము వచ్చాక మొదటగా కమిటీ వేశాం.. కమిటీకి నాలుగు వారాల సమయం అడిగాం.. ప్రభుత్వంతో కూర్చుని మాట్లాడాల్సిన అంశాలపై నాయకత్వం వహించిన వారు రిటైర్ అయిన వారు, ఉద్యోగాలు చేయని వారు ఉన్నారని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం ఆర్టీసీ నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరించిందంటూ ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఎండీకి, ప్రిన్సిపల్ సెక్రటరీకి తెలియకుండా ఆదరాబాదరాగా విలీనం అంశాన్ని తెచ్చారని వెల్లడించారు. ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరకు రండి కూర్చుని మాట్లాడదాం అని సూచించారు. మహాలక్ష్మి పథకం వచ్చినందున మీరు ఆర్టీసీపై కుట్రలు చేస్తున్నారంటూ రాజకీయ వ్యూహంగా దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగులకు నాయకత్వం వహిస్తున్న వారు సంస్థ పరిరక్షణ దృష్ట్యా, పేదల ప్రయోజనం దృష్ట్యా సమ్మె విరమించాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. అధికారులు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పోతున్నారని ఊహించలేదు.. డిప్యూటీ సీఎం చెన్నైలో ఉండడం వల్ల మాట్లాడలేకపోయాం… డిపో వారీగా సమీక్ష చేసి పని ఒత్తిడి ఉన్నచోట తగ్గించేందుకు సిద్ధం అన్నారు. తాము కిందిస్థాయి నుండి వచ్చాం.. ఆర్టీసీ కుటుంబాలతో 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో అనేకసార్లు ఇంటరాక్ట్ అయ్యాం.. ఉద్యోగస్థులు అక్కా చెల్లెలు.. అన్నదమ్ములు.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా వ్యవహరించాలని కోరారు. తాము వచ్చిన తర్వాత 2800 బస్సులు కొనుగోలు చేశామని చెప్పారు. 29 అంశాలపై వెంటనే తాము టేబుల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం.. ఇప్పటికిప్పుడు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం.. ఆర్థికపరమైన అంశాలను కూడా ప్రభుత్వం భారం మోయడానికి సిద్ధంగా ఉంది.. విలీనం, సంఘాల ఏర్పాటు, పీఆర్సీ కూడా ప్రభుత్వం పరిష్కరిస్తుంది.. మూడు సాంకేతిక అంశాలపై కమిటి నివేదిక అందిస్తుంది.. అధికారుల సంప్రదింపులు కొనసాగుతుండగానే కమిటీలోని వికాస్‌రాజ్, దాన కిషోర్, సందీప్ కుమార్ సుల్తానియా మీ అంశాలపై సానుకూల దృక్పథంతో ఉండే. ఒకటో తారీఖు జీతాలు ఇస్తున్నాం.. పెండింగ్ బకాయిలు చెల్లిస్తున్నాం అని చెప్పారు. సమ్మె దృష్ట్యా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామని, హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్, మెట్రో సర్వీసులు ఫ్రీక్వెన్సీ పెంచాలని కోరామని చెప్పారు. ఈవీ బస్సులు 2018లో మొదలయ్యాయని, అది కేంద్ర ప్రభుత్వ పథకం అని, ఈవీ బస్సుల కారణంగా ఒక్క ఉద్యోగినీ తొలగించబోమని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 14 వేల బస్సులు ఇస్తుండగా తెలంగాణకు రెండు వేల బస్సులు ఇస్తున్నారు.. కాలుష్యాన్ని తగ్గించడానికి వాటిని తీసుకొస్తున్నారు.. ఆర్టీసీ అనేక సంస్కరణలు తీసుకొస్తుంది.. బేషరతుగా సమ్మె విరమించండి.. మీ సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం అని మరోసారి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం యూనియన్‌లను రద్దు చేసినప్పుడు ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, హరీష్ రావులు ఆర్టీసీ సమ్మెతో రాక్షసానందం పొందుతున్నారని వ్యాఖ్యానించారు. రవాణా శాఖ మంత్రిగా ఆర్టీసీ ఉద్యోగులను కోరుతున్నా.. మీ నిరసన ప్రజాస్వామికంగా ప్రభుత్వం గుర్తించే విధంగా ఉండాలన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *