– మంత్రి సీతక్క ఆదేశాల మేరకు 15 వరకు దరఖాస్తుల స్వీకరణ
– కొనసాగుతున్న ‘సర్’ ప్రక్రియ, దివ్యాంగుల విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వ నిర్ణయం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 31 : చేయూత సామాజిక భద్రతా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే గడువును ప్రభుత్వం మరో 15 రోజులపాటు పొడిగించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు దరఖాస్తుల స్వీకరణ గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాదులో కొనసాగుతున్న ‘సర్’ ప్రత్యేక ప్రక్రియ కారణంగా పలువురు అర్హులు నిర్ణీత గడువులోగా దరఖాస్తులు సమర్పించలేకపోతున్నారని ప్రభుత్వ దృష్టికి వచ్చింది. ముఖ్యంగా దివ్యాంగులు తమకు మరికొంత సమయం ఇవ్వాలని మంత్రి సీతక్కను కోరారు. ఈ విజ్ఞప్తులను సానుకూలంగా పరిగణించిన మంత్రి సీతక్క అర్హులైన ఒక్కరు కూడా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కోల్పోకూడదని అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వం వెంటనే స్పందించి చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువును మరో 15 రోజులపాటు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన అర్హులైన వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, ఇతర అర్హత కలిగిన పేద కుటుంబాల వారు సెప్టెంబర్ 15 వరకు తమ దరఖాస్తులను సమర్పించుకునే అవకాశం లభించింది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ సామాజిక భద్రతా పెన్షన్లు పేద కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న భరోసా అని అన్నారు. అర్హత ఉన్న ఒక్క పేదవాడు, దివ్యాంగుడు సమాచారం లేకనో, ఇతర కారణాల వల్లనో ప్రభుత్వ సంక్షేమ పథకానికి దూరం కాకూడదన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. దివ్యాంగులు తమ సమస్యలను, ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారని, వారి అభ్యర్థనను మానవీయ కోణంలో పరిశీలించి గడువు పెంచామని తెలిపారు. గడువు పెంపును దృష్టిలో పెట్టుకుని సంబంధిత అధికారులు, సిబ్బంది దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియలో ప్రజలకు పూర్తి సహకారం అందించాలని మంత్రి సీతక్క ఆదేశించారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారికి అవసరమైన సహాయం అందించాలని సూచించారు.]
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





