విద్య‌, వైద్యంపై ఖ‌ర్చు రాష్ట్ర ప్ర‌గ‌తికి పెట్టుబ‌డి

– వైద్య రంగంలో విప్ల‌వాత్మ‌క మార్పులు
– 24వేల‌కు పైగా ప‌డ‌క‌ల సామ‌ర్థ్యంతో అగ్ర‌గామిగా వైద్య‌ రంగం
– ఉప‌ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌
– 247 మంది న‌ర్సింగ్ అధికారుల నియామ‌క ప‌త్రాల అంద‌జేత‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 17: వైద్యం, విద్యారంగాలపై ప్రభుత్వం పెట్టే ఖర్చు ఉచిత సంక్షేమం మాత్రమే కాదని, అది మన రాష్ట్ర స్థూల ఉత్పత్తిని  పెంచేందుకు మానవ వనరులపై పెట్టే దీర్ఘకాలిక పెట్టుబడి అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్  డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో నూతనంగా ఎంపికైన 247 మంది నర్సింగ్ ఆఫీసర్లకు సేవాలాల్ భవన్‌లో కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామితో కలిస నియామక పత్రాలను ఆయ‌న‌ శుక్ర‌వారం అందజేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కార్మికుల హక్కులు, కనీస వేతనాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాను గతంలో ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో ఉన్నప్పుడు ప్రతి బడ్జెట్ సమావేశంలోనూ కనీస వేతనాల సవరణ గురించి నిలదీశానని, కానీ నాటి ప్రభుత్వం ఏనాడూ సరైన సమాధానం ఇవ్వలేదని గుర్తుచేశారు. అయితే, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రత్యేక దృష్టి సారించి దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న కనీస వేతనాల సవరణను సాధించి జీవోలను విడుదల చేశారని ప్ర‌శంసించారు. ఈఎస్ఐ ఆసుపత్రిలో మందుల కొరత ఉండకుండా పేదలకు సక్రమంగా మందులు పంపిణీ జరగడానికి మంత్రి వివేక్ చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొని గ్రీన్ ఛానల్ లో రూ.30 కోట్లు విడుదల చేయడానికి వెసలుబాటు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈఎస్ఐ హాస్పిట‌ల్స్‌లో అధునాతన డయాలసిస్ యూనిట్లు, సీటీ స్కాన్ సౌకర్యాలు, బర్న్స్ వార్డులు, కార్డియాక్ కేర్ సెంటర్లను వేగంగా ఏర్పాటు చేసి ప్రస్తుతం ఉన్న సౌకర్యాలను ఆధునికీకరిస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో అదనంగా 120మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, ఆరుగురు డెంటల్ సివిల్ సర్జన్లు, 99 మంది ఫార్మసిస్టులు, 34 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 54 మంది ఏఎన్‌ఎంలు, ఇతర పారామెడికల్ సిబ్బంది పోస్టులను భర్తీ చేయబోతున్న‌ట్లు తెలిపారు. సనత్ నగర్ ఈఎస్ఐతోపాటు ఎల్బీనగర్, అల్వాల్, వరంగల్‌లలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్స్‌ నిర్మాణాలను వేగవంతం చేయడానికి ప్రతి నెలా నిధులు విడుదల చేస్తున్నామని చెప్పారు. నిమ్స్  విస్తరణ పనులకు సైతం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ దాదాపు 44,029 పడకల సామర్థ్యంతో దేశంలోనే అత్యధిక సగటు పడకలు కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్  ద్వారా దాదాపు 75 లక్షల మందికి నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే ఉన్న 16 మెడికల్ కాలేజీలకు అదనంగా నూతనంగా 9 మెడికల్ కాలేజీలను, 16 నర్సింగ్ కాలేజీలను, 28 పారామెడికల్ కాలేజీలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్, హైదరాబాదులో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి అత్యాధునిక కంప్యూటరైజ్డ్ మిషనరీతో శిక్షణ ఇస్తున్నామని వివరించారు. విదేశీ ఉద్యోగాల కోసం టామ్ కామ్ ద్వారా శిక్షణ పొందే విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం ప్రతి నెలా రూ.2,000 స్టైఫండ్ అందిస్తూ ఉచిత శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు. నూతనంగా నియామక పత్రాలు అందుకున్న నర్సింగ్ అధికారులను అభినందిస్తూ నర్సింగ్ అనేది ఉద్యోగం మాత్రమే కాదని, అది ఆపదలో ఉన్న దీన జనులకు ప్రేమతో సేవలు అందించే ఒక పవిత్రమైన సేవ అని అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *