– ఎస్ఐఆర్తో ఓట్ల తొలగింపునకు కుట్ర
– ‘ఫేక్’ పేరిట 30 నుంచి 35 శాతం ఓట్లను తీసేసే ప్లాన్
– పాలేరు బీఎల్ఏల శిక్షణ శిబిరంలో మంత్రి పొంగులేటి
– ‘ఫేక్’ పేరిట 30 నుంచి 35 శాతం ఓట్లను తీసేసే ప్లాన్
– పాలేరు బీఎల్ఏల శిక్షణ శిబిరంలో మంత్రి పొంగులేటి
ఏదులాపురం, ప్రజాతంత్ర, జూన్ 12 : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిపక్ష పార్టీలను, వాటి ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ ప్రజాస్వామ్య విరుద్ధమైన కుట్రలకు తెరలేపిందని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అప్రజాస్వామిక పాలన సాగుతోందని మండిపడ్డారు. టీపీసీసీ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)పై కాంగ్రెస్ పార్టీ పాలేరు నియోజకవర్గ బూత్ లెవెల్ ఏజెంట్ల(బీఎల్ఏ) శిక్షణ శిబిరం ఏదులాపురంలో శుక్రవారం జరిగింది. ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని, బీజేపీ రాజకీయ వ్యూహాలను ఎండగట్టారు.
ఎస్ఐఆర్ ఒక పెద్ద భూతం
కేంద్రం చట్టం రూపంలో తీసుకొచ్చిన ఎస్ఐఆర్ ఒక పెద్ద భూతం లాంటిదని, ఇది ముమ్మాటికీ దొంగదారి చర్యేనని మంత్రి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే బలంగా ఉందో, ఎక్కడైతే మనకు ఓట్లు ఎక్కువగా ఉన్నాయో అక్కడ 30 నుంచి 35 శాతం ఓట్లను ఫేక్ ఓట్లుగా చిత్రీకరించి వాటిని జాబితా నుంచి తొలగించేందుకు కేంద్రం పెద్ద కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఓటరు వయస్సులో స్వల్ప తేడాలున్నా, పేర్లలో స్పెల్లింగ్ మిస్టేక్స్ (రావుకు బదులు రెడ్డి, హుస్సేన్ బదులు శ్రీ అని పడటం) ఉన్నా వాటిని వంకగా చూపి ఓట్లను తొలగించే ప్రమాదం ఉందన్నారు, ఇప్పటికే బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఈ పద్ధతిని ప్రయోగించి బీజేపీ సక్సెస్ అయిందని, అదే ఫార్ములాను ఇప్పుడు తెలంగాణలోనూ ప్రయోగించాలని చూస్తున్నారని హెచ్చరించారు. దీన్ని కాంగ్రెస్ సైనికులు గట్టిగా తిప్పికొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు.
నిన్న ఓట్లు.. నేడు ఏకంగా సీట్లే దొంగతనం
రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ఉదంతాన్ని మంత్రి పొంగులేటి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆమెకు అవసరమైన ఓట్ల కంటే 11 ఓట్లు ఎక్కువగా ఉన్నాయని, అయినా కేవలం ఒక పాత ఎఫ్ఐఆర్ కాగితాన్ని సాకుగా చూపి ఎన్నికల అధికారులపై బీజేపీ తీవ్ర ఒత్తిడి తెచ్చి అక్రమంగా ఆమె నామినేషన్‌ను తిరస్కరింపజేసిందని తెలిపారు. ఈ రకంగా కాంగ్రెస్‌కు దక్కాల్సిన రాజ్యసభ స్థానాన్ని వాళ్ళు దొంగిలించారన్నారు. నిన్నటివరకు ఓట్లను దొంగిలించిన బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఏకంగా సీట్లనే దొంగిలించే దుస్థితికి దిగజారిందని నిప్పులు చెరిగారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిష్థాత్మక దర్యాప్తు సంస్థలను బీజేపీ వేట కుక్కల్లా వాడుకుంటోందని మంత్రి తీవ్రంగా ఆరోపించారు. సీబీఐ, ఈడీ, ఇన్కమ్ టాక్స్ సంస్థలను అడ్డం పెట్టుకుని ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను భయభ్రాంతులకు గురిచేస్తున్నదని మండిపడ్డారు. ఆయా రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలను కూల్చేందుకు కుట్రలు పన్నుతున్నదని, దేశంలో ఎక్కడ బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్నా ఇదే రకమైన కుట్రలు సాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతి ఓటూ కాంక్రీట్ గోడ కావాలి
ఈనెల 25 నుంచి జూలై 24 వరకు నెల రోజులపాటు నిర్వహించే ఓట్ మ్యాపింగ్ ప్రక్రియపై కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. ఉద్యోగాలు, చదువులరీత్యా ఖమ్మం, హైదరాబాద్‌లలో ఉండే మన వాళ్లు అధికారులు వచ్చినప్పుడు ఊర్లో లేరనే సాకుతో ఓట్లు తొలగించే ప్రమాదం ఉందన్నారు. అధికారులు వచ్చే ముందే గ్రామంలో చాటింపు వేయించి వేరే ఊర్లలో ఉన్న మన ఓటర్లను రప్పించి ఓటు కాపాడుకోవాలని సూచించారు. మనకు దొంగ ఓట్లు అవసరం లేదు.. మనకున్న జనాదరణతో ప్రతి ఓటునూ ఒక కాంక్రీట్ గోడలాగా కాపాడుకోవాలి అని స్పష్టం చేశారు. దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న మన నేత రాహుల్ గాంధీకి కార్యకర్తలు సైనికుల్లా అండగా నిలబడాలని, ఎసఐఆర్ కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లి సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, పీసీసీ ప్రతినిధి సుధాకర్, ఖమ్మం టౌన్ ప్రెసిడెంట్, ఏదులాపురం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, 291 బూత్‌ల బిఎలఏలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
———————————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




