– కేంద్ర హోం మంత్రి అమిత్ షా
– నక్సల్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దిన పోలీస్ అధికారులకు సన్మానం
జగదల్‌పూర్(ఛత్తీస్‌గఢ్), మే 18 : దేశాన్ని పట్టిపీడిస్తున్న వామపక్ష తీవ్రవాదానికి ముగింపు పలికి నక్సలిజం రహిత సమాజాన్ని నిర్మించడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో మావోయిస్టుల నిర్మూలనకు కృషి చేసిన పోలీసు అధికారులను ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్‌లో సోమవారం ఆయన సన్మానించారు. తెలంగాణలో నక్సలిజాన్ని సమూలంగా అణచివేసి రాష్ట్రాన్ని నక్సల్స్ రహితంగా తీర్చిదిద్దడంలో ప్రతిభ చూపిన రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను సన్మానించారు. డీజీపీ సి.వి.ఆనంద్, రాష్ట్ర భద్రతా సలహాదారు, మాజీ డీజీపీ బి.శివధర్ రెడ్డి, డీజీపీ ఆపరేషన్స్ (ఆక్టోపస్ అండ్ గ్రేహౌండ్స్) అనిల్ కుమార్, మల్కాజ్‌గిరి కమిషనర్ అండ్ మాజీ ఎస్‌ఐబీ ఐజీపీ సుమతితోపాటు ఆమె నేతృత్వంలోని ఎస్‌ఐబీ బృందాన్ని అమిత్ షా సత్కరించి, వారి విశేష సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 2024లో ఒక అంతర్గత సమావేశంలో 31 మార్చి 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలని తాము కాలపరిమితిని నిర్దేశించుకున్నట్లు వెల్లడించారు. ‘మేం ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు చాలామంది ప్రైవేట్ చర్చల్లో ఇది సాధ్యం కాదంటూ సందేహాలు వ్యక్తం చేశారు.. కానీ మేం స్పష్టమైన ప్రణాళికతో, పక్కా వ్యూహంతో ముందుకు సాగాం.. మా దంతేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో ఈ రోజు బస్తర్ ప్రాంతాన్ని నక్సల్స్ రహితంగా ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్ ఇప్పుడు నక్సలిజం మహమ్మారి నుంచి విముక్తి పొందిందని, వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా సాగిన సుదీర్ఘ పోరాటంలో ఇదొక చరిత్రాత్మక మైలురాయి అని పేర్కొన్నారు. 1970వ దశకం నుంచి 31 మార్చి 2026 వరకు దాదాపు మూడు తరాలపాటు దేశ ప్రజలు నక్సలిజం అనే ఒక పీడకలను చవిచూశారని అమిత్ షా ఆవేదన వ్యక్తం చేశారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో తీవ్ర రక్తపాతం, అభివృద్ధి నిలిచిపోవడం, యువత భవిష్యత్తు అంధకారమవడం వంటి పరిస్థితులు ఉండేవని గుర్తుచేశారు. నక్సలిజం నిర్మూలన పోరాటంలో దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలకు చెందిన జవానులు ప్రాణత్యాగం చేశారని, వారి బలిదానాల వల్లే నేడు ఈ విజయం సాధ్యమైందని హోం మంత్రి అన్నారు. నక్సలిజం కేవలం ఒక ప్రాంతానికి పరిమితమైన సమస్య కాదని, తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌తోపాటు దేశవ్యాప్తంగా దీనిపై ఆందోళన ఉండేదని అన్నారు. ఒక జీవిత కాలంలో సాధించలేమనుకున్న అసాధ్యమైన లక్ష్యాన్ని భద్రతా దళాల సమన్వయం, పట్టుదలతో సాకారం చేశామని అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, భద్రతా దళాల ప్రతినిధులు పాల్గొన్నారు.
కొత్త సవాళ్లపై నిఘా విభాగాలు దృష్టిపెట్టాలి : డీజీపీ ఆనంద్
హైదరాబాద్ : నాలుగు దశాబ్దాలుగా తీవ్ర ప్రభావం చూపిన మావోయిజం ప్రస్తుతం ముగింపు దశలో ఉందని, మారిన పరిస్థితులకు అనుగుణంగా నిఘా విభాగాలు కొత్త సవాళ్లపై దృష్టి సారించాలని డీజీపీ సి.వి.ఆనంద్ అన్నారు. హైదరాబాదులోని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్‌ఐబీ) కార్యాలయాన్ని సోమవారం సందర్శించి రాష్ట్రంలో మావోయిస్టుల ప్రస్తుత పరిస్థితి, శాంతిభద్రతలకు ఎదురవుతున్న సవాళ్లు, తీవ్రవాద నిరోధక చర్యలపై ఉన్నతాధికారులు, సిబ్బందితో సుదీర్ఘంగా సమీక్షించారు. గత రెండేళ్లలో (2024 నుంచి 2026 మధ్య) తెలంగాణ పోలీసుల ఎదుట రికార్డు స్థాయిలో 820మంది మావోయిస్టులు లొంగిపోవడం ఎస్‌ఐబీ సాధించిన విజయమని అభినందించారు. లొంగిపోయిన వారిలో నలుగురు సెంట్రల్ కమిటీ సభ్యులు, 22 మంది స్టేట్ కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, 45మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 173మంది ఏరియా కమిటీ సభ్యుల వంటి అగ్రనేతలు ఉన్నట్లు వెల్లడించారు. హింసామార్గాన్ని వీడి ప్రధాన స్రవంతిలో కలిసిన ఈ కేడర్ నుంచి పెద్ద ఎత్తున అత్యాధునిక ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, ఇందులో 58 ఏకే-47 రైఫిళ్లు, 48 ఇన్సాస్ రైఫిళ్లు, 50 ఎసఎలఆర్‌లు, 6 ఎలఎమ్‌జీలతోపాటు మొత్తం 334 అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయని వివరించారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం అందిస్తున్న పునరావాస కార్యక్రమాలను డీజీపీ సమీక్షించారు. వారికి పోలీసు శాఖ నుంచి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు ఉంటాయని భరోసా ఇచ్చారు. లొంగిపోయిన కేడర్ కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, వారు సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు వీలుగా ఉపాధి శిక్షణ కార్యక్రమాలు, ఉద్యోగావకాశాలు కల్పించే బాధ్యతను ఎస్‌ఐబి తీసుకోవాలని, మారుతున్న సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. ఇప్పుడు ఎసఐబీ తన పరిధిని మరింత విస్తృతం చేసుకోవాలన్నారు. సమాజంలోని కొత్త పోకడలు, ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావం వల్ల యువతలో వస్తున్న మార్పులు, దానివల్ల తలెత్తే శాంతిభద్రతల సమస్యలపై నిశిత నిఘా పెట్టాలని ఆదేశించారు. భవిష్యత్తులో రాష్ట్ర భద్రతకు ఎదురయ్యే సవాళ్లను తిప్పికొట్టేలా రాష్ట్ర పోలీసు విభాగానికి ఎస్‌ఐబీ వెన్నుదన్నుగా నిలవాలని డీజీపీ ఆనంద్ దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో ఇంటెలిజెన్స్ అదనపు డీజీపీ విజయ్ కుమార్, ఎఐబి ఐజీపీ కార్తికేయ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




