పత్తి రైతులకు ధరల భరోసా కల్పించాలి

– స్పిన్నింగ్, ప్రాసెసింగ్ పరిశ్రమల విస్తరణకు చర్యలు చేపట్టాలి
– అధికారులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల దిశానిర్దేశం
– మార్కెట్లలో ధరల వ్యత్యాసంపై సమీక్ష

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 22 : రాష్ట్రంలో 2026-27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి పత్తి కొనుగోలు కేంద్రాలను గత ఏడాది మాదిరిగానే ప్రారంభించి రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్ శాఖ అధికారులతో సచివాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో రాష్ట్రంలో పత్తి సాగు, ఉత్పత్తి అంచనాలు, మార్కెట్ ధరలు, సీసీఐ కొనుగోళ్లకు చేసిన ఏర్పాట్లు, రైతులకు అందిస్తున్న సౌకర్యాలపై ఆయన సమీక్షించారు. పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, కొనుగోళ్లలో జాప్యం లేకుండా చూడటం, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవడం ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ప్రస్తుత 2026-27 ఖరీఫ్‌లో రాష్ట్రవ్యాప్తంగా 48.20 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరగగా 29.43 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా వేస్తున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. గత సీజన్‌లో 50.73 లక్షల ఎకరాల్లో సాగు జరగగా 28.33 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి నమోదైంది. దేశవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం సహా ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఉత్పత్తి తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో కొనుగోళ్ల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని మంత్రి సూచించారు.

కనీస మద్దతు ధర రూ.8,667తో రైతులకు ధరల భరోసా

కేంద్రం 2026-27 పత్తి కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.8,667గా ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో పత్తి మోడల్ మార్కెట్ ధర సుమారు రూ.9,000గా ఉందని అధికారులు వివరించారు. ఇది కనీస మద్దతు ధర కంటే రూ.333 అధికం. మార్కెట్ ధరలు కనీస మద్దతు ధర కంటే ఎక్కువగా ఉన్నప్పుడు రైతులు బహిరంగ మార్కెట్లో విక్రయించుకోవచ్చని, ధరలు తగ్గి కనీస మద్దతు ధర కంటే దిగువకు వచ్చినప్పుడు సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవచ్చని మంత్రి తెలిపారు. రైతులు నష్టపోకుండా ఉండేందుకు సీసీఐ, మార్కెటింగ్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

335 జిన్నింగ్ మిల్లులు కొనుగోలు కేంద్రాలుగా నోటిఫై

పత్తి కొనుగోళ్ల కోసం సీసీఐ గత సీజన్‌లో ఉన్న 122 కొనుగోలు కేంద్రాల సంఖ్యను 133కు పెంచింది. రాష్ట్రంలో రోజుకు 1,09,035 బేళ్ల సామర్థ్యంతో 356 జిన్నింగ్ మిల్లులు ఉండగా ఇప్పటివరకు 30 జిల్లాల్లో 335 జిన్నింగ్ మిల్లులను కొనుగోలు కేంద్రాలుగా నోటిఫై చేసినట్లు అధికారులు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, నాణ్యత పరీక్షలు, జిన్నింగ్, బేళ్ల తయారీ, గోదాములకు రవాణా, రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఈనెల 1న ప్రభుత్వం జారీ చేసిన జీవోల ద్వారా రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీలు మార్కెట్ ధరలు, కొనుగోళ్ల పురోగతి, కొనుగోలు కేంద్రాల్లో సమస్యలను నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి సూచించారు. ఇతర ప్రధాన పత్తి మార్కెట్లతో పోలిస్తే రాష్ట్రంలో కొన్ని మార్కెట్లలో ధరలు తక్కువగా ఉండటానికి గల కారణాలను మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో పత్తి గింజల ప్రాసెసింగ్ యూనిట్లు, స్పిన్నింగ్ పరిశ్రమల సంఖ్య, సామర్థ్యం తక్కువగా ఉండటం కూడా ధరలపై ప్రభావం చూపుతోందని అధికారులు వివరించారు. ఇతర రాష్ట్రాల్లో పరిశ్రమలకు అందిస్తున్న ప్రోత్సాహకాలు, రాయితీలు, సౌకర్యాల వివరాలను సేకరించి రాష్ట్రంలో పత్తి ప్రాసెసింగ్, స్పిన్నింగ్, ఆయిల్ పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన అవకాశాలను పరిశీలించాలని, పత్తి ఆధారిత పరిశ్రమల విస్తరణకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.

కపాస్ కిసాన్ యాప్‌తో రైతులకు సౌలభ్యం

పత్తి కొనుగోళ్లలో పారదర్శకత పెంచేందుకు కపాస్ కిసాన్ యాప్, ఆన్‌లైన్ చెల్లింపులు, రైతుల వివరాల ధ్రువీకరణ వంటి డిజిటల్ విధానాలను అమలు చేస్తున్నారు. ఈనెల 21 నాటికి 12,75,185మంది రైతులకు సంబంధించిన 21,58,938 వివరాలను ఈ యాప్‌తో అనుసంధానం చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లాకు నిర్ణయించిన సగటు దిగుబడి కంటే ఎక్కువ దిగుబడి ఉన్న రైతులు అదనపు దిగుబడి ధ్రువీకరణ కోసం సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలి. కౌలు రైతులు తమ పేర్ల నమోదు కోసం సంబంధిsచి ఏఈవోను సంప్రదించి అవసరమైన భూమి, ఆధార్, మొబైల్ వివరాలను అందించాలని అధికారులు సూచించారు. భూ యజమాని ధ్రువీకరణ అనంతరం నమోదు ప్రక్రియ పూర్తవుతుంది.

టోల్‌ఫ్రీ, వాట్సాప్ సేవలు అందుబాటులోకి

పత్తి రైతులకు సమాచారం, సహాయం అందించేందుకు మార్కెటింగ్ శాఖ 1800-599-5779 టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే 8897281111 వాట్సాప్ నంబర్ ద్వారా పత్తి కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను తెలుసుకునే సౌకర్యం కల్పించింది. ఈ సేవల ద్వారా రైతులు సీసీఐ ద్వారా ఎంత పత్తి విక్రయించవచ్చో, విక్రయించిన పంట విలువ, చెల్లింపుల స్థితి, కొనుగోలు కేంద్రాల్లో వేచి ఉండే సమయం తదితర వివరాలను తెలుసుకోవచ్చు. అన్ని మార్కెట్ యార్డుల్లో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రాల్లో ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. రైతులు పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే ముందు తేమ శాతాన్ని పరీక్షించుకునేందుకు రాష్ట్రంలోని రైతు వేదికల వద్ద మాయిశ్చర్ మీటర్లను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *