గుడిసెలు లేని తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం

– రెండో విడత ఇండ్లలో గుడిసెవాసులకే ప్రాధాన్యం
– యుద్ధప్రాతిపదికన క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి అర్హుల ఎంపిక
– రూఫ్ రీప్లేస్‌మెంట్ పథకం కింద రూ.2 లక్షల వరకు ఆర్థిక సాయం
– రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17 : రాష్ట్రంలో ప్రతీ నిరుపేద కుటుంబం గుడిసెల్లో కాక సురక్షితమైన సొంత ఇంటిలో గౌరవప్రదంగా జీవించేలా చేయడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నామన్నారు. హౌసింగ్ శాఖ అధికారులతో బుధవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత అమలు, గుడిసెల గుర్తింపు, రూఫ్ రీప్లేస్‌మెంట్ పథకం, అసంపూర్తి గృహాల వివరాల సేకరణ తదితర అంశాలపై మంత్రి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. గుడిసెల్లో నివసిస్తున్న అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేసిన తర్వాతే ఇతర దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.

గుడిసెల గుర్తింపునకు ప్రత్యేక సర్వే

రాష్ట్రంలోని ప్రతి గ్రామం, వార్డు, మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గుడిసెలను యుద్ధప్రాతిపదికన గుర్తించేందుకు సమగ్ర సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 75 వేల మంది తాము గుడిసెల్లో నివసిస్తున్నామని దరఖాస్తు చేసుకున్నారని, ఆ దరఖాస్తులన్నింటినీ ప్రత్యక్షంగా పరిశీలించి నిజమైన అర్హులను గుర్తించాలని ఆదేశించారు. ఎంపీడీవో స్థాయిలో జాబితాలను సిద్ధం చేసి సంబంధిత ఇన్‌చార్జి మంత్రుల ఆమోదానికి పంపాలని సూచించారు. సర్వే ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని, అర్హుల ఎంపికలో కులం, మతం, పార్టీ అనే తేడా లేకుండా ఎటువంటి పొరపాట్లు, వివక్షకు తావు లేకుండా అనర్హుల చొరబాటుకు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. గుడిసెల్లో నివసిస్తూ గతంలో ప్రజాపాలన లేదా ఇతర కార్యక్రమాల్లో దరఖాస్తు చేసుకోని నిరుపేద కుటుంబాలు ఇప్పుడు కూడా ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. ఆ దరఖాస్తులను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన వారికి అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించారు.

రెండో విడతలో 2.50 లక్షల ఇళ్లు

రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు వేగవంతం చేయాలని మంత్రి పొంగులేటి సూచించారు. ప్రతీ నియోజకవర్గానికి రెండు వేల ఇళ్ల చొప్పున మంజూరు చేసిన నేపథ్యంలో అర్హుల ఎంపికను పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

రూఫ్ రీప్లేస్‌మెంట్ పథకానికి ప్రత్యేక ప్రాధాన్యత

పేదల నివాస భద్రతను దృష్టిలో ఉంచుకుని రూఫ్ రీప్లేస్‌మెంట్ పథకాన్ని అమలు చేస్తున్నామని పొంగులేటి తెలిపారు. రెండో విడతలో భాగంగా ప్రతీ నియోజకవర్గానికి 500 ఇళ్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 50 వేల ఇళ్లను ఈ పథకం కింద ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. గోడలు, పునాదులు బలంగా ఉన్నప్పటికీ పైకప్పులకు టార్పాలిన్ షీట్లు, రేకులు, నాపరాళ్లు లేదా ప్రమాదకర పరిస్థితుల్లో నివసిస్తూ ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను గుర్తించి వారికి ఆర్‌సీసీ స్లాబ్ నిర్మాణం కోసం రూ.2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు.

అసంపూర్తి ఇళ్లకు కూడా అవకాశం

గతంలో వివిధ గృహ నిర్మాణ పథకాల కింద మంజూరై ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్న ఇళ్లను క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించాలని మంత్రి ఆదేశించారు. పాత ఇందిరమ్మ పథకం కింద మంజూరై బేస్మెంట్‌స్థాయి లేదా పైకప్పు స్థాయిలో నిలిచిపోయిన ఇళ్లను కూడా ఈ పథకంలో చేర్చవచ్చని పేర్కొన్నారు. అలాగే గృహలక్ష్మి పథకం కింద నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయిన గృహాలను కూడా గుర్తించి రూఫ్ అప్‌గ్రేడేషన్ కార్యక్రమం ద్వారా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

లబ్ధిదారుడే ఇంటి నిర్మాణదారు

బీఎల్‌సీ(బెనిఫిషియరీ లెడ్ కన్‌స్ట్రక్షన్) విధానంలో లబ్ధిదారుడే తన ఇంటిని నిర్మించుకునే అవకాశం కల్పించామని మంత్రి తెలిపారు. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో స్థలాల కొరతను దృష్టిలో పెట్టుకొని చిన్న స్థలాలు కలిగిన లబ్ధిదారులకు అవసరాన్నిబట్టి గ్రౌండ్ ప్లస్ వన్ (జిG1) నిర్మాణాలకు కూడా అనుమతి ఇవ్వవచ్చన్నారు. మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం విజయవంతమైందని, రెండో విడత ద్వారా లక్షలాది పేద కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపబోతున్నామని మంత్రి పొంగులేటి అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *