– నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రులు
– భవిష్యత్ అవసరాల దృష్ట్యా నగర నిర్మాణం
– మంత్రులు పొంగులేటి, శ్రీధర్‌బాబుల వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 28: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీ దేశానికే ఆదర్శంగా నిలిచే విధంగా రూపుదిద్దుకుంటోందని మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీలో నిర్మాణంలో ఉన్న ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ(ఎఫ్‌సీడీఏ) కార్యాలయ భవనం, స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులను వారు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఫ్యూచర్ సిటీని అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తోందన్నారు. ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జూన్ 2 లేదా 3 తేదీల్లో నిర్వహించే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ఆ కార్యక్రమానికి ముందుగా పనుల పురోగతిని పరిశీలించేందుకు తాము వచ్చామన్నారు. ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయం ద్వారా నగర అభివృద్ధి పనులకు మరింత వేగం చేకూరుతుందని పేర్కొన్నారు. ఇక్కడ తీసుకునే ప్రతి నిర్ణయం, ప్రతి కార్యాచరణ గ్లోబల్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా స్పష్టమైన దృక్పథంతో పనిచేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే పోలీస్ కమిషనరేట్ ఏర్పాటుతోపాటు గ్లోబల్ ప్రెజెన్స్ కలిగిన ప్రభుత్వ కార్యాలయాలను కూడా ఇక్కడినుంచే నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. స్కిల్ యూనివర్సిటీ శాశ్వత క్యాంపస్ పనులను తనిఖీ చేశారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్రంగా స్కిల్ యూనివర్సిటీ నిలవబోతోందని చెప్పారు. క్షేాత్రస్థాయిలో పనుల పురోగతిని సమీక్షించి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి ఎదురైన ఆటుపోట్లు అధిగమిస్తూ సమస్యలను పరిష్కరిస్తూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ప్రపంచంలోని అనేక దేశాలు, రాష్ట్రాలు సైతం ఆలోచించని విధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం వినూత్న కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ప్రస్తుతం తాత్కాలిక క్యాంపస్‌లో కొనసాగుతున్న యూనివర్సిటీకి శాశ్వత క్యాంపస్ నిర్మాణం వేగంగా జరుగుతోందని, పనుల పురోగతిని సమీక్షించి అవసరమైన నిర్ణయాలు తీసుకుని నిర్మాణాన్ని మరింత వేగవంతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ కె.శశాంక, మహేశ్వరం డీసీపీ కె.నారాయణ రెడ్డి, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





