ఇక పైలెట్లకూ డోపింగ్‌ ‌టెస్ట్‌లు

– మాదక ద్రవ్యాలు వినియోగంచకుండా ఆంక్షలు
– టెస్ట్ ‌వ్యవహారాలను పరిశీలిస్తున్న డిజిసి
– కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ ‌నాయుడు

న్యూదిల్లీ, ఆగస్టు 25 : ఇకపై ఏడాదికి ఒక్కసారైనా విమాన పైలట్లకు డోప్‌ ‌టెస్టులునిర్వహించాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ ‌నాయుడు తెలిపారు. పైలట్లు మాదకద్రవ్యాల, మత్తు పదార్థాలు ఉపయోగించకుండా అరికట్టేందుకు, భవిష్యత్తులో కఠినమైన నిబంధనలు తెచ్చేందుకు డీజీసీఏ ప్రస్తుతం విమానయాన సంస్థలతో చర్చలు జరుపుతోందని చెప్పు కొచ్చారు. ప్రస్తుతం మొత్తం పైలట్ల సంఖ్యలో 10 శాతం మందికి మాత్రమే డోప్‌ ‌టెస్టులు నిర్వహించాలనే నిబంధన అమల్లో ఉందని చెప్పారు. ఏడాదిలో ఒకసారి ప్రతి పైలట్‌కూ పరీక్ష నిర్వహించేలా దీనిని మార్పు చేయాలనే అంశాన్ని డైరెక్టరేట్‌ ‌జనరల్‌ ఆఫ్‌ ‌సివిల్‌ ఏవియేషన్‌ ‌పరిశీలిస్తోందన్నారు. భద్రత, నిర్వహణ పరమైన అంశాలను పరిగణనలోకి తీసుకొని దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. మాదకద్రవ్యాల వినియోగానికి సంబంధించిన ప్రస్తుత నిబంధనలను మరింత కఠినం చేసే మార్గాలపైనా డీజీసీఏ అధ్యయనం చేస్తోందని రామ్మోహన్‌ ‌నాయుడు తెలిపారు. ఇటీవల జరిగిన ఎయిర్‌ ఇం‌డియా పుకెట్‌-‌దిల్లీ విమాన ఘటనపై మాట్లాడుతూ.. దీనిపై ఎయిర్‌‌క్రాప్ట్ ‌యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ ‌బ్యూరో దర్యాప్తు చేస్తోందన్నారు. విమానంలోని పైలెట్‌ ‌డేటా రికార్డర్‌ ‌దర్యాప్తు సంస్థ ఆధీనంలో ఉందని పేర్కొన్నారు. త్వరలోనే ప్రాథమిక నివేదిక వచ్చే అవకాశం ఉందని.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. థాయ్‌లాండ్‌ ‌నుంచి దిల్లీకి వస్తున్న విమానం ఆగస్టు 4న తీవ్ర కుదుపులకు లోనైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 17 మంది గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం పైలట్లు ఇద్దరికీ డ్రగ్‌ ‌టెస్ట్ ‌నిర్వహించారు. తొలి పరీక్షలో పైలట్‌-ఇన్‌- ‌కమాండ్‌కు పాజిటివ్‌ ‌వచ్చింది. దీని తర్వాత సైకోయాక్టివ్‌ ‌పరీక్ష నిర్వహించగా.. గంజాయి సేవించినట్లు నిర్ధరణ అయ్యింది.  ఈ ఘటనపై ఎయిర్‌ ‌క్రాప్ట్ ‌యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ ‌బ్యూరో దర్యాప్తు జరుపుతోందని పేర్కొన్నారు. విమానం డేటా రికార్డర్లు, ఇతర భాగాలు సురక్షితంగా ఉన్నందున, త్వరలోనే ప్రాథమిక నివేదిక వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం పైలట్‌ ‌నెట్‌వర్క్‌లో కేవలం పదిశాతం మందికి మాత్రమే రాండమ్‌గా డోప్‌ ‌టెస్టులు నిర్వహిస్తున్నారని రామ్మోహన్‌ ‌వెల్లడించారు. ప్రతీ పైలట్‌కు సంవత్సరంలో కనీసం ఒక్కసారైనా రాండమ్‌గా పరీక్ష నిర్వహించాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని అన్నారు. విమాన ప్రయాణికుల భద్రత అత్యంత ముఖ్యమైనదని చెప్పారు. విమాన సంస్థల ఆపరేషనల్‌ ‌ప్రభావం కూడా దెబ్బతినకుండా ఈ రెండింటి మధ్య సమతుల్యత పాటిస్తామని రామ్మోహన్‌ ‌నాయుడు పేర్కొన్నారు.
———

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *