– జనగణనలో కులగణన విధానం సరిగా లేదు
– ప్రశ్నావళి మార్చేందుకు అఖిలపక్షం ఏర్పాటు
– ప్రధాని మోదీకీ రాహుల్, ఖర్గేల లేఖ
న్యూదిల్లీ, ఆగస్టు 25: జనగణన పద్ధతిపై కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మంగళవారం ఖర్గే, రాహుల్ సుదీర్ఘ లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. కులగణలో తెలంగాణ మోడల్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. జనగణనలో కులాల నమోదుకు ’ఓపెన్-ఎండెడ్’ విధానాన్ని అమలు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కులాల లెక్కింపు విధానాలతో తీవ్ర నష్టం జరుగుతోందని రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. ’ఒకే కులం వేర్వేరు పేర్లతో విడిపోయి లక్షలాది కులాల పేర్లుగా నమోదవుతాయని.. దీనివల్ల లెక్కింపు డేటా పూర్తిగా నిరుపయోగంగా మారుతుందని తెలిపారు. ప్రశ్నావళిలో ’వెనుకబడిన వర్గాలు’ అనే పదమే లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ తరహాలోనే బీసీ, ఓబీసీ కులాల నమోదుకూ ’డ్రాప్-డౌన్ జాబితా’ విధానాన్ని ఉపయోగించాలని రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సూచించారు. తెలంగాణ (2024), బిహార్ (2022) సర్వేల్లో వాడిన కులాల జాబితా నమూనాలను ప్రధానికి పంపించారు. ప్రస్తుత గందరగోళ ప్రశ్నావళిని వెంటనే రద్దు చేసి, అన్ని పార్టీలు – నిపుణులతో చర్చించి ఓ కొత్త ప్రశ్నావళిని రూపొందిం చాలని ఖర్గే, రాహుల్ డిమాండ్ చేశారు. ఇదిలావుంటే రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను అంతం చేయడానికి మోదీ ప్రభుత్వం కుట్రపన్నిందని, దీనిలో భాగంగానే కేంద్రానికి చెందిన వివిధ శాఖాల్లో ఖాలీగా ఉన్న 8.2లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయడంలేదని కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. మంత్రిత్వ శాఖల వారీగా ఖాలీగా ఉన్న పోస్టులపై డియా నివేదికను ఉటంకిస్తూ విమర్శలు సంధించారు. ’2015లో కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 4.21లక్షల ఉద్యోగాలు భర్తీకాకుండా ఉన్నాయి. 2024కు వాటి సంఖ్య 8.24 లక్షలకు చేరాయి. రైల్వేల్లో 2.40లక్షలు, కేంద్ర హోంశాఖ పరిధిలో 1.10 లక్షలు ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది. ప్రభుత్వ రంగ సంస్థల్లోని 5.1 లక్షల శాశ్వత ఉద్యోగాలను రద్దు చేశారు. ఇవికాక రక్షణ రంగంలో 2.41 లక్షల పోస్టులు ఖాలీగా ఉన్నాయని ఖర్గే తెలిపారు. ఒప్పంద ఉద్యోగులు 19శాతం నుంచి 49శాతానికి పెరిగారని వెల్లడించారు. ఇది ఒక్క ఉపాధి సమస్య మాత్రమే కాదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన సామాజిక న్యాయం అంశం కూడా ఇమిడి ఉందని పేర్కొన్నారు. విద్య, ఉపాధి రంగాల్లో యువ భారతీయుల జీవితాలను మోదీ ప్రభుత్వం ధ్వంసం చేసిందని మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. దేశంలో 15 నుంచి 29 ఏళ్ల వయసు గల 8.7 కోట్ల మంది యువత చదువులు, ఉపాధికి దూరమయ్యారని, వారికి ఎటువంటి నైపుణ్య శిక్షణలూ అందడంలేదన్నారు. నీతిఆయోగ్ నివేదికను ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో గత 40 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగుల శాతం పెరిగిందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంకా గాంధీ విమర్శించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




