– గడ్కరీ వ్యాఖ్యలతో రాజకీయ కలకలం
– కేంద్రంలో కొత్త తరానికి అవకాశం ?
న్యూదిల్లీ, ఆగస్టు 25: కేంద్ర మంత్రిమండలిలో మార్పులు చేర్పులపై కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్న వేళ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు రాజకీయ కాకను రేపుతున్నాయి. యువతరానికి బాధ్యతలు అప్పగించాల్సిన సమయం వచ్చిందని నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గడ్కరీ తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. నేను చేయాలనుకున్నంత కాలం పనిచేశాను. ప్రస్తుతం నేను మునుపటిలా పనిచేయలేకపోతున్నా. ప్రజాపనుల్లో ప్రమేయం తగ్గిపోయింది. ఆ పనిని కొత్త తరాలకు అప్పగించాలి. కొత్తవారికి సీనియర్లు మార్గనిర్దేశం చేస్తున్నారు. నేను గత 30 ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్నాను. ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాను. అవార్డులూ అందుకున్నాను అని గడ్కరీ గుర్తుచేసు కున్నారు. అలాగే అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడారు. భవిష్యత్‌లో అభివృద్ధి పనుల సంఖ్య మరింత పెరుగుతుందని చెప్పారు. మహారాష్ట్రలో ప్రతి ఆదివాసీ గ్రామానికి విద్యుత్ సదుపాయాన్ని కల్పించడమే తన లక్ష్యమన్నారు. త్వరలోనే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగనున్నట్లు కేంద్రమంత్రి రామ్‌దాస్ ఆఠవాలే వెల్లడించిన సంగతి తెలిసిందే. భాజపా, మిత్రపక్షమైన ఎన్‌సీపీకి చెందిన కొత్త వారిని మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. సంస్థాగతంగానూ భాజపాలో భారీ మార్పులు జరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు.. 20శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకాన్ని ప్రోత్సహిస్తోన్న నితిన్ గడ్కరీ ఆ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ20 పెట్రోల్‌తో తన కుటుంబం లబ్ది పొందుతోందంటూ పలువురు నెటిజన్లు ఆన్‌లైన్‌లో డీప్‌ఫేక్ వీడియోలు, పోస్టులు పెడుతున్నారని బాంబే హైకోర్టును కూడా ఆశ్రయించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. ఈ నేపథ్యంలో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వార్తల వేళ గడ్కరీ మాటలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గతంలో పార్టీ, ప్రభుత్వం కోసం విస్తృతంగా పని చేశానని.. ఇప్పుడు తన చురుకైన పాత్రను క్రమంగా తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. యువతకు బాధ్యతలు అప్పగించి, వారు పని చేసే అవకాశాన్ని కల్పించాలన్న అభిప్రాయాన్నీ ఆయన వ్యక్తం చేశారు. ఇకపై తీవ్రమైన పాలనాపరమైన ఒత్తిళ్ల కంటే సామాజిక సంక్షేమం, గిరిజన ప్రాంతాలు, రైతుల శ్రేయస్సుపైనే దృష్టి సారిస్తానంటూ నితిన్ గడ్కరీ సంకేతాలు ఇచ్చారు. మహారాష్ట్రలో ఏ గిరిజన గ్రామమూ విద్యుత్ సౌకర్యానికి దూరంగా ఉండకూడదన్న లక్ష్యాన్నీ గడ్కరీ ప్రస్తావించారు. ’చేసినంత కాలం చేశాను.. ఇప్పుడు కొత్త తరానికి అవకాశం ఇవ్వాలి’ అని అన్నారు. గడ్కరీ చేసిన ఈ వ్యాఖ్యలు బీజేపీలో జరుగుతున్న తరాల మార్పుపై మరోసారి చర్చకు దారితీశాయి. ఇటీవల పార్టీ సంస్థాగత స్థాయిలో చోటుచేసుకున్న మార్పుల నేపథ్యంలో కేంద్ర మంత్రి తాజా వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




