– నాటడమే కాదు.. మొక్కలను చెట్లుగా తీర్చిదిద్దాలి
– కేసముద్రంలో ఘనంగా వనమహోత్సవం
– పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
మహబూబాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 31 : ఈరోజు నాటే చిన్న మొక్క రేపటి తరాలకు పెద్ద భరోసా అవుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో సోమవారం నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఇంటి ఆవరణలో నాటుకునేందుకు పండ్ల మొక్కలను ప్రజలకు పంపిణీ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పార్లమెంట్ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు మురళీనాయక్, రామచంద్ర నాయక్, కేఆర్ నాగరాజులతో కలిసి మంత్రి సీతక్క మొక్కను నాటి వనమహోత్సవ ప్రాధాన్యతను వివరించారు. చెట్టు అంటే పచ్చదనం మాత్రమే కాదని, అది జీవం, స్వచ్ఛమైన గాలి, నీడ, ఆరోగ్యం అని ఆమె చెప్పారు. ఈ ఏడాది వనమహోత్సవంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో 6.18 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే లక్ష్యంలో దాదాపు 91 శాతం మొక్కలు నాటడం పూర్తయిందని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థుల సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందన్నారు. అయితే మొక్కలు నాటడంతోనే బాధ్యత పూర్తికాదని, నాటిన ప్రతీ మొక్క బతకాలని, ఎదగాలని, పెద్ద చెట్టుగా మారాలని మంత్రి సీతక్క అన్నారు. అప్పుడే వనమహోత్సవం నిజమైన అర్థంలో విజయవంతమవుతుందన్నారు. ముఖ్యంగా ఈసారి ఇంటి ఆవరణల్లో నాటుకునేందుకు పండ్ల మొక్కల పంపిణీకి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2.75 కోట్ల పండ్ల మొక్కలను ఇంటింటికీ అందించాలనే లక్ష్యంతో నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేసి గ్రామాలకు చేరవేస్తున్నామని చెప్పారు. ప్రతి కుటుంబం తమకు నచ్చిన పండ్ల మొక్కను తీసుకెళ్లి ఇంటి ఆవరణలో నాటాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. మొక్కకు నీళ్లు పోసి, పిల్లలను చూసుకున్నట్లే సంరక్షించి, అది పెద్ద చెట్టుగా ఎదిగే వరకు బాధ్యత తీసుకోవాలని కోరారు. ఇంటికో పండ్ల మొక్క.. ఆరోగ్యానికి బంగారు బాట అనే సందేశాన్ని ప్రతి కుటుంబం ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. ప్రతీ ఇంట్లో ఒక పండ్ల చెట్టు ఉంటే అది పచ్చదనాన్ని ఇవ్వడమే కాక కుటుంబ ఆరోగ్యానికి కూడా అండగా నిలుస్తుందని అన్నారు. జామ, ఉసిరి, మామిడి, సీతాఫలం, మునగ వంటి మొక్కలు ఇంటి ఆవరణలో పెరిగితే పిల్లలకు సహజసిద్ధమైన పోషకాహారం అందుతుందని వివరించారు. మారుతున్న జీవనశైలిలో ఆహారపు అలవాట్లు కూడా మారిపోతున్నాయని, పిల్లల్లో పోషకాహార లోపం రాకుండా చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. మహిళలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతీ ఇంటి ఆవరణలో పండ్ల మొక్కలు పెంచే కార్యక్రమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఒక చిన్న పండ్ల మొక్క రేపు మన పిల్లల ఆరోగ్యానికి పెద్ద అండగా మారుతుందని చెప్పారు. ప్రభుత్వం మొక్కలను అందిస్తుందని, కానీ వాటిని నాటడం, సంరక్షించడం ప్రజలందరి బాధ్యత అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. పంపిణీ చేసిన మొక్కలు ఇంటి వద్దే ఉండిపోకుండా మట్టిలో నాటి ప్రతీ మొక్క బతికేలా చూడాలని కోరారు. రుతువుల గమనం మారుతోందని, ఎప్పుడు వర్షం వస్తుందో, ఎంత వర్షం పడుతుందో అంచనా వేయడం కూడా కష్టంగా మారుతోందని అన్నారు. ఈ మార్పులను ముందుగానే గుర్తించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, వాతావరణ శాస్త్రవేత్తల హెచ్చరికలు, ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు చూపుతో ఏప్రిల్ నుంచే మొక్కలు నాటే కార్యక్రమానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. వర్షాకాలం కోసం ఎదురు చూడకుండా ముందుగానే కార్యాచరణ రూపొందించామని, ఉపాధి హామీ పనుల ద్వారా మొక్కల పెంపకం, చెక్‌డ్యాంల నిర్మాణం, నీటి సంరక్షణ పనులకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. చెట్లు పెరగాలంటే నీరు కావాలని, నీరు నిలవాలంటే ప్రకృతిని కాపాడాలని మంత్రి అన్నారు. అందుకే ఒకవైపు మొక్కలు నాటుతూ, మరోవైపు చెక్‌డ్యాంలు, నీటి సంరక్షణ పనులు చేపడుతున్నామని తెలిపారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి పొలానికి పంటకుంట, ప్రతి ఊరికి ఊటకుంట అనే లక్ష్యంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పనిచేస్తోందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ప్రతి రైతు, ప్రతి గ్రామం స్వయం సమృద్ధిగా మారాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
పచ్చదనం, జల సంరక్షణ రెండూ కలిసి సాగినప్పుడే గ్రామాలు సస్యశ్యామలం అవుతాయని అన్నారు. రైతులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కలిసి వనమహోత్సవాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలని కోరారు.
కార్యక్రమంలో గ్రామీణ అభివృద్ధి శాఖ స్పెషల్ కమిషనర్ శ్రీలక్ష్మి, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, సిబ్బంది, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




