– నాకు తెలియకుండా ఎలా సమీక్షలు చేపడతారు
– మంత్రిగా తన శాఖలో జోక్యం చేసుకోవడం ఏమటి
– సీఎం రేవంత్‌కు మంత్రి సురేఖ లేఖ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 7:స్టేషన్ ఘన్‌పూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీరుపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న నన్ను, నా కార్యాలయాన్ని పూర్తిగా విస్మరించి, ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కడియం శ్రీహరి కమిషనర్ ఆఫీస్‌లో అధికారిక సమీక్షా సమావేశం నిర్వహించారని ఫిర్యాదు చేశారు. మాస్టర్ ప్లాన్లు, శాఖాపరమైన నివేదికలపై ఆదేశాలు జారీ చేయడం మంత్రి పరిధిలోని అంశమని, ఒక ఎమ్మెల్యే దేవాదాయ శాఖ అధికారులను పిలిచి ఎలా ఆదేశిస్తారని సురేఖ ప్రశ్నించారు. కడియం శ్రీహరి చర్య ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థలో అనుచిత సంప్రదాయానికి నాంది అని, ఇది కేవలం పరిపాలనా లోపం మాత్రమే కాదని, ఒక శాఖ మంత్రి అధికారాలను బహిరంగంగా ప్రశ్నించే కుట్ర అని ఆమె మండిపడ్డారు. గతంలోనూ ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలను రెచ్చగొట్టి తనపై శ్రీహరి దుష్ప్రచారం చేశారని సురేఖ ఆరోపించారు. ఇప్పుడు కూడా ఉద్దేశపూర్వకంగానే తనను నిర్లక్ష్యం చేస్తూ ఆయన తీసుకుంటున్న చర్యల వల్ల శాఖ అధికార యంత్రాంగంలో తీవ్ర అయోమయం నెలకొందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ప్రజాప్రతినిధిగా ఉంటూ ప్రభుత్వ నిబంధనలను, మంత్రి అధికారాలను అతిక్రమించిన కడియంపై పార్టీ క్రమశిక్షణా కమిటీ ద్వారా విచారణ జరిపించాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని సురేఖ కోరారు. మంత్రిగా తనకు సమాచారం ఇవ్వకుండా దేవాదాయ శాఖపరమైన సమీక్ష నిర్వహించారని, ఆయన సమీక్షించడం పరిపాలనా వ్యవస్థకు విరుద్ధమని పేర్కొన్నారు. శాఖ మంత్రిగా అన్ని అధికారాలు తనకే ఉంటాయాన్న సురేఖ.. కడియం వ్యవహారంపై పార్టీ, ప్రభుత్వ స్థాయిలో విచారణ చేపట్టాలని కోరారు. సమస్య ఉంటే మంత్రి, అధికారులకు వినతిపత్రం ఇవ్వాలి కానీ సమీక్ష నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.