– బీజేపీ ప్రధాన కార్యదర్శి వీరేందర్ గౌడ్ ఆగ్రహం
– అవసరమైతే కేసును సీబీఐకి అప్పగించాలి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 31 : కాంగ్రెస్ హయాంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళల భద్రత గాలిలో దీపంలా మారిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్ గౌడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ పరిధిలో ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో పనిచేస్తున్న నర్సుపై జరిగిన అత్యాచారం, హత్య అత్యంత పాశవికమని, సభ్యసమాజం తలదించుకునే ఘోరమైన ఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగూడెం ప్రాంతం నుంచి వచ్చిన ఓ యువతి స్థానిక ప్రైవేట్ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తూ సమీపంలోని హాస్టల్‌లో ఉంటోందని తెలిపారు. పక్కనే ఉన్న మెకానిక్ షాపులో పనిచేసే సనావుల్లా ఖాన్ అనే వ్యక్తి హాస్టల్ గదిలోకి చొరబడి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడని, ఆమె ప్రతిఘటించడంతో అత్యంత కిరాతకంగా హత్య చేశాడని తెలిపారు. నిందితుడు పెట్రోల్ పోసి ఆధారాలు చెరిపివేసేందుకు సైతం యత్నించినట్లు సమాచారం వస్తోందని చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్‌లో నిందితుడు స్పష్టంగా తెలుస్తున్నా పోలీసులు నిన్నటివరకు కేసు నమోదు చేయకుండా అరెస్టును ధ్రువీకరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. మృతురాలి కుటుంబీకులను భయభ్రాంతులకు గురిచేసి నష్టపరిహారం పేరుతో నచ్చజెప్పి హడావుడిగా పోస్టుమార్టం ముగించి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ప్రయత్నించడం చూస్తుంటే కేసును తొక్కిపెట్టే కుట్ర స్పష్టంగా కనిపిస్తోందని వీరేందర్ గౌడ్ ఆరోపించారు. కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఘటనలో మమతా బెనర్జీ ప్రభుత్వం నేరస్థులను కాపాడేందుకు ఏవిధంగా ప్రయత్నించిందో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే తరహాలో నిందితుడిని రక్షించేలా వ్యవహరిస్తోందని తీవ్రంగా ధ్వజమెత్తారు. మహిళలు, మైనర్లపై వరుస అకృత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. కొద్దిరోజుల క్రితం ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్ మైనర్ బాలికతో అసభ్య వీడియోల్లో పట్టుబడితే కాంగ్రెస్, బీఆరఎస్‌లు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కనీస ప్రకటన కూడా చేయలేకపోయాయని వీరేందర్‌గౌడ్ విమర్శించారు. తుక్కుగూడ, మంఖాల్ ప్రాంతాల్లో విచ్చలవిడిగా పుట్టుకొచ్చిన హాస్టళ్లు, డ్రగ్స్ వాడకం, సరైన వివరాలు లేని ఇతర ప్రాంతాల వారి వల్ల శాంతిభద్రతలు క్షీణించి స్థానిక మహిళలు, విద్యార్థినులు భయాందోళనలతో జీవించాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిష్పాక్షికంగా, అత్యంత పారదర్శకంగా దర్యాప్తు జరిపి నిందితుడిని కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలని బీజేపీ తరఫున డిమాండ్ చేశారు. రాష్ట్ర పోలీసు యంత్రాంగంపై ప్రజలకు నమ్మకం కలిగేలా దర్యాప్తు జరగకపోతే కేసును తక్షణమే సీబీఐకు అప్పగించాలని వీరేందర్‌గౌడ్ డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




