విద్యార్థులను కలవండి.. చర్చించండి

– జార్ఖండ్ సీఎం సోరెన్‌కు రాహుల్ లేఖ

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఆగస్టు 17 : జార్ఖండ్‌లో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను స్వయంగా కలిసి వారి సమస్యలను వినాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను కోరారు. ఈ మేరకు 14వ తేదీన సోరెన్‌కు రాహుల్ గాంధీ లేఖ రాశారు. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జార్ఖండ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నిర్వహించిన నియామక పరీక్షల్లో అవకతవకలు, ప్రశ్నపత్రాల లీక్, నియామక పక్రియలో పారదర్శకత లోపించిందంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం విదితమే. రాంచీలో కొనసాగుతున్న ఈ నిరసనలు సోమవారం నాటికి 24వ రోజుకు చేరుకున్నాయి. విద్యార్థుల ఆందోళన ఇప్పటివరకు శాంతియుతంగానే సాగుతోందని, వారి డిమాండ్లు న్యాయమైనవని రాహుల్ గాంధీ తన లేఖలో పేర్కొన్నారు. కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా ప్రశ్నపత్రాల లీకులు, విద్యా వ్యవస్థలో అవకతవకలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది ‘జార్ఖండ్‌లోని పరిస్థితి మరింత తీవ్రతరం కాకుండా చూడటానికి ముఖ్యమంత్రి స్వయంగా విద్యార్థులను కలిసి వారి ఆందోళనలను వినాలి.. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలి’ అని రాహుల్ విజ్ఞప్తి చేశారు.

ఎన్‌టీఏ తప్పులకు విద్యార్థుల మూల్యం : మండిపడ్డ రాహుల్ 

యూజీసీ-నెట్ సోషియాలజీ, ఇంగ్లీష్, కామర్స్ పేపర్లను రద్దు చేసి సెప్టెంబర్‌లో మళ్లీ నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్ణయించడంపై రాహుల్ గాంధీ పైర్ అయ్యారు. ఎన్‌టీఏ తప్పులకు వేలాదిమంది విద్యార్థులు మూల్యం చెల్లించాల్సి వస్తోందని ‘ఎక్స’ వేదికగా విమర్శించారు. ’మోదీజీ ఎన్‌టీఏ ఏం చేసిందో చూడండి.. జూన్ 22 నుంచి 30 వరకు సోషియాలజీ, ఇంగ్లీష్, కామర్స్ పరీక్షలు జరిగాయి.. దాదాపు రెండు నెలల తర్వాత ప్రశ్నపత్రాల్లో లోపాలు, గత ప్రశ్నల పునరావృతం కారణంగా ఈ మూడు పరీక్షలను రద్దు చేసింది.. ఈ నిర్ణయం వల్ల ఏళ్లతరబడి పరీక్షకు సిద్ధమైన వేలాదిమంది అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవడం, ఫీజులు చెల్లించడం, దూర ప్రాంతాల్లోని పరీక్ష కేంద్రాలకు ప్రయాణం చేయాల్సి వస్తోంది.. తప్పు చేసింది ఎన్‌టీఏ.. శిక్ష అనుభవించేది మాత్రం విద్యార్థులా’ అని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షా వ్యవస్థ విద్యార్థులను దోపిడీ చేసే వ్యవస్థగా మారిందని ఆరోపించారు. దేశంలో సరైన పరీక్షా వ్యవస్థ లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను కోట, డెహ్రాడూన్, ప్రయాగ్‌రాజ్‌లలో ఇదే విషయాన్ని ప్రస్తావించానన్నారు. ’ఇది విద్యా వ్యవస్థ కాదు.. డబ్బు, కాలం, మానసిక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసాన్ని తీసుకుని చివరికి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని వ్యవస్థగా మారింది’ అని రాహుల్ గుప్పించారు. యూజీసీ-నెట్ ప్రశ్నపత్రాలు పరీక్షకు ముందే లీకయ్యాయా అని సందేహం వ్యక్తం చేశారు. ఈ ప్రశ్నకు ఎన్‌టీఏ ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారాయన. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మొదటి అడుగు మాత్రమేనన్న రాహుల్ ఎన్‌టీఏ అధికారులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ’సెప్టెంబర్‌లో మళ్లీ పరీక్ష రాయనున్న ప్రతి విద్యార్థికీì చెబుతున్నా.. మీరు సమస్య కాదు. పరీక్షను నిర్వహించలేని వ్యవస్థను ప్రధాని మోదీ ప్రభుత్వం నిర్మించింది.. ఆ వ్యవస్థ చేసిన తప్పులకు ఇప్పుడు విద్యార్థులనే బాధ్యులుగా చేస్తోంది.. విలువైన సంవత్సరాలు వృథా అవుతున్నాయి.. దీనిపై మోదీ సమాధానం చెప్పే వరకు తాము ప్రశ్నిస్తూనే ఉంటాం’ అని రాహుల్ గాంధీ అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *