– ట్రూత్ సోషల్ మీడియాలో ప్రకటించిన ట్రంప్
– ఒప్పందాన్ని స్వాగతించిన ప్రపంచ దేశాలు
వాషింగ్టన్, జూన్ 15: పశ్చిమాసియా ఉద్రిక్తతలకు తెర పడింది. అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక శాంతి ఒప్పందం కుదిరింది. ఈ వారం చివర్లో దీనిపై సంతకాలు జరగనున్నాయి. మూడు నెలలకు పైగా సాగిన యుద్ధం ముగిసిపోవడంతో భారత్ సహా ప్రపంచదేశాలు హర్షం వ్యక్తంచేశాయి. ఈ ఒప్పందాన్ని స్వాగతిస్తూ పశ్చిమాసియాలో సుస్థిర శాంతి నెలకొనాలని ఆకాంక్షించాయి. నెలలతరబడి పశ్చిమాసియా ఉద్రిక్తతలకు తెరదించుతూ అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన చరిత్రాత్మక శాంతి ఒప్పందాన్ని ప్రపంచ దేశాలు ఏకగ్రీవంగా స్వాగతించాయి. ప్రాంతీయ స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి, వ్యూహాత్మక హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి, అంతర్జాతీయ ఆర్థిక రంగానికి ఊరటనిచ్చేందుకు ఈ ఒప్పందం ఒక అద్భుతమైన దౌత్యపరమైన మలుపు అని ప్రపంచ దేశాల నేతలు అభివర్ణించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ఈ చరిత్రాత్మక ఒప్పందానికి పాకిస్థాన్ ప్రధానంగా మధ్యవర్తిత్వం వహించగా.. ఖతార్, టర్కీ, యునైటెడ్ కింగ్‌డమ్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు దీనిపై హర్షం వ్యక్తం చేశాయి. ఈ ఒప్పందం పూర్తయినట్లు ట్రంప్ తన ’ట్రూత్ సోషల్’ వేదికగా అధికారికంగా ప్రకటించారు. ’ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌తో ఒప్పందం ఇప్పుడు పూర్తయింది. అందరికీ అభినందనలు! ప్రపంచ నౌకలారా, ఇంజన్లు స్టార్ట్ చేయండి. ఆయిల్ ప్రవహించనివ్వండి!’ అని ట్రంప్ ఉత్సాహంగా ట్వీట్ చేశారు. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని స్వాగతిస్తున్నాం. ఈ డీల్‌తో హర్మూజ్ జలసంధిలో ఇకపై నౌకల రవాణా నిరాటంకంగా, స్వేచ్ఛగా జరుగుతుందని ఆశిస్తున్నాం. శాంతి, ప్రాంతీయ స్థిరత్వం కోసం చేపట్టే అన్ని చర్యలకు భారత్ ఎల్లప్పుడూ మద్దతిస్తుంది. ఈ పరిణామాలను స్ఫూర్తిగా తీసుకుని ఉక్రెయిన్-రష్యా కూడా శాంతి ప్రయత్నాలు చేయాలని ఆకాంక్షిస్తున్నాం అని మంత్రిత్వ శాఖల అంతర్గత సమావేశంలో భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జయస్‌వాల్ వెల్లడించారు. అమెరికా-ఇరాన్ మధ్య దౌత్యపరంగా చారిత్రక డీల్ జరగడం అభినందనీయం. ఈ పరిణామాలు ప్రపంచ ఆర్థికవ్యవస్థ పునరుజ్జీవనానికి మార్గం సుగమం చేశాయి. పశ్చిమాసియా మరింత సురక్షితంగా ఉంటుంది. ఈ ఒప్పందాన్ని కృతనిశ్చయంతో అమలుచేయడం అత్యావశ్యకం అని జర్మనీ ఛాన్స్‌లర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ అభిప్రాయపడ్డారు. ఇరాన్-అమెరికా డీల్ శుభపరిణామం. ఈ ఒప్పందాన్ని వీలైనంత వేగంగా అమల్లోకి తీసుకురావాలి. హర్మూజ్ జలసంధిని త్వరగా, భేషరతుగా తెరవాలి. ఎలాంటి ఆంక్షలు, టోల్స్ లేకుండా నౌకల రవాణాను పునరుద్ధరించాలి. అప్పుడే ప్రాంతీయ స్థిరత్వం సాధించగలం. ఇరాన్ అణు, బాలిస్టిక్ క్షిపణులకు సంబంధించిన ఆందోళనలను కూడా ఈ డీల్ పరిష్కరించాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ అన్నారు. ఇరాన్-అమెరికా ఒప్పందాన్ని స్వాగతిస్తున్నాం. ట్రంప్‌తోపాటు డీల్ కోసం మధ్యవర్తిత్వం చేసిన దేశాలకు అభినందనలు. ఇప్పుడు అందరి దృష్టి ఈ ఒప్పందం అమలుపైనే ఉంది. హర్మూజ్‌ను శాశ్వతంగా తెరవడంతోపాటు నౌకల భద్రతకు సంబంధించిన సాంకేతిక అంశాల్లో మద్దతిచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. సుస్థిరశాంతికే మా ప్రథమ ప్రాధాన్యం. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండొద్దన్న మా వైఖరి ఇప్పటికీ స్థిరంగా ఉందని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తెలిపారు. ఈ ఒప్పందాన్ని యావత్ ప్రపంచం కోరుకుంది. ఈ పరిణామాలు పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వానికి మార్గం సుగమం చేస్తాయని ఆశిస్తున్నా. మరికొన్ని రోజుల్లో ఈ ఒప్పందంపై సంతకాలు జరగనున్న వేళ ప్రస్తుతానికి ఇరుపక్షాలు రెచ్చగొట్టే చర్యలకు దూరంగా ఉండాలని కోరుతున్నా. దీనికి మధ్యవర్తిత్వం వహించిన దేశాలకు అభినందనలు. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా దౌత్య పరిష్కారాలకు మేం నిరంతరం మద్దతు ఇస్తాం తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్ అభిప్రాయపడ్డారు.
ఇరాన్‌తో శాంతి ఒప్పందంతో మార్కెట్లో మళ్లీ జోరు
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండికి మళ్లీ గిరాకీ పెరిగింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం, చమురు ధరలు దిగిరావడం, రూపాయి విలువ బలోపేతం వంటి కారణాలతో ఈ లోహాల ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఇరాన్‌తో డీల్ కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీంతో మూడు నెలలకు పైగా సాగిన యుద్ధానికి ముగింపు లభించినట్లయ్యింది. ఈ పరిణామాలతో ముడి చమురు ధరలు భారీగా దిగొచ్చాయి. బ్రెంట్ క్రూడ్ 83 డాలర్లకు పడిపోయింది. అటు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 53 పైసలు బలపడి 93.65 వద్ద ట్రేడ్ అవుతోంది. సోమవారం హైదరాబాద్ లో 10 గ్రాముల మేలిమి 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,490 పలికింది. అటు వెండి ధర కూడా ఎగబాకింది. కేజీ వెండి ధర రూ.2.57లక్షలకు చేరింది. గతవారం ఒకదశలో బంగారం ధర రూ.1,50,000 కన్నా దిగువకు పడిపోయిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ విపణిలోనూ బంగారం, వెండికి డిమాండ్ పెరిగింది. స్పాట్ గోల్డ్ ఔన్సు ధర 4,323 డాలర్లు, ఔన్సు వెండి ధర 70.38 డాలర్లకు చేరింది. గతవారం పసిడి ధర ఒక దశలో దాదాపు 4000 డాలర్లకు తగ్గింది. ఇక, కమొడిటీ ఎక్స్ఛేంజీలో గోల్డ్ ఫ్యూచర్స్ ధర రూ.1,53,258గా ఉంది. వెండి ఫ్యూచర్స్ ధర రూ.2,52,383గా ట్రేడ్ అవుతోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




